మలబారులో తెలుగు వెలుగులు

8 Oct, 2013 00:04 IST|Sakshi
మలబారులో తెలుగు వెలుగులు

ఒక ప్రాంత సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అక్కడ విహారయాత్రలు చేయనక్కర్లేదు.. ఒక ప్రాంత జీవనశైలిని అర్థం చేసుకోవాలంటే వారితో కలిసి జీవించనక్కర్లేదు.. అధ్యయనం ద్వారా మరో ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి చాలా సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఆలోచనతో తమ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీ వాళ్లు. ప్రత్యేకించి తెలుగు వారి జీవన శైలి గురించి, తెలుగు సంస్కృతి గురించి, ఈ సంస్కృతిలోని ప్రముఖ వ్యక్తుల గురించిన వివరాలను అందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ కాలేజీ చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వశిష్ట్ అందించారు. తాము ప్రతియేటా తమకళాశాల విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు. తెలుగు సినిమా, తెలుగు సంస్కృతుల గురించి ప్రత్యేకమైన ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 2007 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహిస్తున్నామన్నారు.
 
 తెలుగు భాష గురించి, తెలుగు సినిమా గురించి ఆసక్తితో ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన తెలిపారు. దాదాపు 1,200 మంది స్ట్రెంగ్త్ ఉన్న తమ కాలేజీలో ఈ కార్యక్రమానికి మంచిస్పందన వచ్చిందని ఆయన వివరించారు. ప్రత్యేకించి కేరళ యువతలో తెలుగు సినిమా గురించి విపరీతమైన ఆసక్తి ఉందని, అనేక తెలుగు సినిమాలు మలయాళంలోకి డబ్బింగ్ అవుతున్నాయని వశిష్ట్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం తెలుగు సినిమాలపై ఆసక్తి ఉన్న యువతకు ఆకర్షణీయంగా మారిందన్నారు. సినిమాల ద్వారా జాతీయ సమగ్రతను చాటడానికి, తెలుగు సంస్కృతిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని వశిష్ట్ పేర్కొన్నారు.
 
 ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి ’ది లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా’ అని పేరుపెట్టుకొన్నామని, ఈ కార్యక్రమాన్ని ఇటీవలి కాలంలోనే రెండుసార్లు నిర్వహించామని తెలిపారు. దీనిపై మంచి స్పందన వచ్చిందని, విద్యార్థులతో పాటు బయటి వాళ్లు కూడా ప్రదర్శనను చూడటానికి వచ్చారని ఆయన తెలిపారు. తెలుగు సినిమా ప్రముఖులు, వారి సినిమా బయోగ్రఫీ, తెలుగు వార్తాపత్రికలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తెలుగు వారి మనస్సాక్షి ’సాక్షి’కి ప్రముఖ స్థానం దక్కింది. ఐదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకొన్న సాక్షిని ప్రతిష్టాత్మక పత్రికగా అభివర్ణిస్తూ నిర్వాహకులు ప్రదర్శనలో స్థానమిచ్చారు.

మరిన్ని వార్తలు