వాస్తవ ప్రపంచంలోకి....

26 May, 2014 22:28 IST|Sakshi
వాస్తవ ప్రపంచంలోకి....

స్పృహ
 
డిస్నీ వారి పాత్రలన్నీ కాల్పనిక ప్రపంచంలో సంచరిస్తుంటాయి. వినోదాన్ని పంచుతుంటాయి. బాగానే ఉందిగానీ, ఇలా ఎంతకాలం అనుకున్నాడు జెఫ్ హాంగ్ అనే అమెరికన్ యానిమేషన్ ఆర్టిస్ట్. డిస్నీ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత పాత్రలను ఎంచుకొని వాటిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు.
 
ఆయన గీసిన ఒక చిత్రంలో, సముద్ర కాలుష్యాన్ని తట్టుకోలేక మత్స్యకన్య బయటికి పరిగెడుతుంటుంది. పిల్లలకు ఈ బొమ్మను చూడడంతోనే ఎన్నో సందేహాలు వస్తాయి. ‘‘ఆమె ఎవరు? ఎందుకలా పరుగెడుతోంది?’’

‘‘మత్స్యకన్య గురించి మీరు బోలెడుసార్లు చదువుకొని ఉంటారు. ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం... ఆమె అలా ఎందుకు పరుగెడుతోందో’’ అంటూ సముద్ర కాలుష్యానికి గల కారణాలను వివరంగా పిల్లలకు చెప్పవచ్చు.
 
పచ్చటి అడవి నుంచి మొక్కలు లేని ఎడారి ప్రాంతంలోకి వచ్చిపడుతుంది ‘ఫూ’ అనే పాత్ర. అడవులు నరకడాన్ని గురించి ఈ చిత్రం చెబుతుంది. పర్యావరణ సంబంధమైన సమస్యలను మాత్రమే కాకుండా జంతుదయ, సేవాధర్మం... మొదలైన విషయాలను కూడా డిస్నీ పాత్రల ద్వారా చెప్పిస్తున్నాడు హాంగ్.
 
‘‘మేడల్లో మాత్రమే నివసించే డీస్నీ రాణి... ఒకవేళ పర్యావరణ కాలుష్యం ఉట్టిపడే ప్రాంతంలో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది?’’ అనే ఆలోచన నుంచి ‘అన్‌హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్’ సిరీస్ రూపుదిద్దుకుంది. ‘‘ఈ సిరీస్ చేస్తున్న క్రమంలో.... మనకు ఇన్ని సామాజిక సమస్యలు ఉన్నాయా?’’ అనిపించింది అని ఆశ్చర్యపోతున్నాడు హాంగ్. ‘‘మంచి విషయాలను పెద్దలు చెప్పడం కంటే, కార్టూన్ క్యారెక్టర్లు చెప్పడం ద్వారానే పిల్లలు త్వరగా గ్రహిస్తారు’’ అని ముచ్చటపడుతున్నారు సరికొత్త డిస్నీ బొమ్మలను చూసి తల్లిదండ్రులు.
 

>
మరిన్ని వార్తలు