ఉభయ కుశలోపరి!

8 Oct, 2017 10:58 IST|Sakshi

ప్రియమైన పాఠకులకు వినమ్రతతో వ్రాయు లేఖ!ఉభయ కుశలోపరి. నేను క్షేమం. మీరు క్షేమమేనని తలస్తున్నాను. ముందుగా మీకు ‘ప్రపంచ తపాలా దినోత్సవ’ శుభాకాంక్షలు. అబ్బో... అదెప్పుడు అంటారా? అక్టోబర్‌ çపదో తేదీనండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాని రోజుల నుంచి ఎన్నో దశాబ్దాలుగా మానవాళికి సేవలందిస్తూ వస్తున్న విభాగం తపాలా శాఖ! ఎస్‌ఎంఎస్‌లు లేని రోజుల్లో ఒక కార్డు ముక్కకు ఎంత విలువ ఉండేదో ఇది వరకటి తరానికి తెలిసిన ముచ్చటే! ఎన్నో ఉత్తరాలు... ఎన్నెన్నో విశేషాలను చేరవేసేవి. మంచిచెడుల సమాచారాన్ని బంధుమిత్రుల నుంచి మోసుకొచ్చేవి. ఉత్తరాల బట్వాడానే ప్రధాన విధిగా నిర్వర్తిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవలి కాలంలో బ్యాంకింగ్, బీమా వంటి ఇతర సేవలనూ ప్రారంభించింది. ఎన్ని అదనపు సేవలు ఉన్నా, తపాలా శాఖ అంటే అందరికీ ఠక్కున స్ఫురించేవి ఉత్తరాలే! ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలా శాఖ ముచ్చట్లు కొన్ని మీ కోసం...

నాటి నుంచి నేటి వరకు..!?
మనసుకు దగ్గరైన వారు దూరంగా ఉన్నప్పుడు మూగబోయిన భావాలు అల్లే అక్షరమాలికే లేఖ!! మరి మీరెప్పుడైనా ఎవరికైనా మనసు కోవెలను పరచి హృదయాంతరంగాలను రాతల్లో చూపించే ప్రయత్నం చేశారా? అదేనండి లేఖలెప్పుడైనా రాశారా అని? మీ వయసు ఫార్టీ ప్లస్‌ అయితే అసలు సిసలైన లేఖను ఎప్పుడో ఒకప్పుడు రాసే ఉంటారు. ఫార్టీ మైనస్‌ అయితే మాత్రం స్కూల్లో టీచర్‌ నేర్పించే డమ్మీ లేఖలను మార్కుల కోసం రాసుంటారు!! ఇంటర్నెట్, మొబైల్‌ఫోన్లు విస్తరించడంతో ఈ రోజుల్లో మనోభావాలను పంచుకునే లేఖలు పూర్తిగా కనుమరుగైపోయాయనే చెప్పుకోవాలి.

లేఖల్లో ప్రేమలేఖ...
ఉత్తరం కోసం చూసే ఎదురుచూపులో ఆప్యాయత... మనం పంపించే ఉత్తరంలో ఎనలేని అనుబంధం... కాలంతో పాటు ఏనాడో కనుమరుగయ్యాయి. ఈ రోజుల్లో లేఖ అనగానే ప్రేమలేఖ అంటున్నారు యువత. ఎదురుగా వెళ్లి ప్రపోజ్‌ చెయ్యాలంటే అకాల అంగవైకల్యంలాంటివేమైనా సంభవిస్తాయేమోననే భయంతో తెలివైనవాళ్లు ఎన్నుకున్న సులభమైన మార్గం ప్రేమలేఖ. అయితే స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌లు వాటిని కూడా మరుగున పడేలా చేశాయి.

ఎగరలేని పిట్ట...!?
ఉత్తరమంటే చెదరని మధురమైన జ్ఞాపకం. కానీ ఆన్‌లైన్‌ యుగంలో... డేటా రాజ్యంలో ట్విట్టర్‌ పిట్ట కూత మోతలుపెట్టాక.. 20వ శతాబ్దం ఆరంభం వరకు ఓ వెలుగు వెలిగిన తోకలేని పిట్ట(ఉత్తరం) ఎగరడం మానేసింది. ఫోన్ల రాకతో మరుగునపడ్డ ఉత్తరాలు ఇప్పుడు ఆత్మీయ పలకరింపులకు కాకుండా బ్యాంకులు, గవర్నమెంట్‌ నోటీసులకు మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. పల్లెల్లో సైతం స్మార్ట్‌ ఫోన్‌లు ట్రింగ్‌మంటున్న తరుణంలో ఈ–మెయిల్స్, మెసేజ్‌ల దాటికి ఉత్తరాలు పూర్తిగా ఉనికిని కోల్పోయాయి. ఇక తపాలా సేవల రాజ్యంలోకి ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలు అడుగుపెట్టడంతో తపాలా ప్రాభవం కొంత తగ్గింది.

అలనాటి ఆనవాళ్లు...
శుభవార్తకు పసుపుని, అశుభవార్తకు నల్లని రంగును ఆనవాలుగా పెట్టేవారు. మరణవార్తను మోసుకొచ్చిన ఉత్తరాన్ని చదివిన వెంటనే చించి పారేయాలన్నది నమ్మకంగా పాటించేవారు. ఇక అలనాటి స్మృతుల్లో మనోభావాలను పలికించే లేఖలకు ప్రత్యేక స్థానం ఉంది. గాంధీ, నెహ్రూ వంటి ఎందరో మహానుభావుల మనోగతాలను మనముంగిట నిలిపిన ఆధారాల్లో లేఖలకు ప్రత్యేక స్థానముంది.

లేఖతోనూ ప్రేమించండి!!
గోరుముద్దలు తినిపించిన అమ్మకో.. గుండెలపై ఆడించిన నాన్నకో.. ఆత్మీయతను పంచే భార్యకో.. మీరే లోకమని నమ్మే లవర్‌కో మీ మనసులోని మాటను రాతలో చెప్పండి. ఎందుకంటే.. మనిషి చెప్పే మాటలకంటే.. మనసు పలికే భావాలు చాలా తియ్యగా ఉంటాయి. అంతరంగాల మధ్య గాఢతను పెంచుతాయి. మన అనుకున్నవారిని మరింత దగ్గరచేస్తాయి. మనసువిప్పి మాట్లాడే మాటలకంటే మనసుతెరిచి రాసే మనోభావాలకే బరువెక్కువ. ప్రయత్నించండి!

లేఖ చరిత్ర
క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాటికే లేఖలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ క్రీస్తుశకం 17,18 శతాబ్దాల నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలోకొచ్చాయి. ఇప్పటి స్టాంపులు, ఎన్వలప్‌లు మాత్రం క్రీస్తుశకం 1840లో క్వీన్‌ విక్టోరియా హయంలో మనకు అందుబాటులోకి వచ్చాయట. విక్టోరియా హయాంలోనే తపాలా శాఖ ఏర్పడింది. ప్రభుత్వాల అధీనంలో తపాలా శాఖలు లేని రోజుల్లోనూ ఉత్తరాలు ఉండేవి. వాటిని బట్వాడా చేసేందుకు ‘వార్తాహరులు’ ఉండేవారు. అంచెలంచెలుగా వీరు ఉత్తరాలను గమ్య స్థానాలకు చేర్చేవారు. పావురాల ద్వారా కూడా ఉత్తరాలను బట్వాడా చేసేవారు.

ఇట్లు,
మీ శ్రేయోభిలాషి,
– సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు