ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న

30 Jan, 2018 05:03 IST|Sakshi
రేగుమొక్కల కాయలను పరిశీలిస్తున్న వేణుగోపాలనాయుడు

ప్రకృతి సేద్యపద్ధతిలో 4 ఎకరాల్లో పశుగ్రాసం, ఎకరంలో వరి,15 సెంట్లలో యాపిల్‌ బెర్‌ సాగు

తక్కువ ఖర్చుతో సంతృప్తికరమైన ఆదాయం

ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్‌లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్‌తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు.

ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్‌ బెర్‌ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్‌ ద్వారా అందిస్తున్నారు.  ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు.

రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్‌ బెర్‌ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్‌ బెర్‌ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్‌ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు.

– పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా

>
మరిన్ని వార్తలు