బౌద్ధం

5 Nov, 2017 00:13 IST|Sakshi

బౌద్ధం

బుద్ధుడి శిష్యులలో అగ్రగణ్యుడు, అత్యంత ముఖ్యుడు కాశ్యపుడు. ఆయనను ‘ధమ్మపదం మహాకాశ్యపుడు’ అని గుర్తించడం కద్దు. బుద్ధుడి ధర్మమార్గాన్ని నలు దిశలా విస్తరింప జేయడానికి బుద్ధుడు ఎంపిక చేసుకున్న శిష్యులలో కాశ్యపుడు ప్రథముడు. ఆయన ఎక్కడున్నా బుద్ధుడున్న దిశగా చూసి నేలమీద పడి నమస్కరించేవారు. ఆయన తీరు చూసి అందరూ విస్తుపోయేవారు. ‘‘మీరు జ్ఞానం పొందిన గురువులు. అయినా మీరింకా నమస్కరిస్తున్నారేంటీ’’అని అడిగేవారు. అప్పుడు ఆయన ‘‘మీకు అర్థం కాదు. ఓ పురుగును సీతాకోకచిలుకగా మార్చినది ఆయనే. నేనీ భూమ్మీద ఉన్నంతవరకూ ఆయనకు నమస్కరించకుండా ఉండలేను. పైగా గురువు, శిష్యుడు అనే బంధంలో రాజు – పేదలా తేడాలుండవు. కనుక ఆయనకు నమస్కరించకుండా నేను ఒక్కరోజూ గడపలేను’’ అన్నారు.

బుద్ధుడు చివరిక్షణాల్లో మహాకాశ్యపుడు ఎక్కడున్నా తీసుకురమ్మన్నారు. శిష్యులు తీవ్రంగా గాలించారు.‘‘అనందా! కాశ్యపుడు నన్ను విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడలేదు. నేనే వాడిని పంపాను. అతనికి తెలియకుండా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళకూడదని, తానెక్కడ ఉన్నా కబురుపెట్టాలని హామీ వేయించుకుని వెళ్లాడు. నేను రేపు వెళ్ళిపోతాను. రేపు ఉదయం లోపల అతను గానీ రాకుంటే నేను మృత్యువును ప్రాధేయపడాల్సి ఉంటుంది మరణాన్ని వాయిదా వేయమని. నేను ఇప్పటివరకూ ఎవరినీ ఏదీ అడగలేదు. కనుక కాశ్యపుడు ఎక్కడున్నా సరే తీసుకురావాలి’’ అన్నాడు బుద్ధుడు. అలాగే కాశ్యపుడిని వెతికి బుద్ధుడి వద్దకు తీసుకువచ్చారు. కాశ్యపుడు రావడంతోనే బుద్ధుడు సంతోషపడ్డాడు.

‘‘కాశ్యపా నువ్వు వస్తావని తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వచ్చావు. మంచిది. మరణమా! ఇక నువ్వు నన్ను నీతో తీసుకుపోవచ్చు’’ అన్నాడు బుద్ధుడు.
శిష్యులందరూ చుట్టూ నిల్చుని చూస్తుండగా కాశ్యపుడి ఒడిలో బుద్ధుడి తుది శ్వాస వీడిపోయింది.ఎవరికీ లభించని మహాభాగ్యం కాశ్యపుడికి దక్కింది. కాశ్యపుడు ఒక్కడే చివరివరకూ బుద్ధుడి శిష్యుడిగా కొనసాగాడు. అయితే మిగిలిన వారు బుద్ధుడిని వీడి వెళ్ళిన తర్వాత ఎవరికి వారు గురువుగా మారిపోయారు. ఈ క్రమంలో వారు తమ గురువును మరచిపోయారు. కానీ కాశ్యపుడు బయటకు వెళ్ళిన తర్వాత కూడా మేటి శిష్యుడిగానే ఉండిపోయారు. బుద్ధుడి అస్తమయం తర్వాత ఆయన గురువయ్యారు.
గురువు అనేది ఓ బాధ్యత. ఆ హోదా కోసం పరితపించక్కర్లేదు. అర్హత ఉన్నవారికి తానుగా ఆ పదవి దక్కుతుంది.
– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు