ఈవారం విశేషాల రౌండప్‌

10 Apr, 2017 01:08 IST|Sakshi
ఈవారం విశేషాల రౌండప్‌

కొలనులో మత్స్యకన్య!
ఫ్రెస్నో పట్టణంలోని ఒక కొలను నుంచి నగ్నంగా బయటికి వచ్చిన ఈ యువతిని చూసి కాలిఫోర్నియా పోలీసులు మొదట నివ్వెర పోయారు. ఆ తర్వాత ఆమె చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయారు. తనొక మత్స్యకన్యనని ఆమె చెప్పడమే వారి ఆశ్చర్యానికి కారణం. ఆమె తన పేరును జోవాన్నాగా చెప్పుకుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, తను మత్స్యకన్యను అని చెప్పడానికి సాక్ష్యంగా ఆమె వేళ్లు కలిసి ఉన్న పాదాలను చూపించడం పోలీసులను మరోసారి తికమకపెట్టింది. చివరికి ఈ కథ ఏమయింది? మత్స్యకన్య తిరిగి కొలనులోకి వెళ్లిందో లేదో కానీ, పోలీసులు తమ విధులకు తాము వెళ్లిపోయారు. పాదాల వేళ్లు కలిసిపోయి ఉండడాన్ని ‘వెబ్‌డ్‌ ఫీట్‌’ అంటారు. జన్యులోపం వల్ల ఇలా అవుతుంది. ఈ లోపాన్ని జోవాన్నా తనది మానవజన్మ కాదని, మనిషీ చేపా కలసిన ‘మెర్మెయిడ్‌’ (మత్స్యకన్య) జన్మ అని నమ్మించడానికి ఉపయోగించుకున్నట్లుంది.

డాడీ ఢమాల్‌
‘టెర్మ్‌–టైమ్‌’ అనే మాట బ్రిటన్‌ స్కూళ్లలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆ టైమ్‌లో స్కూళ్లు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటాయి. ఎంతో అత్యవసరం అయితే తప్ప టెర్మ్‌–టైమ్‌లో సెలవు తీసుకోడానికి ఉండదు. అయితే జోన్‌ ప్లాట్‌ అనే బ్రిటన్‌ తండ్రి టెర్మ్‌ టైమ్‌ నిబంధనలను ఉల్లంఘించి మరీ తన 7 ఏళ్ల కూతుర్ని డిస్నీ వరల్ట్‌ టూర్‌కి తీసుకెళ్లి, స్కూలు ఆగ్రహానికి గురయ్యాడు! హెడ్‌మాస్టర్‌ అనుమతి లేకుండా కూతురి చేత సెలవు పెట్టించినందుకు స్కూలు యాజమాన్యం జోన్‌ ప్లాట్‌కు 60 పౌండ్ల జరిమానా (సుమారు 5 వేల రూపాయలు) విధించింది. ‘ఇది అన్యాయం. నేను జరిమానా కట్టేది లేదు’ అని కోర్టుకు వెళ్లాడు జోన్‌. 2015 నుంచి ఆ కేసు కోర్టులో నడుస్తోంది. రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సారాంశం ఏమిటంటే... ‘జోన్‌ జరిమానా కట్టాల్సిందే’ అని! అంతే కాదు, కోర్టు ఆ తండ్రికి 12,000 పౌండ్ల అదనపు జరిమానాను (9 లక్షల 54 వేల రూపాయలు) కూడా విధించింది. దీనిపై జోన్‌ ప్లాట్‌ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడితే మరి కొంత జరిమానా కట్టవలసి వస్తుందని శ్రేయోభిలాషులైన న్యాయ నిపుణులు కొందరు జోన్‌ను హెచ్చరించడంతో ఇప్పటికైతే ఊరుకున్నాడు.

కేసు ట్రంపు ట్రంపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అనేక దేశాలలో గోల్ఫ్‌ కోర్స్‌లు ఉన్నాయి. స్కాట్లాండ్‌లో కూడా ఓ గోల్ఫ్‌ కోర్స్‌ ఉంది. ఆ గోల్ఫ్‌ కోర్స్‌కు వ్యతిరేకంగా కరోల్‌ రొహాన్‌ బైట్స్‌ అనే బ్రిటిష్‌ మహిళ కొంతకాలంగా పోరాడుతోంది. గోల్ఫ్‌ కోర్స్‌ను అక్కడి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్‌. ఈలోపు గోల్ఫ్‌కోర్స్‌ సిబ్బంది ఆమెపై కేసు పెట్టారు. గోల్ఫ్‌కోర్స్‌లో ఆమె మూత్రవిసర్జన చేశారని ఆరోపిస్తూ, అందుకు సాక్ష్యంగా వీడియోను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో కేసు ఇంకో మలుపు తిరిగింది. తను మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోను చిత్రీకరించడం శిక్షార్హమైన నేరం అని కరోల్‌ కేసు పెట్టారు. తనకు పొత్తికడుపు సమస్య ఉన్నందున విసర్జనను ఆపుకోలేకపోయానని వివరణ ఇస్తూ  3 వేల పౌండ్లను (2 లక్షల 38 వేల రూపాయలు) తనకు పరిహారంగా ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. కానీ కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది. అభ్యంతరకరమైన చిత్రీకరణతో ఆమెను నొప్పించిన వారికీ చివాట్లు పెట్టింది.

తినలేక ...పోయాడు
పందెం కాసి, 80 సెకన్లలో సుమారు 300 గ్రాముల డోనట్‌ను తినేందుకు ప్రయత్నించిన 42 ఏళ్ల ట్రావిస్‌ మలోఫ్‌ అనే వ్యక్తి, డోనట్‌ గొంతులో అడ్డుపడి చనిపోవడం ఆ చుట్టూ నిలబడి వేడుకను తిలకిస్తున్నవారిలో విషాదాన్ని నింపింది. యు.ఎస్‌.లోని డెన్వర్‌లో ‘వూడూ డోనట్స్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌’లో భాగంగా ట్రావిస్‌ ఈ ప్రాణాంతకమైన విన్యాసానికి తెగించి, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. నిజానికి ఆయన తన మరణాన్నయితే కొని తెచ్చుకున్నారు కానీ, పోటీ కోసం డోనట్‌ను ఉచితంగానే పొందారు. ఈ సంఘటన తర్వాత డెన్వర్‌ చుట్టుపక్కల ఈ తరహా పోటీలపై పోలీసులు నిఘావేసి ఉంచారు.

నన్ను పెళ్లి చేసుకోవా?
కైల్‌ స్టంప్‌ వయసు 23. ఆహియోలోని షెఫీల్డ్‌ లేక్‌ ఏరియాలో ఉంటాడు. అతడో అమ్మాయి ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు మిషెల్‌ . ‘నన్ను పెళ్లి చేసుకుంటావా మిషెల్‌?’ అని ప్రపోజ్‌ చేద్దామనుకున్నాడు. అయితే ఆ ప్రపోజల్‌ను వెరైటీగా చేద్దామనుకున్నాడు. చేశాడు కూడా! ఆహియోలోని ఓ షాపింగ్‌ సెంటర్‌ గోడపై పెద్ద ఎర్రటి అక్షరాలతో, ప్రేమ గుర్తుతో.. Mజీఛిజ్ఛిll్ఛ M్చటటy ఝ్ఛ. ఐ ఔౌఠ్ఛి yౌu అని రాశాడు. ఆ అమ్మాయి ఈ ప్రపోజల్‌ని చూసిందో లేదో కానీ, నగర పాలక సంస్థ వారు చూశారు. శుభ్రంగా ఉన్న గోడను పాడు చేసినందుకు అతడి అడ్రస్‌ కనుక్కుని వెళ్లి మరీ 300 డాలర్ల ఫైన్‌ (సుమారు 20 వేల రూపాయలు) విధించారు. గోడను బాగు చేసుకోడానికి ఆ మాత్రం ఖర్చవుతుందట వాళ్లకు. అయితే ఈ ప్రేమికుడిని ఫైన్‌తో వదిలిపెట్టలేదు. కొన్నాళ్లు కమ్యూనిటీ సర్వీస్‌ కూడా చేయాలని నోటీసులు పంపారు. ఇంతకీ గోడ మీద కనిపిస్తున్న ఈ ఫెమీలియా ఎవరు? అదీ ఆ ప్రియురాలి పేరే.

నచ్చని ముఖం
జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌పై ప్రపంచానికి ఇంకా కోపం చల్లారలేదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కనీసం 60 లక్షల మంది హిట్లర్‌ సృష్టించిన మారణహోమానికి బలైపోయారు. అందుకే హిట్లర్‌ పేరుతోగానీ, హిట్లర్‌ ఫొటోతో గానీ ఉన్నది ఏదైనా నేటికీ నిరాకరణకు, తీవ్రమైన వ్యతిరేకతకు గురవుతూనే ఉంది. తాజాగా... హిట్లర్‌ బొమ్మ ఉన్న పిల్లల కలరింగ్‌ బుక్‌ను నెదర్లాండ్స్‌ నిషేధించింది. క్రూయిద్వత్‌ అనే పుస్తక విక్రయాల గొలుసు సంస్థ ప్రచురించిన ఆ బుక్‌లో ‘రంగులు వేయండి’ శీర్షిక కింద హిట్లర్‌ బొమ్మను గీతల్లో ఇచ్చారు. ఆ గీతలకు రంగులు అద్దితే హిట్లర్‌ ప్రత్యక్షమౌతాడు. అయితే మానవాళికి విరోధి అయిన హిట్లర్‌ బొమ్మను పిల్లల పుస్తకంలో ఒక యాక్టివిటీగా ఇవ్వడం ఏంటని నెదర్లాండ్స్‌ ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో క్రూయిద్వత్‌ తన పంపిణీ దుకాణాలన్నింటిలోంచీ ఆ బుక్‌ను ఉపసంహరించుకుంది. అంతే కాదు, లోక కంటకుడైన హిట్లర్‌ బొమ్మను పిల్లల పుస్తకాల్లో ప్రచురించినందుకు దేశంలోని తల్లిదండ్రులందరికీ క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

గడుసరి దొంగ
అతడొక గజదొంగ. బెయిల్‌ మీద విడుదల అయ్యాడు. అతడు అట్నుంచటే పారిపోతాడేమోనని బ్రిటన్‌ పోలీసులకు డౌట్‌ వచ్చింది. అతడు తప్పించుకు పోకుండా, ఒక సెల్‌ఫోన్‌ అతడి చేతికి ఇచ్చి... ‘‘మేం ఎప్పుడు ఫోన్‌ చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యాలి, మాతో మాట్లాడాలి’’ అని చెప్పి పంపించారు. ఆర్నెల్లు గడిచాయి. దొంగ ఎక్కడికీ తప్పించుపోలేదు కానీ, దొంగకు ఏ ఫోన్‌ అయితే ఇచ్చారో ఆ ఫోన్‌కి 45,000 పౌండ్ల బిల్లు (35 లక్షల 78 వేల రూపాయలు) వచ్చింది. అది పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పేరు మీద ఉండడంతో పోలీసులే ఆ బిల్లు పే చెయ్యవలసి వచ్చింది. ‘ఇంత భారీగా ఎవరితో మాట్లాడావయ్యా దొంగయ్యా’ అని అడిగితే అతడు అసలు విషయం చెప్పాడు. ఆ ఫోన్‌ని వాడుకొమ్మని తన ఫ్రెండ్స్‌కి ఇచ్చేవాడట. క్రెడిట్‌ లిమిట్‌ లేని సిమ్‌కార్డును పొరపాటున దొంగగారి ఫోన్‌లో పెట్టి ఇవ్వడంతో ఈ అనుకోని ఖర్చు వచ్చిపడింది బ్రిటన్‌ పోలీసులకు.

ఇక్కడికి వెళ్లబోయి...అక్కడికి వెళ్లాడు
ప్రపంచంలో ఒకే పేరుతో అనేక ప్రదేశాలు ఉండే అవకాశం ఉంది. సిడ్నీ కూడా అలాగే రెండు–మూడు చోట్ల ఉంది. ఒకటి ఆస్ట్రేలియాలో, ఇంకోటి సోవా స్కాటియాలో, మరొకటి బ్రిటిష్‌ కొలంబియాలో ఉంది (ఈ నోవా స్కాటియా, బ్రిటిష్‌ కొలంబియా రెండూ కెనడాలోనే ఉన్నాయి). ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఒక డచ్చి టీనేజర్‌ (నెదర్లాండ్స్‌ బాలుడు) మిలాన్‌ షిపర్‌ నెదర్లాండ్స్‌ నుండి సిడ్నీ వెళ్లదలచుకున్నాడు. నిజానికి అతడు వెళ్లవలసింది ఆస్ట్రేలియాలోని సిడ్నీ. కానీ నోవా స్కాటియాలోని సిడ్నీకి వెళ్లే విమానం ఎక్కేశాడు. అమ్‌స్టర్‌డ్యామ్‌ టు సిడ్నీ ఫ్లైట్‌ అది. మిగతా విమానాలతో పోల్చి చూస్తే ఆ విమానంలో టిక్కెట్‌ 300 డాలర్లు (సుమారు 24 వేల రూపాయలు) తక్కువ. అందుకే ఎక్కేశాడు. ఆ ఫ్లయిట్‌ ఆ బాలుడిని కెనడాలోని టొరంటో తీసుకెళ్లింది. అక్కడి నుంచి వేరే విమానం ఎక్కించి నోవాస్కాటియాలోని సిడ్నీలో దించింది. కిందికి దిగాక చూసుకుంటే అతడు తనకు తెలిసిన సిడ్నీలో లేడు! సన్నీగా ఉండే సిడ్నీకి వెళ్లాలనుకుని, చిల్డ్‌గా ఉండే సిడ్నీలో దిగాడన్నమాట.

>
మరిన్ని వార్తలు