బడిలో అమ్మ భాష లేదు

26 Aug, 2019 08:07 IST|Sakshi
లధాక్‌ సంప్రదాయ దుస్తుల్లో గీతాంజలి

పరిచయం  గీతాంజలి

గీతాంజలి సామాజిక కార్యకర్త, ఎంటర్‌ప్రెన్యూర్, విద్యావేత్త, ఒడిస్సీ నాట్యకారిణి, రష్యన్‌ బాలే నర్తకి. వీటితోపాటు కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించారామె. లధాక్‌లో విద్యా సంస్కరణ బాధ్యతను తలకెత్తుకున్నారు.దాంతోపాటు ఆమె దేశంలోని ప్రతి అమ్మాయికీ కరాటే నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. ‘స్త్రీ సాధికారత సాధన అనేది ఒక కలగా మిగలకూడదు. ఆ కల సాకారం కావాలంటే స్త్రీ... తన మీద జరిగే దాడులను తనకు తానుగానే సమర్థంగా ఎదుర్కోగలగాలి’ అంటారు గీతాంజలి.

ఫెయిలవుతున్నది పిల్లలు కాదు
కశ్మీర్‌లోని లధాక్‌లో పిల్లల మీద... ‘బడికి రార’నే అపవాదు ఉండేది. నూటికి 95 మంది పిల్లలు మధ్యలోనే బడి మానేసేవాళ్లు. ఏడాదంతా బడికి వెళ్లిన పిల్లల్లో కూడా పై తరగతికి పాస్‌ అయ్యే వాళ్లకంటే ఫెయిల్‌ అయ్యే వాళ్లే ఎక్కువ. నిజానికి ఇక్కడ ఫెయిల్‌ అయింది పిల్లలు కాదు, ప్రభుత్వ విద్యావిధానం. ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యావిధానం లధాక్‌ వాసుల భాషకు, స్థానిక సంస్కృతికి పూర్తిగా భిన్నంగా ఉండడమే. దాంతో లధాక్‌లో విద్యాసంస్కరణకు, ప్రత్యామ్నాయ విద్యావిధానానికి బీజం పడింది. పిల్లలు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములయ్యారు. మంచు స్థూపాలను కడుతున్నారు, కృత్రిమమైన హిమానీనదాలను సృష్టిస్తున్నారు. పిల్లలు ఇష్టపడే ఇలాంటి కార్యకలాపాలే పిల్లల్ని స్కూలుకు దారి వెతుక్కుంటూ పరుగులు తీయించాయి. చిన్న పిల్లలు నీటి కొరతను తీర్చడంలో నిమగ్నమవుతుంటే, పెద్ద పిల్లలు సోలార్‌ హీటెడ్‌ మడ్‌ బిల్డింగ్స్‌ నిర్మాణంలో నిష్ణాతులవుతున్నారు. దాంతో ఓ యూనివర్సిటీ క్యాంపస్‌ ఎకో విలేజ్‌గా మారింది. గీతాంజలి కార్పొరేట్‌ రంగాన్ని వదిలి లధాక్‌ దారి పట్టింది ఇలాంటి విద్యాసంస్కరణ కోసమే.

లాహోర్‌ టూ లధాక్‌ వయా పాండిచ్చేరి
ఒరిస్సాలోని బాలాసోర్‌లో పుట్టిన గీతాంజలి మూలాలు లాహోర్‌లో ఉన్నాయి. దేశ విభజన సమయంలో గీతాంజలి తాతగారు లాహోర్‌ నుంచి పంజాబ్‌కి వచ్చి స్థిరపడ్డారు. ఆమె క్రిస్టియన్‌ మిషనరీ కాన్వెంట్, కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. పదహారేళ్ల వయసులో పాండిచ్చేరి పర్యటన ఆమె దృక్పథాన్ని మార్చేసింది. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంలో భారతీయ ఆధ్యాత్మికత సారాన్ని ఒంటపట్టించుకున్నారు. తత్వం, వేదం, ఉపనిషత్తులను చదివారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ తర్వాత భువనేశ్వర్‌లోని గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ చేశారు. చదువు పూర్తయిన తర్వాత డెన్మార్క్‌లో మార్కెటింగ్‌ విభాగంలో పనిచేశారామె. ఉద్యోగ జీవితం నుంచి మెల్లగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు గీతాంజలి.  పుషన్‌ ప్రాజెక్ట్స్‌ పేరుతో ఇంజనీరింగ్‌ ఫర్మ్‌ స్థాపించారు. చెన్నై కేంద్రంగా హీలియోస్‌ పుస్తక ప్రచురణ సంస్థ కూడా ఆమె మానస పుత్రికే. పాండిచ్చేరిలో ఏయుఎమ్‌ హాస్పిటల్స్‌ను సమర్థంగా నిర్వహించారు. ఇన్నింటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా వాటన్నింటికీ దూరంగా వెళ్లి పోయారు. ‘ఇప్పుడు లధాక్‌ పిల్లల కోసం మంచి భవిష్యత్తుని డిజైన్‌ చేస్తున్నానని, అందులో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండబోద’’ని అంటున్నారామె తన నిర్ణయం పట్ల సంతోషంగా.

అవసరాలే ఆలోచనలు
గీతాంజలి ఇప్పుడు లధాక్‌లో ‘హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌’(హియల్‌) విద్యాసంస్థ సీఈవో. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌తోపాటు ఆమె విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. లధాక్‌లోని పైయాంగ్‌ గ్రామంలో స్థాపించిన హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌లో విద్యావిధానాన్ని లధాక్‌లో స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ‘‘మనదేశంలో మైదాన ప్రాంతంలో భవన నిర్మాణానికీ, లధాక్‌లో భవన నిర్మాణానికి ఒకటే ఫార్ములా పని చేయదు. మైదాన ప్రదేశాల్లో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా భౌగోళిక సమతుల్యత లేని నేలలకు అనువైన నిర్మాణ విధానాన్ని కరికులమ్‌లో చేర్చుకోవడం లేదు. అందుకే భౌగోళిక స్థితికి అనుగుణంగా భవన నిర్మాణం చేయడంతోపాటు స్థానిక వనరులే పెట్టుబడిగా చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి అనువైన కోర్సులను కూడా ప్రవేశ పెట్టాం’’ అన్నారు గీతాంజలి.

అక్కడ ఇప్పుడు ఎకో రెస్పాన్సివ్‌ హోమ్స్‌ కడుతున్నారు. అంటే... లధాక్‌లోని విపరీతమైన చల్లదనం దృష్ట్యా ప్లస్‌ ఇరవై డిగ్రీల సెల్సియస్‌ నుంచి మైనస్‌ ఇరవై డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేటట్లు ఇళ్లను నిర్మించడం అన్నమాట. వరదలు, కొండ చరియలు విరిగి పడకుండా నివారించే ఉపాయాలను కూడా సమ్మిళితం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. ‘‘ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పబ్లిషింగ్, హెల్త్‌కేర్‌  రంగాల్లో అనేక సంస్థల వ్యవస్థాపకురాలిగా, నిర్వహకురాలిగా ఇరవై ఏళ్ల కాలంలో పొందిన సంతోషంకంటే లధాక్‌లో చేస్తున్న సర్వీస్‌తో పొందుతున్న ఆనందమే ఎక్కువ’’ అన్నారామె. గీతాంజలి లధాక్‌ పిల్లలతో ఎంతగా కలిసిపోయారంటే... స్కూలుకి వెళ్లేటప్పుడు తరచుగా లధాక్‌ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. దీనివల్ల పిల్లలు తనను తమలో ఒకరిగా చూస్తారని చెప్పారామె. ‘‘పిల్లలు టీచర్‌ను, విద్యాసంస్థల నిర్వహకులను సొంత మనుషులుగా స్వీకరించడం చాలా అవసరం. అప్పుడే టీచర్‌ చెప్పిన మంచిని అనుసరిస్తారు, ఆ విద్యాసంస్థ నియమాలను గౌరవిస్తారు’’ అన్నారు గీతాంజలి.

చెన్నై నేర్పిన పాఠాలు
గీతాంజలి 2015లో చెన్నైలోని కేంబ్రిడ్జి స్కూల్‌ సీఈవోగా పనిచేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూలు బాధ్యతలు చూసేవారు. శని, ఆదివారాలు పాండిచ్చేరిలోని హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘నేను స్కూల్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తొలి వారంలో ఆ స్కూల్లో పని చేస్తున్న గణితం, ఫిజిక్స్‌ టీచర్లు ఉద్యోగం మానేశారు. వాళ్లిచ్చిన నోటీస్‌ పీరియడ్‌ అప్పటికి అయిపోయింది, కానీ ఆ లోపు కొత్త టీచర్ల నియామకం జరగలేదు. దాంతో స్కూలు యాజమాన్యం ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా నన్ను కోరింది. కొత్తవాళ్లను రిక్రూట్‌ చేసుకునే వరకు పాఠాలు చెప్పకుండా పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదు. పిల్లలు నేర్చుకోవాల్సిన సమయాన్ని వృథా చేయడం పెద్ద నేరం. అలాగని ఏదో ఒక టీచర్‌కి అడిషనల్‌ డ్యూటీ వేయడం కూడా అన్ని వేళలా సమర్థనీయం కాదు. అందుకే ఆ పాఠాలను బాగా చదువుకుని, ఒక స్టూడెంట్‌లాగ ప్రిపేరయ్యి టీచర్‌గా క్లాస్‌ రూమ్‌లో అడుగుపెట్టాను. చెన్నై స్కూల్లో పాఠాలు చెప్పినన్ని రోజులు మా అబ్బాయి ఆర్యన్‌తో పాటు నేను కూడా హోమ్‌ వర్క్‌ చేసేదాన్ని. నిజానికి అప్పుడు వేసిన ఆ అడుగే ఇప్పుడు నన్ను లధాక్‌కు చేర్చింది. స్కూలు నిర్వహణ నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పాఠాలు చెప్పడం... అలా కాదు. ఏదో మానసిక సంతృప్తి, మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని కలకాలం నిలుపుకోవాలనుకున్నాను. లధాక్‌లో పరిస్థితులు తెలిసిన తర్వాత నా చదువు, నా ఇష్టాలు, నైపుణ్యాలన్నింటినీ ఏకకాలంలో సద్వినియోగం చేసుకోవచ్చనిపించింది’’ అన్నారామె.

బడిలో అమ్మ భాష లేదు
లధాక్‌... పేరుకి మనదేశంలో భాగమే కానీ జీవనశైలి, సంస్కృతి టిబెట్‌కు దగ్గరగా ఉంటుంది.  భాష వేరు, ఆహారం వేరు, ఆహార్యం వేరు. అక్కడి వాళ్లు లధాకీ భాష మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇల్లు దాటి బడిలో కాలు పెట్టిన చిన్ని మెదళ్లను ఒక్కసారిగా అయోమయం ఆవరిస్తుంది. ఇంటి గుమ్మం వరకు మాట్లాడిన లధాకీ భాషకు తాళం పెట్టి రాష్ట్ర అధికార భాష ఉర్దూలో పెదవి విప్పాల్సిందే. అదే లధాక్‌ వాసుల జీవితాలను తరాలకు తరాలు వెనక్కు నెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు వేలు సంవత్సరం వరకు అక్కడ మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసిన వాళ్ల సంఖ్య ఐదు శాతానికి లోపే.

అమ్మానాన్నల బహుమతి
మా అమ్మానాన్నలు నాకు  ‘నమ్మకం, స్వేచ్ఛ’ అనే రెండు బహుమతులనిచ్చారు. ఏ పిల్లలకైనా అంతకంటే పెద్ద వరాలు మరేవీ ఉండవు. ఉన్నది ఒక్కటే జీవితం, అందులోనే మన ఆలోచనలను, ఆశయాలను నెరవేర్చుకోవాలి. మనల్ని మనం ఎన్నో కోణాల్లో ఆవిష్కరించుకున్నప్పుడే మనలో కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకు లియోనార్డో డా విన్సీనే పెద్ద ఉదాహరణ. ఆ చిత్రకారుడిలో... ఓ గణిత మేధావి, వృక్ష శాస్త్రజ్ఞుడు, ఇంకా గొప్ప తత్వవేత్త కూడా ఉన్నారు. ఒక మెదడులో ఇన్ని రకాల జ్ఞాన సంపద ఉన్నప్పుడు... అవన్నీ ఊరికే ఉండవు. అనుక్షణం ఒకదానితో ఒకటి ప్రేరేపితమవుతూనే ఉంటాయి. కొత్త ఆవిష్కరణలకు బీజం పడేది  కూడా అలాంటప్పుడే. హియల్‌ (హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌) పుట్టుక కూడా అలాంటిదే. ఇందులో మేము అనుసరిస్తున్న విధానం ‘లెర్నింగ్‌ బై డూయింగ్‌’. పిల్లలు తామేం నేర్చుకోవాలో దానిని అక్షరాలలో చదువుతూ నేర్చుకోవడంతో సరిపెట్టరు. ఆ పని చేస్తూ నేర్చుకుంటారు. ఇలా చదువుకోవడం వల్ల వాళ్లు పెద్దయిన తర్వాత ఒకరి దగ్గర ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం గడపరు, ఎంటర్‌ప్రెన్యూర్‌ మారి సొంతంగా సంస్థను స్థాపించి నిర్వహించుకోగలుగుతారు.– గీతాంజలి,హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌విద్యాసంస్థ సహస్థాపకురాలు

శాంతి యోధులు
గీతాంజలి హియల్‌లో అమ్మాయిలకు కరాటే క్లాసులు కూడా తీసుకుంటారు. తాను తయారు చేసిన కరాటే యోధులకు ‘పీస్‌ఫుల్‌ వారియర్స్‌’ అని పేరు పెట్టారు. ఆమె శిక్షణలో తొలి బృందం సర్టిఫికేట్‌లు అందుకున్నది. వీరి సహకారంతో లధాక్‌ రీజియన్‌లోని ప్రతి మహిళకూ కరాటే నేర్పించాలనేది గీతాంజలి ఆలోచన. ‘‘కరాటే ప్రాక్టీస్‌ అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ అవసరం. రాబోయే పదేళ్లలో దేశంలోని విద్యార్థినులందరూ కరాటే బ్లాక్‌బెల్ట్‌ సాధించేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరతాను. నలభై ఆరేళ్ల జీవితంలో అనేక ప్రయోగాలు చేశాను, అంతే స్థాయిలో విజయాలనూ సాధించాను. హియల్‌ విద్యాసంస్కరణ తర్వాత పీస్‌ వారియర్స్‌ను దేశమంతటా విస్తరించడం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను’’ అన్నారు గీతాంజలి. – వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు