నిద్రలేమితో మహిళలకు మరింత చేటు

4 Jul, 2018 00:33 IST|Sakshi

నిద్రలేమి వల్ల నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి ఫలితంగా పురుషుల ఆరోగ్యం కంటే మహిళల ఆరోగ్యం మరింతగా క్షీణించే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. అమెరికాలోని ఒక మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని 323 మంది మహిళలపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. వారిలో నిద్రకు సంబంధించి చిన్న చిన్న అవరోధాలు ఎదుర్కొన్న వారిలో రక్తపోటు పెరిగినట్లు గుర్తించారు.

రోజు మొత్తంలో ఏడు నుంచి తొమ్మిది గంటల సేపు నిద్రపోయినా, నిద్రలో తలెత్తే అవరోధాలు రక్తపోటును పెంచుతాయని ఈ అధ్యయనం ద్వారా గుర్తించామని అమెరికన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టడం, తగినంత సేపు నిద్ర లేకపోవడం, చెదురు మదురుగా నిద్ర పట్టడం వంటి తీవ్ర సమస్యలు ఉన్నట్లయితే రక్తపోటుతో పాటు గుండెజబ్బులకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు