త్రీమంకీస్ - 84

10 Jan, 2015 23:17 IST|Sakshi
త్రీమంకీస్ - 84

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 84
 మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘ఎఫ్‌ఈఏఆర్ ఫియర్‌కి రెండు ఫుల్‌ఫార్మ్‌లు ఉన్నాయి. ఒకటి ఫర్‌గెట్ ఎవ్విరిథింగ్ అండ్ రన్. మరోటి ఫేస్ ఎవ్విరిథింగ్ అండ్ రైజ్. మనం పోలీసులతో ఏం చెప్పాలంటే...’’
 కపీష్ చెప్పేది ఇద్దరూ శ్రద్ధగా విన్నారు.
 ‘‘అవును. అలా చెయ్యచ్చు’’ వానర్ సంభ్రమంగా చెప్పాడు.
 ‘‘నిజమే. భలే’’ మర్కట్ కూడా మెచ్చుకున్నాడు.
 మరోసారి ముగ్గురూ కపీష్ చెప్పిన పథకాన్ని పునరావలోకనం చేసుకున్నాక అందులో ఎలాంటి లొసుగులూ లేవని నిశ్చయించకున్నారు.
 ముగ్గురూ ఉత్సాహంగా ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్ బూత్ వైపు నడవసాగారు.
 (భశుం)
 
 ముగింపుగా ఓ చిన్న మాట
 
 నేను రచనలు ఆరంభించిన నలభై ఐదేళ్ళ క్రితానికీ, నేటికీ సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రేమ విషయంలో కానివ్వండి, సంపాదన విషయంలో కానివ్వండి, మరి దేంట్లోనైనా, మనం దిగజారి ‘అధర్మంగా ఉండకూడదు’ అనే నియమం చాలా వరకూ వీగిపోయింది. ఆ ప్రభావం సమాజంలోని భాగమైన నేటి యువత మీద కూడా పడి, వారు షార్ట్‌కట్ సంపాదన మీద అధికంగా ఆశ పడుతున్నారని, జల్సాల డబ్బు కోసం తప్పులు చేయడానికి వారు వెరవడం లేదు అని దినపత్రికల్లోని అనేక వార్తలు చెప్తున్నాయి. ఎక్కువమంది యువతలో ప్రేమబంధం కూడా గతంలోలాగా బలంగా ఉండటం లేదు. ఈ సామాజిక నేపథ్యంలో అలాంటి పాత్రలతో రాసిన క్రైం, కామెడీ నవల ‘త్రీ మంకీస్’ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను.

 కేటాయించిన తక్కువ చోటులో సస్పెన్స్‌ని సృష్టించి నిలబెట్టగలగడం కష్టం. అందువల్ల పాఠకుడి చేత నిత్యం చదివించడానికి సస్పెన్స్‌తో పాటు హాస్యం మీద కూడా ఆధారపడ్డాను. గతంలో సీరియల్స్‌లో కావాలని ఓ తప్పు రాస్తూండేవాడిని. పాఠకులు దాన్ని పట్టుకుని పాయింట్ అవుట్ చేస్తే వారు బాగా చదువుతున్నారనే అంచనా కోసం కమర్షియల్ రైటర్‌గా నేను అప్పట్లోని ప్రతీ సీరియల్లో తేలిగ్గా దొరికే ఓ తప్పు రాసేవాడిని. అలాగే దీంట్లో కూడా ఓ తప్పు రాశాను. ఓ పాఠకురాలు మాత్రమే దాన్ని వివరించమని కోరుతూ రెండు మెయిల్స్ పంపారు. ప్రియా చెన్నారెడ్డి గారూ! కోకోకోలా స్పెల్లింగ్ కరెక్ట్ మేథ్స్ ఫార్మూలా ‘హాఫ్ సర్కిల్ (అర సున్నా= సి) ఫుల్ సర్కిల్ (పూర్తి సున్నా=ఓ) హాఫ్ సర్కిల్ (అర సున్నా= సి) ఏ (కోకో) హాఫ్ సర్కిల్ (అర సున్నా= సి) ఫుల్ సర్కిల్ (పూర్తి సున్నా=ఓ) రెక్టాంగిల్ (ఎల్) ఏ (కోలా) వెరసి కోకోకోలా అవుతుంది. నేను దీన్ని తప్పుగా మార్చి రాశాను. థాంక్స్ ఫర్ పాయింటింగ్ అవుట్. ఓ పాఠకుడు పాకిస్థాన్ మీద జోక్స్ రాసి వారిని కించపరచడం నా స్థాయికి చెందింది కాదని, అలాగే ఫేస్‌బుక్‌లో కనపడే జోక్స్‌ని సీరియల్‌లో రాయడం దేనికని విమర్శించారు. ఏది ఏమైనా సీరియల్ మీద స్పందించి తమ అభిప్రాయాలని తెలియచేసిన వందల కొద్దీ పాఠకులకి, మంచి బొమ్మలు గీసిన శ్రీ అన్వర్‌కి, నాకీ అవకాశాన్ని ఇచ్చిన ‘సాక్షి’ సంపాదక వర్గానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ,
 - మల్లాది వెంకట కృష్ణమూర్తి
 హైద్రాబాద్
 8 జనవరి 2015
 
 

మరిన్ని వార్తలు