నీడల వెలుగులు!

14 Apr, 2017 23:45 IST|Sakshi
ఖమ్మం జిల్లా, చర్ల మండలం మిర్చి పంటల్లో పని చేయడానికి చత్తీస్‌ఘడ్‌ నుంచి వలసవచ్చిన మహిళా కూలీలు

సాక్షి ఫోకస్‌

సాక్షి టీవీలో ప్రతి శనివారం రాత్రి 8.30 గం.కు ప్రసారం అయ్యే ‘బతుకు చిత్రం’ కార్యక్రమం 150 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. సామాన్యుల కష్టాలకు, కన్నీళ్లకు దర్పణంగా నిలుస్తూ, ఏ అండా లేని ప్రజల మనోభావాలకు పట్టం కడుతూ, మనసు లోతుల్లో దాగిన ఆలోచనల్ని ‘బతుకు చిత్రం’ ద్వారా ఆవిష్కరిస్తున్నారు ఆ కార్యక్రమ సమర్పకులు ఎ.సంజీవ్‌ జోయల్‌ కుమార్, ఆయన బృందం. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల అనంతరం వెల్లివిరిసిన మానవత్వం మొదలు ఆదివాసీల అవస్థల వరకు ఈ బృందం ఎన్నో బతుకు చిత్రాలను టీవీ వీక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరించింది.

జీవన ప్రతిబింబాలు
సంప్రదాయక కులాల సమస్యలు, చేనేతన్నల బతుకులు, మతపర సంప్రదాయాలు, కళలు, కళారంగాల కడగండ్లు; మ్యూజిక్, గ్లామర్‌ రంగాలు, మీడియా పోకడలు, జీవవైవిధ్య సమస్యలు, వైవిధ్య గ్రామాలు, వ్యవసాయరంగ స్థితిగతులు, హైదరాబాద్‌ హస్తకళలు, ఇండియాలో ఇమిడిపోయిన విదేశీయులు, వలస జీవితాలు, మానవీయ అనుబంధాలు, మహిళాభ్యుదయం, ఆరోగ్యం–శాంతి భద్రతలు, మైనారిటీల ఆవేదనలు, దివ్యాంగుల మనోగతాలు, నూతన వృత్తుల మంచిచెడ్డలు, క్లిష్టమైన వృత్తుల లోతుపాతులు, పోకడలు, ఇతర సాధారణ అంశాలు, చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాలు.. ఇలా అనేక జీవన కోణాలను అత్యంత హృద్యంగా జోయల్‌ టీమ్‌ చిత్రీకరించింది.  

ప్రముఖుల ప్రశంసలు
ఈ సుదీర్ఘ ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసింది బతుకు చిత్రం టీమ్‌. సాక్షి టీవీ చేసిన ఈ కృషిని వివిధ రంగాలలోని ప్రముఖులు ప్రశంసించారు. ‘‘చిత్రాలు అందంగా ఉండాలంటే రంగులు ఉండాలి. అన్ని రంగుల్లో అందమైన రంగు మానవత్వం పూసిన రంగు. రెహమాన్‌ అనుకుంటాను. ఒక బస్‌ డ్రైవర్‌. దిల్‌సుఖ్‌నగర్‌ బ్లాస్ట్‌ తర్వాత.. అరవై మందిని.. డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా తన బస్‌లో వేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అలాంటి రెహమాన్‌తో కాసేపు కూర్చోకపోతే ఎట్లా? మనం మీడియాలో ఎందుకు ఉన్నట్లు?! అలాంటి రెహమాన్‌తో కూర్చుంటే.. ‘అబ్బ.. ఇవాళ్టికి కూడా దేవుడు ఇక్కడే ఎక్కడో మనతోపాటే ఉన్నాడు’ అన్న భరోసా కలుగుతుంది. ఇలాంటి కథనాలను జోయల్‌ టీమ్‌ మరిన్ని అందించాలని సాక్షి ఫీచర్స్‌ ఎడిటర్‌ ప్రియదర్శిని రామ్‌ అభినందించారు.
- సాక్షి టీవీ జర్నలిస్ట్, ‘బతుకుచిత్రం’ సమర్పకులు ఎ.సంజీవ్‌ జోయల్‌ కుమార్‌

మరిన్ని వార్తలు