రివాల్వర్‌ రాణి

11 Mar, 2018 00:02 IST|Sakshi

మెహరీన్‌ గురి చూసి కొట్టిందంటే హిట్‌ మీద హిట్టే ఇండస్ట్రీలో ఇప్పటిదాకా టార్గెట్‌ మిస్‌ కాలేదు ఫ్యాన్స్‌ గుండెల్లోకి దూసుకెళ్లడంలో కూడా గురి తప్పలేదు తెర మీద అందంగా కనపడటమే కాదు సమాజం పట్ల లోతైన అవగాహన ఉన్న అమ్మాయి తను ఒలింపిక్స్‌కి వెళ్లి షూటర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంది కానీ సినిమా షూటింగ్స్‌కి గురి పెట్టింది ఈ రివాల్వర్‌ రాణి

క్వొశ్చన్స్‌ ‘షూట్‌’ చేస్తాం.. రెడీగా ఉన్నారా?
ఓ యస్‌.. కమాన్‌ షూట్‌.

బ్యాగ్‌లో పిస్టల్‌ ఉందా?
(నవ్వేస్తూ).. లేదు. మా కజిన్‌కి ఇచ్చేశాను. ఆ పిస్టల్‌తో తను నేషనల్స్‌కి వెళుతున్నాడు.

యాక్చువల్లీ మీరూ నేషనల్స్‌కి వెళ్లాల్సింది.. మిస్సయ్యారు కదా?
అవును. సరిగ్గా ఎగ్జామ్స్‌ టైమ్‌. అందుకే మిస్సయ్యాను.

వెళ్లుంటే.. సినిమా షూటింగ్స్‌కి బదులు పిస్టల్‌ షూట్‌తో బిజీగా ఉండేవారేమో. ఒక్కసారి మీ ‘పిస్టల్‌ షూటింగ్‌’ గురించి షేర్‌ చేసుకుంటారా?
చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలని మా అమ్మగారు అనేవారు. నచ్చిన స్పోర్ట్‌ ఏదైనా సెలెక్ట్‌ చేసుకోమన్నారు. నేను ‘టామ్‌బాయ్‌’ టైప్‌. టాయ్‌ గన్స్‌తో ఆడుకునేదాన్ని. అమ్మాయిలకు నచ్చేవి ఏవీ నాకు పెద్దగా నచ్చదు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ లిప్‌స్టిక్స్, నెయిల్‌ పాలిష్‌ వంటివి నచ్చవు. గన్స్‌ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ‘ఎయిర్‌ పిస్టల్‌’ షూటింగ్‌ నేర్చుకుంటానన్నా. మా అమ్మగారు సరే అన్నారు. పిస్టల్‌ షూట్‌ అంటే గురి తప్పకూడదని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. దానివల్ల నాకు లైఫ్‌లోనూ ఫోకస్‌ పెరిగింది.

పిస్టల్‌ని కజిన్‌కి ఇచ్చారు. ప్రాక్టీస్‌ మానేశారా?
పంజాబ్‌ వెళ్లినప్పుడు షూటింగ్‌ రేంజ్‌కి వెళతాను. కాసేపు ప్రాక్టీస్‌ చేస్తాను.

బాగుంది.. ఆ షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చినా కూడా మీ లైఫ్‌లో షూటింగ్‌ కంటిన్యూ అవుతోంది..
(నవ్వేస్తూ) కరెక్టేనండి. ‘షూటింగ్‌’ అనే వర్డ్‌కి నా లైఫ్‌లో ఏదో తెలియని ఎటాచ్‌మెంట్‌ ఉంది. అప్పుడేమో గన్‌తో ఇప్పుడేమో సినిమా షూటింగ్‌తో. నాకు స్పోర్ట్స్‌ అంటే ఇష్టం ఉన్నప్పటికీ అదే ప్రొఫెషన్‌ అవ్వాలనుకోలేదు. రకరకాలు చేయాలని ఉండేది. అది ఒక్క సినిమా వల్లే కుదురుతుంది. వేరే ఏదైనా చేస్తే నేను మెహరీన్‌గానే ఉండాలి. అదే సినిమా అయితే మహాలక్ష్మిలా పల్లెటూరి అమ్మాయి (‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’) అవ్వొచ్చు. మేఘనలా మోడరన్‌ గాళ్‌ (‘మహానుభావుడు’).. రకరకాలుగా కనిపించొచ్చు. అందుకే ‘ఐ లవ్‌ సినిమా’.

‘ఆడపిల్లవి.. పిస్టల్‌ షూటింగ్‌ వద్దు’ అని మీ అమ్మగారు అనకపోవడం గ్రేటే?
మా అమ్మగారు చాలా స్ట్రాంగ్‌ ఉమెన్‌ అండి. కూతురు కూడా అలానే ఉండాలను కున్నారు. నా ఫ్రెండ్స్‌ అందరికీ మా అమ్మ రోల్‌ మోడల్‌. అమ్మలానే నేనూ స్ట్రాంగ్‌. లైఫ్‌లో ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్‌ మరింత స్ట్రాంగ్‌ చేస్తుందని నమ్ముతాను.

కాస్త సన్నబడ్డట్లున్నారు.. ఏదైనా క్యారెక్టర్‌ కోసమా? బొద్దుగా ఉన్నారని విమర్శలు వచ్చాయా?
క్రిటిసిజమ్‌ కాదు. నేను ఎప్పుడూ వర్కౌట్స్‌ చేస్తూనే ఉంటాను. కొంచెం తగ్గితే బాగుంటుందనుకున్నా.. తగ్గాను. అంతే. డైట్, వర్కౌట్స్‌ని ప్రాపర్‌గా ప్లాన్‌ చేసుకున్నాను.

సో... ‘గ్లామర్‌ ఇండస్ట్రీ’ని డీల్‌ చేయడం మీకు పెద్ద కష్టం కాకపోవచ్చు..
ఇండస్ట్రీ కాదు మన లైఫే చాలా క్రిటికల్‌. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. పెద్ద కాంపిటీషన్‌. లైఫ్‌ మనకు చాలా టీచ్‌ చేస్తుంది. నేను ఆ ఫ్లోతో వెళ్లిపోతుంటాను.

మీరు యాక్ట్‌ చేసిన సినిమాలు దాదాపు హిట్‌ కాబట్టి ‘లక్కీ లేడీ’ అనే ట్యాగ్‌ వచ్చింది. ఎలా ఫీల్‌ అవుతున్నారు?
దేవుణ్ణి బాగా నమ్ముతాను కాబట్టి ఇదంతా ఆయన ఇచ్చిందే అనుకుంటాను. నేను ఒకటి బలంగా నమ్ముతాను. మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అదే విషయాన్ని ఇంకెవరైనా మనకోసం కోరుకుంటే దేవుడు ఆ విషయాన్ని వెంటనే వింటాడని. నా మంచి కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టే నేను సక్సెస్‌ అవ్వగలుగుతున్నాను.

ఓకే... ఉమెన్స్‌డే సందర్భంగా ఏదైనా కొత్త డెసిషన్స్‌ తీసుకున్నారా?
ప్రతిరోజూ ఉమెన్స్‌డే అనే నమ్ముతాను. మా అమ్మగారు ఎప్పుడూ చెబుతుంటారు. హీరోలో ‘హర్‌’ ఉంటుంది. ఉమెన్‌ లేకుండా ఏదీ లేదని. ప్రపంచమే మహిళలది. మనం లేనిదే ఏదీ లేనప్పుడు మనం మన ఉమన్‌హుడ్‌ని ఎంజాయ్‌ చేయాలి. తలెత్తుకుని గర్వంగా బతకాలి. మనల్ని మనం రెస్పెక్ట్‌ చేసుకుని, మనల్ని మనం ప్రేమించుకుంటే ఏదైనా సాధించగలం అని నమ్ముతాను.

తెలుగు కొంచెం నేర్చుకున్నట్లున్నారు. ట్యూటర్‌ను పెట్టుకున్నారా?
 లేదు. మా టీమ్‌ అందరితోను  తెలుగులో మాట్లాడుతున్నాను. అలా అలవాటైపోయింది.

మరి నెక్స్‌›్ట సినిమాకు డబ్బింగ్‌ చెప్పుకుంటారా?
 అదే ఆలోచనలో ఉన్నాను. కచ్చితంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంటాను.

ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు ?
గోపిచంద్‌తో పంతం’. విజయ్‌ దేవరకొండతో తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ అనే సినిమా చేస్తున్నాను.

ప్రపంచమే మహిళలది అన్నారు. అలాంటి ప్రపంచంలో ప్రస్తుతం మహిళకు రక్షణ ఉందా?
ఈ మధ్య జరుగుతున్న విషయాలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఆడ, మగ అని తేడా గురించి వదిలేస్తే.. ఏ మనిషైనా బతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. ఆడవాళ్లకు ఒకలా, మగవాళ్లకు ఒకలా లేదు కదా. ఏ శరీరానికైనా నొప్పి ఒకటే కదా. అది తెలిసి కూడా ఒక అమ్మాయిని వేధిస్తున్నాడంటే అతను మనిషి ఎలా అవుతాడు? అతడ్ని మనిషి అంటే.. మానవ జన్మని ఇన్‌సల్ట్‌ చేసినట్లే. ఆడవాళ్లపై లైంగిక దాడులు అమానుషం అంటే.. సిరియాలో ఆ చిన్నపిల్లలు ఏం చేశారని అలా చంపుతున్నారు. అది ఎంత దారుణం. ఈ దారుణాలు విన్నప్పుడు ‘దేవుడా... శిక్షించకుండా ఉండకు’ అనుకుంటుంటాను.

మొన్న శ్రీదేవిగారు చనిపోయినప్పుడు బోలెడన్ని సర్జరీల వల్ల అని, డైటింగ్‌ వల్ల అని.. ఇలా ఆవిడ మరణం గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు.. అది విన్నప్పుడు ఎలా అనిపించింది?
నిన్నటిదాకా కనిపించిన మనిషి ఎప్పటికీ కనిపించే అవకాశం లేదు. ఆ మనిషి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాలి కానీ చెడు ఎందుకు? చనిపోయినవాళ్ల గురించి తప్పుగా మాట్లాడటం అస్సలు కరెక్ట్‌ కాదు. ఈ భూమ్మీద బతికిన 54 ఏళ్లల్లో 50 ఏళ్లు మనల్ని ఎంటర్‌టైన్‌ చేశారు ఆవిడ. అలాంటి ఆవిడకు మనం గౌరవమైన నివాళి ఇవ్వాలి. ఆ సంగతలా ఉంచితే.. శ్రీదేవిగారిని చనిపోనివ్వనందుకు ‘థ్యాంక్స్‌ టూ సినిమా.. అండ్‌ థ్యాంక్స్‌ టూ కెమెరా’.  ఆమెను మళ్లీ మళ్లీ చూసుకునే అవకాశం కల్పించింది.

సెలబ్రిటీలు ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్నా అవేం పట్టించుకోకుండా నెగటివ్‌గా మాట్లాడటానికి రెడీ అయిపోతారు. సో.. సెలబ్రిటీగా ఉండటం శాపం అని అనుకుంటారా?
అస్సలు అనుకోను. అదో బ్లెస్సింగ్‌లా భావిస్తాను. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించేవాళ్లు చాలామంది ఉంటారు ఇక్కడ. మాలాగా అవ్వాలనుకునే వాళ్లూ ఉంటారు. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేయగలుగుతాం. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. మంచిని మాత్రమే తీసుకుంటూ వెళ్లిపోవడమే.

సోషల్‌ మీడియాలో వచ్చే కాంప్లిమెంట్స్, క్రిటిసిజమ్‌ గురించి..
సోషల్‌ మీడియా మమల్ని ఫ్యాన్స్‌కు దగ్గర చేస్తుంది. విమర్శలు ప్రతి చోటా ఉంటాయి. ప్రతి ఒక్కర్నీ మనం ఇంప్రెస్‌ చేయలేం. అందరూ మనల్ని ప్రేమించేలా కూడా ఉండలేం. మిమ్మల్ని ప్రేమించేవాళ్లను తిరిగి ప్రేమించాలి. హేట్‌ చేసేవాళ్లను కూడా లవ్‌ చేస్తే ఏదో రోజు వాళ్లు రియలైజ్‌ అవుతారు. సింపుల్‌.

క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మీరు వినే ఉంటారు. మీకలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఏమైనా?
నేను చాలా లక్కీ. అలాంటివి ఎప్పుడు నాకు ఎదురుపడలేదు. సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందుకే దేవుణ్ణి ‘నన్ను చాలా జాగ్రత్తగా చూసుకో’ అని ప్రార్థిస్తుంటా. ఐ లవ్‌ మై జాబ్‌. ఇష్టంగా సినిమాలు చేస్తున్నా.

మీకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఏదైనా ఉందా?
‘బాహుబలి’లో దేవసేన లాంటి క్యారెక్టర్‌ చేయాలని ఉంది. అనుష్కగారంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అలాంటి పాత్‌బ్రేకింగ్‌ సినిమా చేసే అవకాశం వస్తే నా అంత ఆనందపడేవాళ్లు ఉండరేమో. అలాగే రాజమౌళిగారి లాంటి దర్శకులతో వర్క్‌ చేయాలన్నది నా డ్రీమ్‌.

దేవసేన గుర్రపు స్వారీ చేసింది.. మీరు?
కొంచెం కొంచెం వచ్చు. అలాంటి క్యారెక్టర్‌ వస్తే ఫుల్‌గా నేర్చుకుంటా. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం.

ఇంతకీ ఆ కొంచెం గుర్రపు స్వారీ ఎప్పుడు నేర్చుకున్నారు?
మా ఫ్యామిలీ గుర్రాలను పెంచుతారు. అలా కొంచెం నేర్చుకున్నాను

ట్రెడిషనల్‌తో పాటు గ్లామర్‌ రోల్స్‌ కూడా చేస్తారా?
ట్రెడిషన్, గ్లామరస్‌.. ఏ రోల్‌ అయినా నాకు ఓకే. మంచి సినిమాలో భాగం అవ్వాలని మాత్రం అనుకుంటాను.

మీరు సినిమాలను ప్రేమిస్తారు. మిమ్మల్మి  చాలా మంది ప్రేమిస్తారు. మీ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటి?
నేను కెమెరాతో లవ్‌లో ఉన్నాను. కెమెరా ఈజ్‌ మై సోల్‌మేట్, కెమెరా ఈజ్‌ మై లవర్‌.

మీతో జీవితం పంచుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటున్నారు?
అర్థం చేసుకునేవాడు. పేరెంట్స్‌ వల్ల కాకుండా తనంతట తాను పేరు తెచ్చుకునేవాడు. మహిళలను గౌరవించేవాణ్ణి ఇష్టపడతా.

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు