రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్..

18 Dec, 2023 15:28 IST|Sakshi

గడియారం అంటే 24 గంటలు నడుస్తుందని అందరికి తెలుసు, అయితే 10,000 సంవత్సరాలు నడిచే గడియారం అంటే? అదెలా ఉంటుందో తెలుసుకోవడానికి అందరూ తెగ ఉత్సాహపడిపోతారు. అలాంటి వాచ్ నిర్మించడానికి అమెజాన్ ఫౌండర్ భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పదివేల సంవత్సరాల పాటు పనిచేసే గడియారాన్ని నిర్మించడానికి జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 350 కోట్లు) పెట్టుబడి పెట్టారు. అమెరికాలోని టెక్సాస్‌ కొండలపై ఏర్పాటు చేయనున్న ఈ గడియారం పొడవు 500 అడుగుల వరకు ఉంటుంది. దీనిని 'లాంగ్‌ న్యూఫౌండేషన్‌' అనే సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే 'టిక్' అంటూ సౌండ్ చేస్తుందని చెబుతున్నారు.

ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ 'డానీ హిల్స్' (Danny Hillis) ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టుకి 'ది క్లాక్ ఆఫ్ ది లాంగ్ నౌ' అని పేరు పెట్టారు. ఇది దీర్ఘకాల ఆలోచనకు చిహ్నంగా, భవిష్యత్తు పట్ల మన బాధ్యతను గుర్తుచేయడానికి ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.

అమెరికాలో ఏర్పాటుకానున్న ఈ 500 అడుగుల అతి పెద్ద వాచ్ థర్మల్ సైకిల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సోలార్ సింక్రొనైజర్, పెండలం, చైమ్ జనరేటర్, గేర్లు, డయల్‌ వంటివి ఉండనున్నాయి.

ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం.. అనన్య సామాన్యం

త్వరలో నిర్మితం కానున్న ఈ అతి పెద్ద గడియారంలో ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్‌లు ఉండనున్నట్లు సమాచారం. మొదటి సంవత్సరం మొదటి ఛాంబర్, 10వ ఏడాదికి రెండవ ఛాంబర్, 100వ సంవత్సరం నాటికి మూడవ ఛాంబర్, 1000వ ఏడాదికి నాలుగవ ఛాంబర్, 10000వ ఏడాదికి ఐదవ ఛాంబర్ కేటాయించనున్నట్లు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు