అల్పక... పెళ్లి పెద్ద!

14 Oct, 2015 14:46 IST|Sakshi
అల్పక... పెళ్లి పెద్ద!

పెళ్లి తంతుకు ఉన్నన్ని ఆచారాలు దేనికీ లేవనే చెప్పాలి. ఒక్కో మతానికే కాదు ఒక్కో కుటుంబానికీ ఆచారాల్లో వ్యత్యాసం ఉంటుంది. అలాగే జపాన్ దేశంలోనూ వివాహ సమయంలో ఓ వింత ఆచారం ఉందట. అది అల్పక అనే జంతువును పెళ్లి పెద్దగా మార్చడం. అల్పక చూడటానికే కాదు పోలికల్లోనూ గొర్రెకు సమానంగా ఉంటుంది. వాటి ఉన్నితోనూ దుస్తులు నేస్తారు. అలాగే ఫ్యాషనబుల్ బ్యాగులు, చెప్పులు కూడా ఈ మధ్య తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అల్పక గురించి ఎందుకంటారా? అదేనండి.. జపాన్‌లో జరిగే వివాహాలకు ఈ అల్పకకు దగ్గరి సంబంధం ఉంది. ఎవరి పెళ్లికైనా సరే సాక్షిగా అది తప్పకుండా ఉండాల్సిందేనట.

అది వారి ఆచారం. ఇంతకూ అదెలా వచ్చిందంటే రెండు దశాబ్దాల కిందట తొచిగి ప్రాంతంలో ఎపినార్డ్ నాసు అనే హోటల్, దాని పక్కనే ఓ జూ ఉండేవట. అక్కడ పెళ్లిళ్లు చేసుకునే వధూవరులిద్దరూ ఫొటోలు దిగేందుకు అందంగా ఉంటుందని ఆ జూలో నుంచి అల్పకను తీసుకొచ్చేవారు. తర్వాత అది ఆచారంగా మారడంతో ప్రస్తుతం చర్చీల పక్కన జూ లేకున్నా ఎక్కడెక్కడి నుంచో అల్పకాలను పెళ్లిళ్లకు తీసుకొస్తున్నారట. కొన్ని చోట్ల వాటిని సప్లై చేసే బిజినెస్ కూడా బాగా నడుస్తోంది. గంటకు ఇంత అనే లెక్కన అల్పకాలను అద్దెకిస్తున్నారట.  
 
 

>
మరిన్ని వార్తలు