Gandhi Support to Kill Stray Dogs: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు?

8 Oct, 2023 08:47 IST|Sakshi

ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. 

సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని  కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్‌టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి,  తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. 

ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్‌లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ‍ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు.

ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు.

‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్‌ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది.
ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?

మరిన్ని వార్తలు