దైవ సంకల్పంలోని ఆంతర్యమే వేరు

28 Apr, 2019 01:10 IST|Sakshi

ఇస్లామ్‌ వెలుగు

ఒక పిచ్చుక తల దాచుకోవడం కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంది. ఎంతో శ్రమకోర్చి ఒక్కొక్క పుల్లనూ నోట కరచుకొచ్చి చక్కని గూడు నిర్మించుకుంది. హాయిగా అందులో నివసించ సాగింది. కొన్నాళ్ళు అలా సంతోషంగా గడిచిపోయింది. కాని ఒక రోజు అకస్మాత్తుగా గాలి దుమారం వచ్చి గూడు చెదిరిపోయింది. పిచ్చుక బజారుపాలయింది. అనేక రోజులపాటు, ఎంతగానో కష్టపడి, ఇష్టంగా, అందంగా కట్టుకున్న తన కలలసౌధం చూస్తూ చూస్తూనే క్షణాల్లో చెల్లా చెదురయ్యేసరికి పిచ్చుకకు దుఃఖం పొంగుకొచ్చింది.తన రెక్కల కష్టమంతా తుఫాను పాలవడంతోఎంతగానో దుఖిస్తూ..‘దేవా..!ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లనూ సమీకరించి చిన్నఇల్లు కట్టుకుంటే, నువ్వు తుఫానును పంపించి నా ఇల్లు కూల్చేశావే.. నేను మళ్ళీ గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టమో గదా.. నన్నెందుకు ఇలా చేశావు.. నీకిది న్యాయమా.?’అంటూ దైవంతో మొరపెట్టుకుంది. అప్పుడు దైవం ఇలా అన్నాడు.‘ఓసి పిచ్చిమొఖమా..! నీ ప్రాణాలు రక్షించడానికే అలా చేయవలసి వచ్చింది.

నువ్వు గూడు కట్టుకొని హాయిగా పడుకున్నావు.. కాని ఒక పాము నిన్ను కాటేసి, నీ పిల్లల్ని తినెయ్యడానికి నీ గూటివైపు వస్తుండడంతో, నేను చిన్నపాటి గాలిని పంపించాను. దాంతో నీ గూడు చెదిరి నువ్వు ఎగిరిపొయ్యావు. నీ ప్రాణాలు రక్షించబడ్డాయి. లేకపోతే పాముకు ఫలహారమయ్యేదానివి.’ అన్నాడు దైవం.పిచ్చుకకు అసలు విషయం అర్థమై వినమ్రతతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది.అల్లాహ్‌ కరుణామయుడు. ఆయన కారుణ్యం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. ఒక్కొక్కసారి ఆయన మనకేదో నష్టం చేశాడు అనిపిస్తుంది. కాని అందులోనే మన మేలుందన్న విషయం మనకు తెలియదు. మనకు ఎందులో మేలుందో, ఎందులో కీడుందో మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. కనుక లాభం కలిగినా, నష్టం కలిగినా దైవం తరఫునే అని, అందులోనే మన శ్రేయం దాగుందని గ్రహించాలి.
ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు