తాగుడుకు పైసలు లేవని.. ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం..

18 Oct, 2023 08:17 IST|Sakshi

నల్గొండ: మద్యం తాగడానికి డబ్బులు లేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్‌ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్‌ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సత్తయ్య మద్యానికి బానిసయ్యాడు.

సోమవారం రాత్రి మద్యం తాగేందుకు అతడి వద్ద డబ్బులు లేకపోడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌ మృతి
విద్యుత్‌ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్‌ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప నుంచి గద్వాల్‌ జిల్లాకు విద్యుత్‌ స్తంభాలు లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్‌ సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో విద్యుత్‌ స్తంభాలు తీసుకెళ్తున్న లారీ క్లీనర్‌ గుగులోతు నితిన్‌(20) క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి సక్రాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు