కత్తి అంచుపై కదనం

5 Apr, 2019 00:18 IST|Sakshi

మాట విత్తనం. మహావృక్షం అవుతుంది. సుగంధం. వ్యాపిస్తుంది. ఆయుధం. యుద్ధం చేస్తుంది. ఆదేశం. వ్యవస్థని చెక్కబెడుతుంది. మాటంత పదునైనది, ప్రభావంతమైనది మానవ చరిత్రలో మరొకటి లేదు. అందుకే ప్రసంగాలు చరిత్ర గతిని మార్చగలిగాయి. అలాంటి ప్రసంగాలకు స్ఫూర్తిని ధారపోసిన కొందరు మహిళాయోధుల మనోభావాలివి. వారి ఆత్మకథల్లోని మౌన ప్రసంగాలివి. చదవండి. తప్పక మిమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేస్తాయి. 

ఆంగ్‌ సాన్‌ సూకీ
నాన్న! నా హీరో. నా జీవితానికి స్ఫూర్తి. ఉద్యమ రాజకీయాల్లో నా దిక్సూచి. బర్మా యువశక్తిని నడిపిన నాన్న... నా రెండేళ్లప్పుడు యువకుడిగానే చనిపోయారు. ఆయన నన్నెత్తుకుని ఆడించిన గుర్తు... ఉండీలేనట్లుంది. ‘‘నిన్ను ఇలా ఎత్తుకునేవారు, చేతులపై ఇలా ఊపేవారు. గాలిలో పైకి లేపి ఒక్క విసురుతో భద్రంగా నిన్ను కిందికి దింపేవారు. నువ్వు కిలకిలమని నవ్వేదానివి’’ అని అమ్మ చెబుతుంటే నాన్నని ఊహించుకునేదాన్ని. అమ్మ ఒక్కటేనా నాన్న గురించి చెప్పేది! బర్మాలోని ప్రతి ఉద్యమ గ్రామం ఆయన్ని గుర్తుంచుకుంది. ఆంగ్‌ సాన్‌ సూకీ ఒక తిరుగుబాటు నాయకురాలంటే వాళ్లకేం గొప్ప కాదు. ఆ తండ్రి కూతురేనని చెప్పుకోవడం గొప్ప!  నిర్బంధానికి నిర్బంధానికి మధ్య లభించిన షరతుల స్వేచ్ఛలో పశ్చిమ బర్మాలోని రఖైన్, చిన్‌ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు నాకొక ఉద్వేగభరితమైన అనుభవం ఎదురైంది.

చిన్‌ తెగలకు బర్మీయులంటే పడదు కాబట్టి నేనక్కడికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీలోని అనుభవజ్ఞుల హెచ్చరిక! జాగ్రత్త అంటే వారి ఉద్దేశం చిన్‌లు ప్రదర్శించే ఉదాసీనత తట్టుకోడానికి మనసును సంసిద్ధం చేసుకోవడం. కానీ అక్కడ మాకు అపూర్వమైన ఆదరణ లభించింది! రెండు రాష్టాల్లోనూ తెగల వైరానికి అతీతంగా స్థానికులు బారులు తీరి మా వాహనానికి స్వాగతం పలికారు. తల్లులు తమ పిల్లల్ని ఎత్తుకుని నావైపు చూపిస్తూ ‘‘అదిగో.. ఆంగ్‌సాన్‌ తాతయ్య కూతురొచ్చింది చూడు’’ అంటున్నప్పుడు నా కళ్లు చెమర్చాయి. నాన్న వారితో నిజాయితీగా ఉన్నారు. వారు నన్ను విశ్వసిస్తున్నారు. అంతే. ప్రజాస్వామ్యాన్ని తప్ప వారు ఇంకేమీ ఆశించడం లేదు. ఆచరణ సాధ్యం కాని హామీలేమీ నేనివ్వడం లేదు. మా పార్టీని ప్రతి గూడెం గుండెకు హత్తుకుంది.

►తల్లులు తమ పిల్లల్ని ఎత్తుకుని నావైపు చూపిస్తూ ‘‘అదిగో.. ఆంగ్‌సాన్‌ తాతయ్య కూతురొచ్చింది చూడు’’ అంటున్నప్పుడు నా కళ్లు చెమర్చాయి. నాన్న వారితో నిజాయితీగా ఉన్నారు. వారు నన్ను విశ్వసిస్తున్నారు.

స్వెత్లానా సవిత్స్కయా  
గగారిన్‌ అంతరిక్షంలోకి వెళ్లి స్పేస్‌ వాక్‌ చేసి వచ్చాక నిద్రలో నక్షత్రాలను కలగనే పిల్లలు ఎక్కువయ్యారు. ‘అయితే స్వెత్లానా.. మీరు స్పేస్‌లోని కలలను సంతృప్తి పరిచారు’ అని రష్యన్‌ తల్లిదండ్రులు ఎంతో ఆత్మీయంగా ఇప్పటికీ నాకు ఉత్తరాలు రాస్తుంటారు. కళ్ల ముందరి ఒక పెద్ద వాస్తవం.. వేల కనురెప్పల వెనక కలల్ని నెరవేర్చడమన్నది ఒక అందమైన భావన. కానీ ‘కల’ అనగానే అది నాకు మేఘాలతో కట్టుకున్న ఒక ఇల్లులా, హరివిల్లులా అనిపిస్తుంది. అక్కడికి వెళ్లలేం కదా అనిపిస్తుంది. అది ఎక్కువసేపు ఉండదు కదా అని నిరాశ కలుగుతుంది. అందుకే తిరుగు ఉత్తరాల్లో తల్లిదండ్రులకు నేనేం రాస్తానంటే – కల అనే పదానికి బదులుగా లక్ష్యం అనే మాటను ఉపయోగించండని. కలను లక్ష్యం అనుకున్నపుడు కనడం అన్నది సాధించడం అవుతుంది. అప్పుడేదీ అసాధ్యం కాదు. స్పేస్‌ అనంతమైనది. అందులో ప్రతి లక్ష్యానికీ చోటు ఉంటుంది. స్పేస్‌ వివక్ష రహితమైనది.

‘హిస్‌’, ‘హర్‌’ అనే కక్ష్యలు లేనిది.విల్‌ పవర్, ఫిజికల్‌ పవర్‌ రెండూ సమానమే ఆడవాళ్లకు, మగవాళ్లకు. పిండి కొట్టవలసిన కొండలేవీ అంతరిక్షంలో లేవు కనుక మగాళ్లకున్న ఎక్స్‌ట్రా మజిల్స్‌ వల్ల అక్కడేం ఉపయోగం లేదు. నిజానికి ఆడపిల్లలకే ఆదనపు యోగ్యతలు ఉన్నాయి! కక్ష్యలో జరిగే బయెటెక్నాలజీ పనులకు వీళ్లయితేనే సరిగ్గా సరిపోతారు. దృష్టిజ్ఞానం కూడా మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువ. వీళ్ల కళ్లు వర్ణ వ్యత్యాసాలను చక్కగా వడగడతాయి. ఇదొక దేవరహస్యమని సైంటిస్టులే ఒప్పుకున్నారు. స్పేస్‌లోని ఖనిజ నిల్వలను మహిళా వ్యోమగాములే తేలిగ్గా కనిపెడతారు. స్పేస్‌వాక్‌ అయినా, స్పేస్‌టాక్‌ అయినా పైన క్రూ సభ్యులలో, కింద గ్రౌండ్‌ స్టేషన్‌లో మహిళలు కూడా ఉన్నప్పుడే అంతా సజావుగా, నమ్మకంగా సాగుతుంది. ►దృష్టిజ్ఞానం కూడా మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువ. వీళ్ల కళ్లు వర్ణ వ్యత్యాసాలను చక్కగా వడగడతాయి. ఇదొక దేవరహస్యమని సైంటిస్టులే ఒప్పుకున్నారు.

వంగరి మాథై
‘‘కెన్యాకు చెట్లు కాయబోతున్నాయా? చెట్లకు కొత్త కెన్యా కాయబోతోందా?!’’నవ్వాడట డేనియల్‌ మొయి! ‘‘ఆడమనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నాటుకోనివ్వండి ఇష్టమొచ్చిన చోట్ల... మొక్కల్ని, తిక్కల్నీ...’’ అంటున్నాడట! కొమ్మ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు డేనియల్‌. మా దేశాధ్యక్షుడు అతడు. దేశాన్ని పాలిస్తున్న ఒంటికొమ్మ రాక్షసుడు. సింగిల్‌ పార్టీ నాయకుడు. కెన్యాలో కూలిపోతున్న చెట్ల గురించి, కెన్యాను దోచుకుతింటున్న అధికారుల గురించి, పిల్లలకింత తిండి పెట్టలేక అలమటిస్తున్న కెన్యా తల్లుల గురించి, గర్భస్రావమై విలపిస్తున్న కెన్యా పంటపొలాల గురించి అతడు మాట్లాడ్డం లేదు. డేనియల్‌ వినాశకారి.

పాదులు తీసిన మొక్కల్లోకి అతడు బ్యూరోక్రటిక్‌ గేదెల్ని వదిలిపెట్టాడు. తిన్నంత తిని, డొక్కలరక్క కెన్యాను అవి తొక్కిపడేశాయి! డేనియల్‌ ఇంకా చాలా సత్కార్యాలు చేశాడు. దొంగల చేతులకు తాళాలిచ్చి, ఖాళీ బీరువాలు మిగిల్చిన వారికి కంకణాలు తొడిగాడు. ‘‘మాథై నాటించే మొక్కలు చెట్లై, ఊడలు దిగి కెన్యా ఆఫ్రికన్‌ నేషనల్‌ యూనియన్‌ కాళ్లను పట్టి లాగబోతున్నాయా’’ అని అతడి పరిహాసం. మొక్క... మొక్కలా ఉండిపోదు. పర్యావరణ ఉద్యమం అవుతుంది. కైరో దేశపు పచ్చదనం అవుతుంది. ఆ సంగతి అతడికి త్వరలోనే తెలియబోతోంది. 

►డేనియల్‌ వినాశకారి. పాదులు తీసిన మొక్కల్లోకి అతడు బ్యూరోక్రటిక్‌ గేదెల్ని వదిలిపెట్టాడు. తిన్నంత తిని, డొక్కలరక్క కెన్యాను అవి తొక్కిపడేశాయి!

మీప్‌ కీస్‌  
యాన్‌ ఫ్రాంక్‌ డైరీని మీరు చదివే ఉంటారు. తనెంత శ్రద్ధగా డైరీ రాసేదో నాకు తెలుసు. తనకొక బెడ్‌రూమ్‌ ఉండేది. తండ్రి స్నేహితుడైన డస్సెల్‌ అనే ఒక దంతవైద్యునితో కలిసి ఆమె ఆ చిన్న గదిలో ఉండవలసి వచ్చేది. ఆమె ధ్యాసకు ఏకాంతాన్ని కల్పించవలసిన అవసరాన్ని డస్సెల్‌ గుర్తించలేకపోయారు. చిన్నపిల్లకు రాయడానికి ఏముంటుందని ఆయన ఆలోచన కావచ్చు. మెట్ల కింద ఆఫీస్‌ గదిలోకి తక్కిన పిల్లలతో కలిసి వచ్చి టేబుల్‌ మీది ఫోన్‌తో ఆటలాడే పిల్ల మనసులో పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయని ఊహించడం ఎవరికైనా కష్టమే. రాసిన డైరీలు దాచుకోడానికి తనకొక చోటు కావాలని తండ్రిని అడిగిందొక రోజు యాన్‌ ఫ్రాంక్‌. ఆయన ఒక బ్రీఫ్‌కేస్‌ దులిపి ఇచ్చారు. ఆటో ఫ్రాంక్‌ తన చిన్నకూతుర్ని బాగా గారాం చేసేవారు. యానీ అని, సుకుమారీ అని పిలిచేవారు. యాన్‌ పీలగా, నాజూకుగా ఉండేది. పెద్ద గొంతుతో మాట్లాడేది.

ఎవరైనా మాట్లాడుతుంటే కళ్లు పెద్దవి చేసి వినేది. డైరీ రాస్తున్నపుడు తన నిమగ్నతను భగ్నం చేసిన వారివైపు కోపంగా చూసేది. ఒకసారి నాకిలాగే అయింది. ఏదో మాట్లాడదామని దగ్గరికి వెళితే... ఆరాలు తీయడానికి వచ్చిన శత్రువును చూసినట్లు చూసి, డైరీ రాయడం ఆపి, చేతుల్ని వెనక్కి దాచిపెట్టి, ఇక్కడ నీకు పనేమిటన్నట్లు చూసింది. తన చిట్టిపొట్టి డైరీలు, అక్క ఇచ్చిన నోట్‌బుక్‌లు  వెంటవెంటనే నిండిపోతుంటే యాన్‌కు నేనే తెల్ల కాగితాలు ఇస్తుండేదాన్ని. యాన్‌ తండ్రి దగ్గర నేను టైపిస్టుని. అందుకే నా దగ్గర తెల్ల కాగితాలు ఉండేవి. ‘‘నా కూతురు డైరీ రాసుకుంటోంది మీప్‌. ఆ విషయం తెలుసుకోనక్కర్లా?’’ అన్నారు మిసెస్‌ ఫ్రాంక్‌ తన కూతుర్ని సముదాయించే ఉద్దేశంతో.

‘‘నీ గురించి కూడా రాస్తున్నాను’’ అంది యాన్‌ ఉక్రోషంగా నావైపు చూస్తూ. మురిపెంగా నవ్వుకున్నాను. ఒకే ఇంట్లో తనకు నాకు మధ్య ఇరవయ్యేళ్ల దూరం. చిన్నపిల్లలు అపార్థం చేసుకున్నారంటే వారిలో ఏవో తీవ్రమైన భావోద్వేగాలు చెలరేగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి! అయితే యాన్‌లోని ఉద్వేగాలు మానవత్వంపై ఆమె కల్పించుకుంటున్న నమ్మకాలని ఏళ్ల తర్వాతగానీ తెలీలేదు. డైరీలలో నా ఒక్క పేరు తప్ప మిగతా అందరికీ ఆమె మారుపేర్లు పెట్టిన విషయం కూడా ప్రచురణ కోసం వాటిని బైటికి తీసి చదివాకే నాకు తెలిసింది! యాన్‌ నాతో పెంచుకున్న అంతర్ముఖ అనుబంధానికి అదొక సంకేతమేమో!

►చిన్నపిల్లలు అపార్థం చేసుకున్నారంటే వారిలో ఏవో తీవ్రమైన భావోద్వేగాలు చెలరేగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి! అయితే యాన్‌లోని ఉద్వేగాలు మానవత్వంపై ఆమె కల్పించుకుంటున్న నమ్మకాలని ఏళ్ల తర్వాతగానీ తెలీలేదు.

మరిన్ని వార్తలు