ఇ.ఎం.ఫార్‌స్టర్‌

13 May, 2019 00:31 IST|Sakshi

గ్రేట్‌ రైటర్‌

ట్రివియా: ‘ద పారిస్‌ రెవ్యూ’ తన తొలి సంచిక (1953)లో ‘ద ఆర్ట్‌ ఆఫ్‌ ఫిక్షన్‌’ పేరిట వేసిన తొలి ఇంటర్వ్యూ ఇ.ఎం.ఫార్‌స్టర్‌ది. సాహిత్య చరిత్రలో అదొక గొప్ప సందర్భం. ఇంకే పత్రికైనా ఇలా కాకుండా మరోలా రచయితతో మాట్లాడలేని పరిస్థితిని ఆ సీరిస్‌ కలగజేసింది. ఎడ్వర్డ్‌ మోర్గాన్‌ ఫార్‌స్టర్‌ (1879–1970) ఇంగ్లండ్‌లో జన్మించాడు. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కానీ వారసత్వంగా వచ్చిన సంపద వల్ల పెంపకానికి ఏ ఇబ్బందీ కలగలేదు. పైగా రాసుకోవడానికి కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది. ‘ఎ రూమ్‌ విత్‌ ఎ వ్యూ’, ‘హోవార్డ్స్‌ ఎండ్‌’ లాంటి నవలలూ కథలూ వ్యాసాలూ విరివిగా రాశాడు. ఆంగ్ల రచయితలు, మేధావులు తాత్విక, నైతిక అంశాలను చర్చించుకునేందుకు ఒకచోట కలిసేవారు. అదే తర్వాత బ్లూమ్స్‌బరీ గ్రూప్‌గా ప్రసిద్ధి పొందింది. వర్జీనియా వూల్ఫ్‌ ఇందులో మరో సభ్యురాలు.

వ్యక్తిగత సంబంధాలు, ఆనందాల మీద వీరికి పట్టింపు ఎక్కువ. దేశం, స్నేహితుడు– ఈ రెండింటిలో ఎవరినైనా మోసం చేయాల్సిన సందర్భం వస్తే గనక దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంటుందని నమ్ముతానంటాడు ఫార్‌స్టర్‌. ఆయన పెళ్లి చేసుకోలేదు. స్నేహితులకు స్వలింగ సంపర్కుడని తెలుసు. బీబీసీకి పనిచేశాడు. యుద్ధ వ్యతిరేకి. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రదానం చేసే నైట్‌హుడ్‌ను తిరస్కరించాడు. దేవాస్‌ సంస్థానం మహారాజు మూడో తుకోజీరావుకు వ్యక్తిగత కార్యదర్శిగా భారతదేశంలో పనిచేశాడు. ఆ అనుభవాల సారంతో ప్రాచ్య పాశ్చాత్య సంబంధాలను చిత్రించిన ‘ఎ ప్యాసేజ్‌ టు ఇండియా’ (1924) ఫార్‌స్టర్‌ను తలుచుకోగానే గుర్తొచ్చే నవల. ఆయనకు ఎక్కువ పేరు తెచ్చినది కూడా. హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లోని ‘ఉర్దూ హాల్‌’ నిర్మాణానికి ఫార్‌స్టర్‌ భూరి విరాళం ఇచ్చివుండటం ఆయన్ని మనకు సన్నిహితం చేసే మరో అంశం.

మరిన్ని వార్తలు