తొమ్మిది పదుల వయసులో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!

20 Dec, 2023 11:16 IST|Sakshi

చదవాలన్న కోరిక ఉంటే వయసు పెద్ద సమస్య కాదని ప్రూవ్‌ చేసింది ఈ బామ్మ. వివిధ అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకునే వయసులో పట్టుదలతో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి శభాష్‌ అనిపించుకుంది. తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు సమకూర్చి చదువుకోమన్న చదవని యువతకు ఆదర్శం ఈ బామ్మ. ఈ వయసులో చదువుకోవడానికి కారణం?. ఇంతటి వృధాప్య వయసులో ఏజ్‌ రీత్యా వచ్చే సమస్యలను అధిగమించి మరీ మాస్టర్‌ డిగ్రీని ఎలా పూర్తి చేసింది అంటే..

యూఎస్‌కి చెందిన ఈ బామ్మ మిన్నీ పేన్‌. ఆమె తల్లిదండ్రులు చదువుకోని వస్త్ర కార్మికులు. ఆమె హైస్కూల్‌ చదువును మాత్రేమ పూర్తి చేసింది. ఆమె దక్షిణ కెరొలిన టెక్స్‌టైల్‌ మిల్లు వాతావరణంలోనే పెరిగింది. సరిగ్గా 1950లో తన హైస్కూల్‌ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో క్లర్క్‌గా పనిచేసింది. అంతకుముందు ఓ జూనియర్‌ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1961లో డేల్‌ని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇంట్లో కొన్నాళ్లు తల్లిగా పిల్లల ఆలనాపాలన చూసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యాయురాలిగా కెరియర్‌ ప్రారంభించింది. ఆ బామ్మ ట్రాన్స్‌క్రిపషినిస్ట్‌ వర్డ్‌ ప్రాసెసర్‌గా 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించి 68 ఏళ్ల వయసులో విరమణ తీసుకుంది. ఆ తర్వాత టెక్సాస్‌ ఉమెన్స్‌ యూనివర్సిటీలో చేరాలనుకుంది.

తాను చదవుకోలేకపోయిన కాలేజ్‌ చదువుని పొందాలనుకుంది. ఇక అండర్‌ గ్రాడ్యుయేట్‌లో భాగంగా జర్నలిజం, బిజినెస్‌ కోర్సులను తీసుకుంది. 73 ఏళ్ల వచ్చేటప్పటికీ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ బామ్మ ఇంటర్‌ డిసిప్లీనరీ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీని పూర్తి చేసి, అత్యంత వృద్ధ వయసులో పీజీ చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అంతేగాదు తన మనవడితో కలసి స్టేజ్‌పైకి వెళ్లి డిగ్రీని అందుకోవడం విశేషం.

తన తోటి గ్రాడ్యుయేట్‌లు ఆమెను చూసి స్ఫూర్తి పొందడమేగాక ఎంతగానో అభిమానించేవారు. చదువుకునే వయసులో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ తన కోరికను నెరవేర్చుకుంది. చాలామంది నేను అలా చేయాలనుకున్నాను, ఇది చేద్దామనుకున్నా.. అని కబుర్లు చెబుతూ నిటూర్పులు విడుస్తారు. సంయమనం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఏదో రకంగా అవకాశాన్ని దొరకబుచ్చుకుని మరీ తమ కలను సాకారం చేసుకుంటారనడానికీ ఈ బామ్మే ఉదాహరణ. 

(చదవండి: ప్లాస్టిక్‌ మంచిదికాదని స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ వాడుతున్నారా?)

>
మరిన్ని వార్తలు