కలంకారి ఇంపుగా.. హాయిగా..

9 Apr, 2014 22:35 IST|Sakshi

సౌకర్యం, సంప్రదాయాలను అనుసరించి కాలానుగుణంగా వేషధారణల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికే మళ్ళీ చిన్న చిన్న మార్పులను జోడించి, ట్రెండ్ సృష్టించడమే ఫ్యాషన్. వేసవిలో చెమటను పీల్చుకునే దుస్తులను, లేత రంగులను ఇష్టపడతారు. ఆ విధంగా కాటన్ క్లాత్‌కు, ‘కలంకారి’ డిజైన్లకు  చరిత్ర ఎంతో ఉంది. ఈ రెండింటినీ జోడించి కొత్త కొత్త దుస్తులను సృష్టిస్తే... ఈ వేసవి కూల్‌గానే కాదు మరింత ‘కళ’ గానూ మారిపోతుంది.
 
 నూలు వస్త్రంపై సహజసిద్ధమైన రంగులతో చేసిన డిజైన్లు కాబట్టి ‘కలంకారి’ దుస్తులు కంటికి ఇంపుగా, ఒంటికి మెత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తాయి. వీటిలో ‘పెన్ కలంకారి’ డిజైన్లు ఖరీదు ఎక్కువ. ప్రింటెడ్ ‘కలంకారి’ వస్త్రాలు ఖరీదు తక్కువే! కాబట్టి స్తోమతను బట్టి, సౌకర్యాన్ని బట్టి కలంకారికి ఆధునిక సొబగులను ఎన్నైనా అద్దవచ్చు.
 
 వేసవి ఫ్యాబ్రిక్స్‌తో...
 వేసవిలో సింథటిక్ దుస్తులు చర్మంపై ర్యాష్‌కు కారణం అవుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకని వేసవికి అనుకూలమైన నూలు, నార, లినెన్, రేయాన్, కోటా, మల్‌మల్, శాటిన్, కోరా ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి ‘కలంకారి’ ఫ్యాబ్రిక్‌ను జోడిస్తే వినూత్నమైన దుస్తులు వేషధారణలో ‘కళ’తీసుకువస్తాయి.
 
 టాప్ టు బాటమ్...
 తలపైన కలంకారి టోపీ, అదే కాంబినేషన్‌లో కలంకారి వెయిస్ట్‌కోట్, ముదురు ఆకుపచ్చ లెహంగాకు చేసిన కలంకారి ప్యాచ్ వర్క్, హ్యాండ్ బ్యాగ్.. ఎండలో చార్మ్‌గా వెలిగిపోవడానికి మంచి ఎంపిక కలంకారి.
 
 ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళ కలంకారి. ఎన్ని రకాలుగా ఉపయోగించినా బోర్ అనిపించని కలంకారి ఫ్యాబ్రిక్‌తో లెక్కలేనన్ని డిజైన్లు తీసుకురావచ్చు. సహజంగా ‘కలంకారి’ని బెడ్‌షీట్స్, దిండుగలేబులుగా వాడుతుంటారు. నేను దీంట్లో ఒక ట్రెండ్‌ను సృష్టించి, స్టైలిష్ ఫ్యాబ్రిక్‌గా పరిచయం చేయాలనుకున్నాను. ఆ విధంగానే జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైన ఆధునిక దుస్తుల్లో కలంకారి డిజైన్లను మెరిపించాను. నేను ఎక్కువగా ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు, ఆలివ్.. రంగుల కలంకారి ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తాను. దాంట్లో టాప్స్ పై వేసుకొని జాకెట్స్, బాటమ్‌గా చురీ ప్యాంట్స్, పొడవైన కుర్తాలు.. ఇలా చాలా రకాలుగా సృష్టించాను. చీరలు, లెహంగాలు, కుర్తాలు, జంప్‌సూట్స్...ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ముంబయ్, ఢిల్లీ, ప్యారిస్ నుంచి కూడా నాకు కలంకారి దుస్తులకు ఆర్డర్లు వస్తుంటాయి. ఇది రీ సైకిల్ ఫ్యాబ్రిక్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇచ్చామంటే మరింత వెలిగిపోతుంది. వేసవిలో కలంకారి రంగులు, ప్రింట్లు కూల్ ఫీలింగ్‌ను ఇస్తాయి.
 - అస్మితా మార్వా, ఫ్యాషన్ డిజైనర్
 
 ఖర్చు తక్కువ...
 ‘అచ్చు కలంకారి’ ఖరీదు తక్కువే! ప్రింటెడ్ కలంకారి ఫ్యాబ్రిక్ మీటర్ ధర రూ.100 నుంచి లభిస్తుంది. అదే పెన్ కలంకారి అయితే డిజైన్ బట్టి ధర వేల రూపాయల్లో ఉంటుంది.
 
 వెరైటీ డిజైన్లు...
 పొడవు పొట్టి లెహంగాలు, వెయిస్ట్ కోట్‌లు, జాకెట్లు, కుర్తాలు, హారమ్ ప్యాంట్స్, ఫ్రాక్‌లు.. ‘కలంకారి’తో వీటిలో ఎన్నో ప్రత్యేకతలను చూపించవచ్చు.
 
 యాక్ససరీస్..
 పర్సులు, బ్యాగులు, పాదరక్షలు, టోపీలు, చెవి ఆభరణాలు.. కలంకారి డిజైన్లతో కనువిందు చేస్తుంటే వాటిని అలంకరణలో భాగం చేసుకొని మరింత ప్రత్యేకంగా వెలిగిపోవచ్చు.

మరిన్ని వార్తలు