నారింజ క్యాన్సర్‌ నివారిణి

3 Jul, 2018 00:12 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

నారింజ పండ్లు అంటే వ్యాధుల నివారణకు అడ్డుగోడలా నిలిచే రక్షణ కవచాలని అర్థం. పీచు ఎక్కువ, వ్యాధినిరోధకతను కలిగించే పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ కావడం వల్ల వీటిని కాస్త ఎక్కువగా తిన్నా లాభమే తప్ప నష్టం లేదు. నారింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... 

►నారింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. ∙కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్‌ వంటి బయోఫ్లేవనాయిడ్స్‌ సమర్థంగా అరికడతాయి. అందువల్ల నారింజలను తినేవారు దీర్ఘకాలం యౌవనంగా ఉంటారు. ∙నారింజపండ్లలో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నారింజ చాలా వ్యాధులకు రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. ∙నారింజలో పీచు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి నారింజ బాగా తోడ్పడుతుంది. 

►మనలోని కొలెస్ట్రాల్‌ను అరికట్టడం ద్వారా రక్తప్రవాహం సాఫీగా జరగడానికి నారింజ బాగా ఉపయోగపడుతుంది. ఈ కారణం వల్ల గుండె ఆరోగ్యం దీర్ఘకాలం బాగుండటమే కాకుండా, చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయి. అంతేకాదు... ఈ పండులోని పొటాషియమ్‌ రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ఈ కారణం గా చూసినా ఇది గుండెకు మంచిది. ∙ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. ∙ఇందులో విటమిన్‌–ఏ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపునూ మెరుగుపరుస్తుంది.  

మరిన్ని వార్తలు