ప్రపంచానికి జబ్బు చేసింది...

3 Apr, 2015 22:41 IST|Sakshi
ప్రపంచానికి జబ్బు చేసింది...

స్మరణీయులు / శారద
 
మిస్టర్ ప్రపంచంగార్కి మళ్లీ జబ్బు చేసింది. మంచాన పడ్డాడు. మిస్టర్ సామ్రాజ్యవాదం వెంటనే సర్ బూర్జువాకి కబురు చేశాడు. ఆయన కారేసుకు దిగాడు. సామ్రాజ్యవాదం ఆయనను చూడగానే ‘సర్ బూర్జువా. మిస్టర్ ప్రపంచం గార్కి మళ్లీ జబ్బు చేసింది. ఇదేం జబ్బో తేలాలి. డాక్టర్‌ని పిలవండి’ అన్నాడు.  ‘ఎవర్ని పిలిచేది’ అని అడిగాడు బూర్జువా. సామ్రాజ్యవాదంగారు బాగా ఆలోచించి ‘డా.సామ్యవాదంగారు ఉన్నాడే. ఆయన్నే పిలు’ అన్నాడు.  సర్ బూర్జువా కళ్లజోడు తుడిచి తగిలించుకొని ‘వాడా. ఛా..ఛా. వాడు ప్రతిదానికీ సోషలిజం ఇంజెక్షన్లు, రివల్యూషను సొల్యూషన్లూ ఇస్తానంటాడు’ అన్నాడు.  మిస్టర్ సామ్రాజ్యవాదం వినకుండా ‘వాడికి మిస్టర్ ప్రపంచంగారి తత్వం తెలుసు. పిలవండి. మందివ్వడానికి కాదు. రోగం ఏమిటో నిఖరంగా తేలడానికే’ అన్నాడు. బూర్జువా వెంటనే డాక్టర్ సామ్యవాదికి ఫోన్ చేశాడు. ఆయన అర్జెంటుగా వచ్చేశాడు. బూర్జువా గారూ, సామ్రాజ్యవాదం గారూ ఆయనకు మిస్టర్ ప్రపంచాన్ని చూపి జబ్బేమిటో తేల్చమన్నారు.

ఆయన చేయి పట్టుకొని చూసి ‘ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీని పేరు బానిసరోగం. దీనికల్లా ముందుగా రెవల్యూషన్ మందు ఘాటుగా తగలాలి. తర్వాత సోషలిజం ఇంజెక్షనులు నరాలలో ఎక్కించాలి. అప్పుడుగాని నయంగాదు’ అన్నాడు.
 ఇద్దరు పెద్దలూ ఉలిక్కిపడి ‘మిమ్మల్ని మందులు చెప్పమన్నామా? రోగం ఏమిటో తేల్చమన్నాంగాని. ఇదిగో ఈ డాలర్ ఫీజు పుచ్చుకుని దయచెయ్యండి’ అన్నారు. డాక్టరు సామ్యవాది వెళ్లిపోయాడు.  సామ్యవాది గడపదాటిన దగ్గర నుంచీ మిస్టర్ ప్రపంచంగార్కి రోగం ఎక్కువైంది. మంచం మీది నుంచి ఎగిరెగిరి పడుతున్నాడు. సంధిలోకి దిగింది వ్యవహారం.  సామ్రాజ్యవాదంగారు, బూర్జువాగారు మిస్టర్ ప్రపంచాన్ని మంచానికి కట్టేసి ఆలోచించారు. ఇక ఇది నయమయేదెట్లా? సర్ బూర్జువా చెప్పాడు- ‘ఉన్నాడు గదటయ్యా మన రావ్‌బహదూర్ సర్ మతవాది. ఆయనైతే ఈ పాడు విజాతీయ మందులు గాకుండా అచ్చం స్వజాతి గుళికలు, తైలాలు వేసి నయం చేస్తాడు. ఆయన్ని కబురు చేస్తున్నాను’ అని ఫోన్ చేశాడు.

 రావ్ బహుదూర్ సర్ మతవాది స్వంత విమానం మీద ఎక్కి వచ్చినాడు. ప్రపంచంగారి చెయ్యి చూచాడు. ‘దైవము కృపయుంచుగాక.మిస్టర్సూ... ఈ మిస్టర్ ప్రపంచానికి నాస్తిక టైఫాయిడ్ జ్వరం వంటబట్టింది. అంచేతనే ఇట్టా ఎగిరెగిరి పడ్తున్నాడు. ఇది నయమయే జబ్బు గాదు. అయినా నిద్ర పట్టేందుకు ఒక మిశ్రీత రసాయనం ఇస్తున్నాను’ అని రెండౌన్సులు వేదాంతం, రెండు గ్రాముల దైవభక్తి, మూడౌన్సులు అహింస కలిపి ఇచ్చాడు. సర్ బూర్జువా అన్నాడు- ‘మరేనండి. నిద్ర పోయినా నయమే. మేలుకొని ఉండి మరీ వేపుక తింటున్నాడు’.         
 
శారద (1924-1955) తెలుగువారికి పట్టని ఒక మహా రచయిత. తమిళ దేశం నుంచి తెలుగు ప్రాంతానికి వచ్చి, తెనాలిలో స్థిరపడి, తెలుగు అక్షరాలను కూడబలుక్కుని చదువుతూ నేర్చుకొని, తినడానికి తిండి లేకపోయినా పుస్తకాలనూ ప్రపంచ సాహిత్యాన్ని నమిలి భుజించి, తద్వారా నరాల జబ్బు తెచ్చుకొని, కడు దారిద్య్రంలో జీవిస్తున్నా ఈ నిస్సహాయ జనం చేతికి చైతన్యవంతమైన రచన అనే ఆయుధాన్ని ఇవ్వాలని తపించి, లెక్కకు మించి రచనలు చేసి, చేస్తూ చేస్తూనే అతి చిన్న వయసులో కన్నుమూసిన కలంవీరుడు, తిరుగుబాటుదారుడు శారద. అసలు పేరు ఎస్.ఎస్.నటరాజన్. జూలై 14, 1946లో అతడు రాసిన తొలి కథ, అతి చిన్న కథ, అతి శక్తిమంతమైన కథ ఎలా ఉందో చూడండి.
 

మరిన్ని వార్తలు