అన్ని వికారాలకు అదే మూలం

6 Jan, 2019 00:54 IST|Sakshi

కలాం కలలు

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటూ సామాజిక పరిశుభ్రతకోసం పరితపించిన వారిలో విశేషంగా చెప్పుకోదగిన వ్యక్తి మహాత్మాగాంధీ. అబ్దుల్‌ కలాంగారు కూడా అందుకే ‘‘స్వచ్ఛమైన భూగోళం కోసం, స్వచ్ఛమైన శక్తికోసం నిరంతరం శ్రమిస్తాను’’ అని విద్యార్థులచేత ప్రమాణం చేయించేవారు. ఇంకొన్ని రోజుల్లో ప్రాణం వదిలిపెట్టేస్తారన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా బాధపడిన అంశం–మన దేశంలో చాలా మంది ఆరోగ్యం నశించిపోవడానికి కారణం– ప్లాట్‌ఫారమ్‌ మీద ఆగి ఉండగా ప్రయాణికులు రైళ్లలోని శౌచాలయాల్లో మలమూత్ర విసర్జన చేయడం–అన్న విషయం. అలా చేసినప్పడు అవి స్టేషన్లలోని పట్టాల మధ్యలోనిలిచి పోతాయి. వాటిమీద వాలిన ఈగలు, దోమలు, సూక్ష్మక్రిములు అక్కడే తిరుగుతూ ప్లాట్‌ఫారాలమీద అమ్మే, ప్రయాణికులు తినే ఆహార పదార్థాలమీద వాలి నేరుగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రైలు ప్రయాణికులలో చంటిపిల్లలు, వృద్ధులు, రోగులు మాత్రమే కాదు, అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వ్యాధిగ్రస్తులవుతారు.

చదువుకున్నవారయినా, చదువులేనివారయినా అక్కడ ప్రయాణ హడావుడిలో విచక్షణ కోల్పోయి అనారోగ్యానికి బలవుతున్నారు. విద్యార్థులుగా మీరు దీని పట్ల అవగాహన పెంచుకుని మీరు పాటించడమే గాదు, మీ ఎదురుగా మరెవరయినా స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళలో శౌచాలయాలు వినియోగించకుండా చూడండి.అలాగే పల్లెలు, పట్టణాలు,నగరాలు అనే తేడా లేకుండా అనుసరిస్తున్న మరొక చెడ్డ అలవాటు – బహిరంగ మలమూత్ర విసర్జన. ఇది మన పరిసరాలను, మన ఆరోగ్యాన్నే కాకుండా మన దేశ గౌరవాన్ని కూడా పాడు చేసి అప్రతిష్ఠ తీసుకు వస్తున్నది. మరుగుదొడ్లు కట్టుకుంటామంటే ఇప్పుడు ప్రభుత్వాలుకూడా డబ్బిస్తున్నాయి. అలాగే శక్తి ఎప్పడూ కూడా స్వచ్ఛమైనదై ఉండాలి. నేను ఏది తింటే అది నాకు శక్తిగా మారుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచి రోగనిరోధక శక్తితోపాటూ మంచి శక్తిని కూడా పొందుతున్నా. కుళ్ళిన ఆహారాన్ని తీసుకుంటే వెంటనే శరీరం రోగగ్రస్థమైపోయి నీరసపడిపోతాం.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వ్యాయామాల ద్వారా బలంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే సమస్త శక్తులకూ కారణమయిన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మరొక ఎత్తు. కళ్ళతో, చెవులతో, ముక్కుతో, స్పర్శతో మనం గ్రహించే వాటితో మన మనసు కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల మనం లోపలికి గ్రహించే వాటిపట్ల మనం సర్వదా అప్రమత్తంగా ఉండాలి. నిల్వ ఉన్న పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకుంటే అవి మీ ఆరోగ్యాన్నేకాక, మీ మనసును కూడా ప్రభావితం చేస్తాయి. అలా కాకుండా మీ మనసును ఎంతగా నియంత్రించి శక్తిమంతం చేసుకుంటే మీమనస్సులోంచి అంత మంచి ఆలోచనలు వస్తాయి. మీరు ఎంత మంచి ఆహారాన్ని పుచ్చుకుంటే అంత మంచి శక్తి మీ శరీరం నుండి విడుదలవుతుంది.నిలకడగా ఒక చోట ఉండగలిగేటట్లు, మీ ఆలోచనలను స్థిరంగా ఉంచగలిగేటట్లు, మీ చదువుసంధ్యలపట్ల మీ శ్రద్ధాసక్తులు నిశ్చలంగా ఉండేటట్లు మీ శరీరాన్ని, మీ మనసును నియంత్రించుకోగలగాలి. ప్రయత్నపూర్వకంగా అది అది అలవాటుగా చేసుకోవాలి. అలా వ్యక్తిగతంగా మీ వద్ధి, తద్వారా మీ వంటి ఉత్తమ పౌరులతో దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.

అపురూపం
హతజోడి:హతజోడి లేదా హస్తజోడి అనేది ఒక అరుదైన మూలిక. రెండు మూడంగుళాల పరిమాణంలో ఉండే ఈ మూలిక చూడటానికి ముకుళించిన హస్తాల రూపంలో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ఎక్కువగా నేపాల్‌లోని లుంబినీ లోయలోను, అమర్‌కంటక ప్రాంతంలోను దొరుకుతుంది. ఉమ్మెత్తజాతికి చెందిన ఒక మొక్కకు చెందిన మూలిక ఇది. మొక్క బాగా ఎదిగిన తర్వాత దాని వేళ్లు జోడించిన చేతుల ఆకారంలోకి రూపుదిద్దుకుంటాయి. హతజోడి మూలికను చాముండేశ్వరీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. దృష్టిదోష నివారణకు, దుష్టశక్తుల కారణంగా తలెత్తే అనర్థాల నివారణకు హతజోడి మూలిక అద్భుతంగా ఉపయోగపడుతుందని తంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. పూజ మందిరంలో చాముండేశ్వరీ దేవి ఎదుట హతజోడి మూలికను ఉంచి, దానిని ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షతలతోను, ధూప దీప నైవేద్యాలతోను అర్చించాలి. దీనిని ఉంచి చాముండేశ్వరి హోమం జరిపించడం మరీ శ్రేష్ఠం. అలా పూజించిన తర్వాత  ఎర్రని వస్త్రంలో కట్టి డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీనిని తాయెత్తులో ఉంచి భుజానికి లేదా మెడలో ధరించినట్లయితే, కార్యసిద్ధి, మానసిక స్థైర్యం కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుటబడతాయి. 
– పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు