ఆ ఇన్‌ఫెక్షన్లు ఈ సీజన్‌లోనే ఎందుకు ఎక్కువ?

30 Mar, 2017 00:09 IST|Sakshi
ఆ ఇన్‌ఫెక్షన్లు ఈ సీజన్‌లోనే ఎందుకు ఎక్కువ?

విమెన్‌ కౌన్సెలింగ్‌

వేసవిలో నేను తరచూ మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ (యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌)కు గురవుతుంటాను. ఎండాకాలంలో ఎందుకీ సమస్య మాటిమాటికీ తిరగబెడుతుంది? కారణాలు వివరించండి. – మాలతి, వర్ధమాన్‌కోట
మన మూత్ర వ్యవస్థలో రెండు కిడ్నీలుంటాయి. వాటి నుంచి మూత్రకోశానికి  (బ్లాడర్‌) రెండు నాళాలు వెళ్తాయి. వాటిని యురేటర్స్‌ అంటారు. బ్లాడర్‌ నుంచి మరో నాళం (ఇదే మూత్ర నాళం) ద్వారా మూత్రవిసర్జన జరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ వస్తే... మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్ర విసర్జన సమయంలో మంట, పొత్తికడుపులో నొప్పి, కాస్తంత మబ్బు రంగులో, ఒక్కోసారి ఎర్రగా, కొంత దుర్వాసనతో మూత్రం వస్తుంది.

చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌కు ఈ–కొలై అనే పరాన్న జీవి కారణమవుతుంది. సాధారణంగా ఇది ఆహారనాళంలో ఉంటుంది. అయితే అవి మూత్ర విసర్జన వ్యవస్థలోకి కూడా ప్రవేశించవచ్చు. అలాగే క్లెబిసియెల్లా, ఎంటరోకోకస్‌ ఫీకాలిస్‌ అనే సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్‌కు లొంగకుండా మొండిగా మారుతున్నాయి.

పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రవిసర్జక నాళం పొడవు తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సోకగల ప్రదేశాల పైన మలవిసర్జన నాళం వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పరిమాణంలో బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశం ఉండటంతో మహిళల్లో తరచూ ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటాయి. మహిళల్లో సహజంగా ఉండే సిగ్గు, బిడియం ఎక్కువ. కాబట్టి ఇటువంటి కారణాలున్నప్పటికీ వైద్యం కోసం హాస్పిటల్స్‌కు వచ్చే వాళ్లు చాలా తక్కువ. సమస్య తీవ్రమైనప్పుడే వారు ఆసుపత్రులకు వస్తుంటారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. గుర్తించిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకోవాలి, లేకపోతే కిడ్నీల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
డాక్టర్‌ ఊర్మిళ ఆనంద్‌
సీనియర్‌ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్,
సికింద్రాబాద్‌


ఆకర్షణీయమైన రంగుల ఆహారం తీసుకోవచ్చా?
పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

వేసవి సెలవుల్లో ఊళ్లకు, బయటి ప్రదేశాలకు, విహార యాత్రలకు వెళ్తుంటాం కదా? అక్కడ ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలకు పిల్లలు తేలిగ్గా ఎట్రాక్ట్‌ అవుతుంటారు. ఆ ఆహారం వారికి ఇవ్వవచ్చా?  – శ్రద్ధ శ్రీ, బళ్లారి
ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్‌ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది.

ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్‌... సన్‌సెట్‌ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్‌ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్‌ ఎల్లో, అల్యూరా రెడ్‌ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్‌యాక్టివ్‌) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్‌ వంటి రసాయనాలు విటమిన్‌ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్‌ కారకం (కార్సినోజెన్‌)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ రసాయనం లివర్‌ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్‌ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయింది. అందుకే రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి.
డాక్టర్‌ రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్‌
రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌


మునుపటి చురుకుదనం సాధించడం ఎలా..?
లైఫ్‌స్టయిల్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 57 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. ఇటీవల నా ఫిట్‌నెస్‌ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో మునుపటిలా చురుగ్గా లేకపోవడం వల్ల నాకు ఈ ఫీలింగ్‌ వస్తోంది. నేను మునుపటిలాగే ఆరోగ్యాన్నే పొందడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి. ఇక ఇటీవల సమ్మర్‌లో మరింత అలసట ఫీలవుతున్నాను. – బి. వెంకటేశ్వరరావు, గుంటూరు
వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. మీ వయసు వారిలో డయాబెటిస్‌ లేదా హైబీపీ లాంటి వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే, వాటికి  తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు.

దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసు పైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్‌ వంటి  జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్‌ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్‌ నుంచి సూచనలు పొందాలి.

ఉదాహరణకు డయాబెటిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్‌ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్‌సైజ్‌కు ముందుగా వార్మింగ్‌ అప్, తర్వాత కూలింగ్‌ డౌన్‌ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు.

వేసవిలో మరింత నిస్సత్తువతోనూ, నీరసంగా ఉండటం జరుగుతోందంటే బహుశా మీరు నీటిని, ఉప్పును ఎక్కువగా చెమట రూపంలో కోల్పోవడం వల్ల కావచ్చు. వేసవిలో ఎక్సర్‌సైజ్‌ చేయవచ్చు. కానీ అవి ఎక్కువ శ్రమ కలిగించేలా కాకుండా బాగా తేలికపాటివే అయి ఉండాలి. ఈ సీజన్‌లో డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోండి. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి.
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్
లైఫ్‌స్టైల్‌ అండ్‌ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు