అమ్మ తీర్చిదిద్దిన మాస్టర్‌

1 Dec, 2019 04:17 IST|Sakshi

యువతరంగం

విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే... అపజయం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఓటములను విజయాలుగా మార్చుకోవాలంటే కఠోర శ్రమతోపాటు చెదరని ఆత్మస్థైర్యం కూడా నీకుండాలని అమ్మ, శిక్షకులు చెప్పిన మాటలు ఆ చిన్నారిని ఎన్నో అవరోధాలు అధిగమించి విజయ శిఖరం చేరుకునేలా చేశాయి. హంగేరిలో జరిగిన అంతర్జాతీయ స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ పోటీల్లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాను సొంతం చేసుకునేలా చేశాయి. దీంతో ఇండియన్‌ రైల్వేస్‌ హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. 2008లో మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరెడ్డి నిండు మనస్సుతో వృద్ధిలోకి వస్తావని ఇచ్చిన ఆశీర్వచనం ఆ యువకుడిలో ఎంతో స్ఫూర్తిని నింపడమే కాకుండా అది నిజమయ్యిందని ఆ కుటుంబం ఎంతో మురిసిపోతోంది.

నాన్న ఆశయం... అమ్మ కష్టం
గుంటూరుకు చెందిన చింతగుంట శివరామ్‌ రెడ్డి, భారతిల రెండో కుమారుడు  మెహర్‌ చిన్నారెడ్డి. శివరామ్‌కు చెస్‌ అంటే ప్రాణం కావడంతో తన కుమారుడైన మెహర్‌కు ఆరేళ్ళ ప్రాయంలో ఆయనే చెస్‌ శిక్షణలో చేర్పించారు. రోజూ దగ్గరుండి శిక్షణకు తీసుకెళ్ళే వారు. మెహర్‌కు ఏడేళ్ళు వచ్చేసరికి 2002లో అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెదారు. తల్లి భారతికి పెద్దగా చదువులేదు. ఎప్పుడూ గడప దాటి బయటకు వచ్చింది లేదు. ఇద్దరు చిన్న బిడ్డలతో ఏం చేయాలో తెలీని పరిస్థితి. మరోవైపు భర్త ఇచ్చిన బాధ్యతతోపాటు ఆశయాలను నెరవేర్చాలి. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముతూ తన బిడ్డలను ఉన్నదాంట్లో పోషించుకుంటూ ముందుకెళ్ళింది. బిడ్డల పోషణతోపాటు మెహర్‌ను ఇతర ప్రాంతాలకు పోటీలకు తీసుకెళ్ళేది. తల్లి కష్టాన్ని చూసిన మెహర్‌ కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగాడు.

ఆట కోసం శిక్షణనిస్తూ...
మెహర్‌ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకునే సరికి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పిల్లలకు ఆన్‌లైన్‌ చెస్‌ పాఠాలు బోధిస్తూ అంతో ఇంతో సంపాదించడం ప్రారంభించాడాయువకుడు. అలా తన పోటీలకు తానే సంపాదించుకోవడంతోపాటు రాంకీ లాంటి సంస్థలు కొంత ఆర్థిక చేయూతనందించాయి. దీంతో సుమారు 15 దేశాల్లో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని తన రేటింగ్‌ను మెరుగుపరచుకున్నాడు. ఈ ఏడాది మేలో హంగేరీలో జరిగిన స్ప్రింగ్స్‌ ఫెస్టివల్‌ అంతర్జాతీయ చెస్‌ పోటీల్లో పాల్గొని తొలిసారి 2400 రేటింగ్‌ను అధిగమించడంతో ‘ఇంటర్నేషనల్‌ మాస్టర్‌’ హోదా సాధించాడు.

బలహీనతలు ఆవరిస్తే ...
అది 2015 బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ చెస్‌ పోటీలు అవతలవైపు రష్యాకు చెందిన గ్రాండ్‌ మాస్టర్‌ ఇయాన్‌ చెపరినాతో మ్యాచ్‌. అందరూ విజయం ఏకపక్షమే అనుకున్నారు. మరొకరైతే ఒత్తిడికి లోనయ్యే వారే అయితే మెహర్‌ మాత్రం చిరునవ్వుతో గేమ్‌ను ప్రారంభించాడు. దాదాపు విజయానికి చేరువలోకి వచ్చిన సమయంలో చేసిన చిన్నపొరపాటుతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. చెపరినాకు చెమటలు పట్టినంత పనయ్యింది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు మెహర్‌ ఆటను చూసి విస్మయం చెందారు. మెహర్‌కు ఆర్థిక వెసులుబాటు ఉండి అన్ని టోర్నమెంట్‌లు ఆడగలిగితే ఈ పాటికే గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకునే వాడు. అయితే తన రేటింగ్‌ ప్రస్తుతం 2426 ఉంది.

– మురమళ్ళ శ్రీనివాసరావు సాక్షి, గుంటూరు వెస్ట్‌
ఫోటోలు: గజ్జల రామ్‌గోపాల్‌ రెడ్డి.

సాధించిన విజయాలు
►2006 ఇరాన్‌లో జరిగిన అండర్‌–12 బాలుర టోర్నమెంట్‌లో బంగారు పతకం.
►2007లో డిల్లీలో జరిగిన కామన్‌ వెల్త్‌ అండర్‌–14 విభాగంలో రజత పతకం.
►2011లో నాగ్‌పూర్‌లో జరిగిన 12వ జాతీయ నేషనల్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య  పతకం.
►2014లో దిండిగల్‌లో జరిగిన నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం.
►2015లో కాకినాడలో జరిగిన ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్ర«థమ స్థానం. అదే ఏడాది విజయవాడలో జరిగిన ఇదే టోర్నమెంట్‌లోనూ ప్రథమ స్థానం.
►దీంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించాడు.

మరిన్ని వార్తలు