Global Volcanism Program: 19 అగ్నిపర్వతాలు ఒకేసారి పేలాయా?

16 Nov, 2023 13:12 IST|Sakshi

అగ్ని పర్వతం... ఈ మాట వినిగానే భగభగ మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబికివచ్చే లావా గుర్తుకువస్తుంది. అగ్ని పర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా అగ్ని పర్వతాలు ఒకే సమయంలో బద్దలయ్యాయని తెలిస్తే.. అది ఊహకు కూడా అందదు.

అవును.. ఇది నిజం.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. తాజాగా మరో మూడు కొత్త విస్ఫోటనాలు ఈ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ నూతన విస్ఫోటనాలను ట్రాక్ చేస్తుంది. 

గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్‌ తాజాగా విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాల  జాబితాను అప్‌డేట్ చేసింది. ఈ జాబితా విడుదల అనంతరం పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, ఐస్‌లాండ్, జపాన్, మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్  దేశాలలో ఒకేసారి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతుంటాయి. ఇది సాధారణమేనని అగ్నిపర్వత శాస్త్రవేత్త, సైన్స్ జర్నలిస్ట్ రాబిన్ జార్జ్ ఆండ్రూస్ ఎక్స్‌(ట్విట్టర్‌) మాధ్యమంలో తెలిపారు.

ప్రస్తుతం పేలుతున్న అగ్నిపర్వతాల సంఖ్య సాధారణమేనని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ బెన్ ఆండ్రూస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 46 విస్ఫోటనాలు కొనసాగుతున్నాయని, గత 30 సంవత్సరాలలో ఇదేవిధంగా నిరంతరం 40 నుంచి 50 విస్ఫోటనాలు జరిగాయన్నారు. 1991 నుండి ప్రతి సంవత్సరం 56 నుంచి 88 వరకూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 85గా ఉందని బెన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయని ఆయన అన్నారు.

గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ అందించిన తాజా అప్‌డేట్‌లో జపనీస్ ద్వీపం ఐవో జిమాలోని నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం, ఐస్‌లాండ్‌లోని ఫాగ్రాడల్స్‌ఫ్జల్, రష్యాలోని క్లూచెవ్‌స్కోయ్‌లు చేరాయి. జపనీస్ అగ్నిపర్వత దీవులలోని నీటి అడుగునవున్న అగ్నిపర్వతం అక్టోబరు 30న విస్ఫోటనం చెందింది. దీని శిలాద్రవం నీటి ఉపరితలాన్ని ఛేదించి, కొత్త ద్వీపాన్ని సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ)తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ప్రతి రెండు నిమిషాలకు ఇవో జిమా వద్ద అగ్నిపర్వత ప్రకంపనలు నమోదయ్యాయి. 

రష్యాలోని క్లూచెవ్‌స్కాయా సోప్కా అగ్నిపర్వతం ఇటీవలే విస్ఫోటనం చెందింది. సమయంలో సముద్ర మట్టానికి 8 మైళ్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. ఈ నేపధ్యంలో భద్రత దృష్ట్యా పలు పాఠశాలలను మూసివేశారు. కాగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం ఇంకా పూర్తిగా విస్ఫోటనం చెందలేదు. అయితే విస్పోటనానికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నందున స్థానిక అధికారులు గ్రిండవిక్ పట్టణాన్ని ఖాళీ చేయించారు. 

అగ్ని పర్వతం ఎలా ఏర్పడుతుంది?
అగ్ని పర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడుతాయి. సాధారణంగా  భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు  ఢీకొన్న చోట అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి ప్రదేశం ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అని అంటారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాలు ఏర్పడడానికి  టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం కాదు. భూమి కింది భాగంలోని  టెక్టోనిక్ ప్లేట్లు సాగిపోయి, పల్చబడటం కారణంగానూ అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు.

అగ్ని పర్వతంలో ఏముంటాయి?
మాగ్మా చాంబర్: ఇది భూమిలోని అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండిపోయి ఉంటుంది.
సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళుతుంది.
డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్. ఇది సిల్ వరకు లావాను చేరుస్తుంది.
లావా లేయర్స్: ఇవి పర్వతంలో బూడిదతో నిండి ఉంటాయి. వీటి నుంచే బూడిద వెలువడుతుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు ఎగజిమ్ముతుంది. 
పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి బయటకు వస్తుంది.
లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా వెలువడుతుంది.
వెంట్: ఇది పర్వతపు ముఖద్వారం. ఇది బయటకు లావాను, బూడిదను విడుదల చేసే భాగం.
క్రేటర్: పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం.
యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెలువడే బూడిద మేఘం. 
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్‌ రెస్క్యూ బృందాలు

మరిన్ని వార్తలు