వారానికి రెండు రోజులు మద్యానికి దూరంగా..

10 Sep, 2018 12:11 IST|Sakshi

లండన్‌ : అతిగా మద్యం సేవించే వారు ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు, మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు వారానికి రెండు రోజులు లిక్కర్‌ హాలిడే పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు అతిగా మద్యం సేవిస్తున్నారని, ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.వారంలో రెండు రోజులు మద్యం తీసుకోకుండా లక్ష్యంగా నిర్ధేశించుకోవాలని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ మద్యపాన ప్రియులను కోరింది.

రోజూ రాత్రి డిన్నర్‌తో పాటు ఓ గ్లాస్‌ వైన్‌ తీసుకునే వారిలో మూడింట రెండు వంతుల మంది మద్యం ముట్టకుండా ఉండటం పొగతాగడం వదిలివేయడం కన్నా కష్టమని భావిస్తున్నట్టు దాదాపు 9000 మందిపై నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది.  మద్యంతో కాలేయ వ్యాధులతో పాటు హైబీపీ, గుండె జబ్బులు, పలు క్యాన్సర్లు వచ్చే ముప్పు అధికమని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డంకన్‌ సెల్బీ హెచ్చరించారు.

మద్యపానంతో త్వరగా స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రతివారంలో కనీసం రెండు, మూడు రోజులు మద్యం ముట్టకుండా టార్గెట్‌గా పెట్టుకుంటే మద్యం తక్కువగా తీసుకున్న ఫలితంగా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. వారానికి వరుసగా రెండు రోజులు మద్యానికి విరామం ఇస్తే కాలేయ వ్యాధులతో పాటు తీవ్ర అనారోగ్యాల ముప్పును తప్పించుకోవచ్చని పలు అథ్యయనాలు సూచిస్తున్నాయి. నిత్యం మద్యపాన సేవించడం ద్వారా కేలరీలు అధికమై ఒబెసిటీకి దారితీయడంతో పాటు టైప్‌ టూ మధుమేహం బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు