గోల్డ్ స్కీమా! జాగ్రత్త!!

14 Mar, 2014 23:19 IST|Sakshi
గోల్డ్ స్కీమా! జాగ్రత్త!!

బంగారం.. ఎవరిని ఆకర్షించదు చెప్పండి! అందుకే అది బంగారమైంది. బంగారంలానే బంగారం డిపాజిట్ స్కీమ్‌లు కూడా అందరినీ ఆకర్షిస్తుంటాయి. నె లనెలా కొంత కట్టడం... చివరికి ఆ మొత్తంతో ఏదో ఒక నగ కొనుక్కోవటం. ఇలా చేసేవారికి ఆ స్కీము నడిపే సంస్థ బోనస్ కూడా ఇస్తుంటుంది. సాధారణంగా ఓ 11 నెలల పాటు నెలకు ఇంత అని నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే... దానికి బోనస్‌గా 12వ నెల మొత్తాన్ని సదరు సంస్థ వేయటమో, వేరే ప్రోత్సాహం ఇవ్వటమో చేస్తుంటుంది. చాలా వరకూ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లను బంగారం దుకాణాలే నిర్వహిస్తుం టాయి. మరి ఈ స్కీములు మంచివేనా? చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు ఇలాంటి పథకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండమని చెబుతుంటారెందుకు? దీన్లో లాభనష్టాలేంటి? ఈ వారం చూద్దాం...
 
ప్రయోజనాలు
ఈ స్కీముల్లో ఉండే ప్రధానమైన లాభమేంటంటే వాయిదాల పద్ధతిపై కొనుక్కోగలగటం. ఎందుకంటే బంగారమంటే ఖరీదైంది. ఒకేసారి కొనుగోలు చేయాలంటే కష్టం కాబట్టి వాయిదా పద్ధతుల్లో సొమ్ము చెల్లించి, కొనుక్కోవడం కొంత ఈజీ.
 
 చాలా స్కీమ్‌లలో ధరకు రక్షణ ఉంటుంది. స్కీమ్ ప్రారంభమైనపుడు ఎంత ధర ఉందో, అదే ధరకు బంగారం మీ చేతుల్లోకి వస్తుంది. మధ్యలో ధర పెరిగినా దాన్ని దుకాణదారే భరిస్తాడు.
 
నష్టాలు చాలానే..
దుకాణదారు చెల్లిస్తానని చెప్పే చివరి ఇన్‌స్టాల్‌మెంట్ పేపర్‌పై తప్ప డిపాజిట్‌దారుకు అందదు.
 
 కొన్ని స్కీమ్‌లలో ధర కు రక్షణ ఉండదు. ఈలోగా బంగారం రేటు పెరిగే ప్రమాదం ఉంటుంది.
 
 ఈపథకాల్లో బంగారాన్ని ఆభరణాల రూపంలో తప్ప నాణాలు, కడ్డీలుగా ఇవ్వరు. ఆభరణాలపై మేకింగ్ చార్జీలు భారీగా వడ్డిస్తారు.
 
 మీరు బంగారాన్ని సదరు దుకాణదారు దగ్గరే... అక్కడ ఉన్న మోడళ్లనే కొనుగోలు చేయాలి.
 
 ఈ స్కీమ్‌ల కింద డిపాజిట్లు వసూలు చేసేవారు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రారు.
 
 ఈదుకాణదారు కనక రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్నదీ ప్రశ్నార్థకమే. సాధ్యాసాధ్యాలను బట్టి చూస్తే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ల కన్నా బంగారం కడ్డీలు, నాణేలు లేదా బంగారం ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) చాలావరకూ ఉత్తమమన్నది నిపుణుల సలహా.
 

>
మరిన్ని వార్తలు