కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్ టాప్ మాయం

1 Nov, 2023 15:26 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: బదిలీపై మరోచోటికి వెళ్లేందుకు సామాన్లు సర్దుకున్న కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎన్నికల వేళ బదిలీ అయి అసలే టెన్షన్ లో ఉన్న కరీంనగర్ కలెక్టర్ గోపీ ఇంట్లో దొంగలు పడ్డారు. ల్యాప్ టాప్ తో పాటు కలెక్టర్ కు చెందిన పలు డాక్యుమెంట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సీసీ టీపీ ఫుటేజ్ లో బయటపడింది. 

ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయిన విషయం తెలిసిందే.  బుధవారం ఆయన హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి. దీని కోసం తన సామాన్లన్నింటిని రెడీ చేసుకుని ఆయన హాయిగా బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి టైమ్ లో దొంగలు  వెనుకవైపు గోడ నుంచి కలెక్టర్ బంగ్లా లోపలికి ఎంటర్ అయ్యారు. 

ఇంట్లో ముందు రూమ్ లో ఉంచిన కలెక్టర్  ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులు దొంగిలించారు. దొంగలే వస్తువులు చోరీ చేసినట్టు సీసీ టీవీలో రికార్ట్ అయింది. ఇరవై నాలుగు  గంటలు పోలీసు పహారాలో ఉండే కలెక్టర్ బంగ్లాలో దొంగలు పడడం సంచలనంగా మారింది. చోరీపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

మరిన్ని వార్తలు