కవిత

20 Aug, 2017 23:46 IST|Sakshi

అక్కడే...

చెప్పిన మాట వినకుండా
చెట్టాపట్టాలేసుకు పోతుంది
అచ్చంగా నీదే అయిన దేహం నిన్ను విడిచి

మనిషికో మాట
గుండెకి ఒక దెబ్బ
పెడ చెవికే హెచ్చరిక

పిచ్చి పెదవుల ప్రేలాపనలు
గాలికి మాత్రమే ఉక్కబోత!

ఉద్వేగాలకు కళ్లెం వేసి
నిభాయించుకోవాలి అంతరాత్మని

ముఖకవళికలని పెన్సిల్‌తో దిద్దేస్తే
నవ్వులు ముద్దమందారంలా పూస్తాయి
జీర్ణించుకున్న వాస్తవాల్ని
నిట్టూర్పుల్లో వదిలేసి
ఒక్కక్షణం కళ్ళుమూసుకుంటే,
స్వప్నాలు రెప్పలమీద వాలతాయి

అడుగులకు నమ్మకాన్ని పరచుకుంటూ
తప్పిపోవచ్చు అక్కడే మళ్ళా

పునర్నిర్మించుకున్న ఎల్లల్లో
కట్టుకున్న తోటల పరిమళాన్ని
వెతికి పట్టుకోడానికి...
మందిలో ఒంటరిగానే ఉన్నా,
ఎంతో కొంత దొరికించుకోడానికి...

రాళ్ళబండి శశిశ్రీ
7416399396


అనువాద కవిత
బుద్ధారాధన
యుద్ధ భేరీ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి
సైనికులు మృత్యుదేవత యముని ప్రసన్నత కోసం తరలి వెళ్తున్నారు.
వారి యుద్ధ దుస్తులు భీతి గొల్పుతున్నాయి.
వారు పళ్లు పటపటా కొరుకుతున్నారు.
క్రౌర్యోజ్వల జ్వాలలతో అవిశ్రాంతంగా వున్నారు.
అలాగే, దయా సముద్రుడు శాక్యముని
ఆశీస్సులూ పొందగోరుతున్నారు.
కయ్యానికి కాలుదువ్వే రీతిలోనే
బుద్ధ దేవాలయం వైపు కవాతు చేస్తున్నారు.
బాకాలూ ఢంకాలూ మహోగ్రంగా మ్రోగుతున్నాయి.
భూగోళమే భయంతో ప్రకంపిస్తున్నది.

సమర ఘోషలోనే వారిలా వేడుకున్నారు:
మానవ బంధాల్ని ముక్కలు చేస్తూ
నివాస గృహాల నుండి ఆర్తనాదాలు మారుమ్రోగాలి.
ఆకాశమే వైశ్వానర కీలల్ని వర్షించి
జనావాసాలు భస్మీపటలం కావాలి.
విజ్ఞాన నిలయాలు వినాశనం కావాలి.
అందుకోసమే వారు అనుకంపమూర్తి
తథాగతుని దర్పంగా పూజిస్తున్నారు.
బాకాలూ ఢంకాలూ మహోగ్రంగా మ్రోగుతున్నాయి.
భూగోళమే భయంతో ప్రకంపిస్తున్నది.
విజయ దుందుభుల అనుస్వరంలో
శవాలు గణించబడుగాక!
స్త్రీ బాల వృద్ధుల చిధ్రదేహాలు
ఆహ్లాద నృత్యాన్ని ప్రేరేపించుగాక!

(1937లో యీ గేయానికి రవీంద్రుడు స్వయంగా రాసుకున్న పాదలేఖనం యిలా వున్నది: ‘‘ఒక జపనీయ పత్రికలో జనం విజయాన్ని కాంక్షిస్తూ బుద్ధ దేవాలయానికి వెళ్తున్నట్టు చదివాను. వారు తమ భీకరాయుధాల్ని చైనీయులకూ, ప్రార్థనా బాణాల్ని బుద్ధ భగవానుడికీ గురి పెడుతున్నారు’’.)
మూలం: రవీంద్రనాథ్‌ టాగూర్‌
తెలుగు: టి.షణ్ముఖరావు
9949348238

మరిన్ని వార్తలు