వాహనం నడిపేటప్పుడు తల దిమ్మెక్కితే!

6 Oct, 2014 23:25 IST|Sakshi
వాహనం నడిపేటప్పుడు తల దిమ్మెక్కితే!

లోపలి చెవి నుంచి మెదడుకు అనుసంధానంగా ఉండే వెస్టిబ్యూలార్ సిస్టమ్‌లో తేడా వస్తే తల దిమ్ముగా ఉండడం, తల తిరిగినట్లయి పడిపోవడం జరుగుతుంది. దేహం కదలికలకు అనుగుణంగా తలలో వెస్టిబ్యూలార్ వ్యవస్థ స్పందిస్తూ ఉంటుంది. అందులో తేడా వస్తే రొటేషన్ మోషన్ క్రమం తప్పుతుంది. దీనిని ‘వర్టిగో’ అంటారు. ఉన్నట్లుండి కళ్ల ముందు వలయాకారంగా తిరుగుతున్నట్లు అనిపించడం, వాంతి వచ్చినట్లు ఉండడం, వాహనం నడవలేకపోవడం, చూపు మసకబారడం (బ్లర్‌డ్ విజన్), చెవులు వినిపించకపోవడం, చెవిలో హోరు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అప్పుడు ఏంచేయాలంటే...
ఉన్న చోటనే కూర్చోవాలి. వీలయితే పడుకోవాలి. దగ్గర ఉన్న వారిని సహాయానికి పిలవాలి.
వాహనం నడుపుతుంటే వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు తీసుకుని ఆపేయాలి.
దుస్తులు వదులు చేసుకుని దేహానికి బాగా గాలి తగలనివ్వాలి.
లైట్లు తీసేసి సాధారణ వెలుతురు ఉండేలా చూడాలి లేదా గదిని చీకటిగా ఉంచాలి.
దాహంగా ఉంటే నీరు తాగాలి. తేరుకున్న తర్వాత డాక్టర్‌ను సంప్రదించి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి.
వర్టిగో పేషెంట్లు పూర్తిగా కోలుకునే వరకు ఒంటరిగా బయటకు వెళ్లరాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మరో వ్యక్తి సహాయంగా కనిపెట్టుకునే ఉండాలి. బాత్‌రూములోకి వెళ్లినప్పుడు తలుపు గడియ పెట్టుకోకపోవడమే మంచిది.

మరిన్ని వార్తలు