నేను మీ చేతిని

4 May, 2016 23:19 IST|Sakshi
నేను మీ చేతిని

దురదృష్టం కొద్దీ ఒకవేళ తనకు కళ్లు పోయినా, కాళ్లు పోయినా అంతకంటే ఘోరం ఉండదనుకుంటాడు ఆనంద్. అయితే, నన్నూ, నా భాగస్వామిని కోల్పోతే మాత్రం అతడికి అంతకు మించిన కష్టం తప్పదు. నేను ఆనంద్ కుడి చేతిని. ఆనంద్ శరీరంలో నేనూ, నా భాగస్వామి కీలకమైన దేహ యంత్ర భాగాలం. ఆనంద్ శరీరంలోని ఇతర భాగాల్లాగానే మేము కూడా అతడి మెదడు అధీనంలో పనిచేస్తుంటాం.

మెదడే నియంత్రణలోనే పనిచేస్తుంటాం
చాలా మానవ నిర్మిత యంత్రాలన్నీ నా ముందు బలాదూరే! ఆనంద్ నైపుణ్యం గల టైపిస్ట్ అనుకోండి... నేనూ, నా భాగస్వామి కలిసి నిమిషానికి 120 పదాలను అలవోకగా టైప్ చేసేస్తాం. మమ్మల్ని నియంత్రించడానికే మెదడులో రెండు ప్రత్యేక భాగాలు పనిచేస్తుంటాయి. మెదడులో అవి ఉన్న ప్రదేశాన్నే ‘మోటార్ కార్టెక్స్’ అంటారు. ఆనంద్ తన బొటనవేలిని ఆడిస్తున్నాడనుకోండి... చాలా చిన్నగా కనిపించే ఈ చర్య కోసం మెదడు నుంచి... ఈ కండరాన్ని కొంచెం ముడుచుకోనీ, ఆ కీలును రిలాక్స్ కానివ్వు... వంటి వేలాది ఆదేశాలు అందుతూ ఉంటాయి.

ఆనంద్ నిద్రపోతున్నప్పుడు తప్ప నేనూ, నా భాగస్వామి ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. ఆనంద్ జీవితకాలంలో కనీసం రెండున్నర కోట్ల సార్లు అతడి పిడికిలి ముడుచుకోవడానికి, తెరుచుకోవడానికి దోహదపడేది మేమే. ఆనంద్ శరీరం బరువుకు సపోర్ట్ చేయడానికి తగినంత బలం ఉంటుంది మాకు. ఆనంద్ ముంజేతి కండరాల్లో ఉండే శక్తి ఫలితంగా బిగించి పట్టే అతడి పట్టు బలం 45 కిలోల వరకు ఉంటుంది. ఒకవేళ ఆనంద్ క్రమం తప్పని వ్యాయామంతో దృఢంగా ఉన్నాడనుకోండి అప్పుడు అతడి పట్టు బలం 60 కిలోల కంటే ఎక్కువే ఉంటుంది.

 నాలో 27 ఎముకలు ఉంటాయి
భౌతికమైన పనులు చేయడంలోనే కాదు, మేధా వికాసంలోనూ మా పాత్ర ఉందని గర్వంగా చెప్పుకోగలం. గణితశాస్త్రం అభివృద్ధిలో మాది కీలక పాత్ర. నాకు, నా భాగస్వామికి ఉన్న పది వేళ్లతో పాటు, అతడి రెండు పాదాలకూ ఉండే పదివేళ్లు దశాంశ విధానాన్ని కనుగొనడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇతర అవయవాలతో పోలిస్తే, నిర్మాణపరంగా నేను చాలా సంక్లిష్టంగా ఉంటాను. నా మణికట్టులో 8 ఎముకలు, అరచేతిలో 5 ఎముకలు, వేళ్లలో 14 ఎముకలు- నాలో మొత్తం 27 ఎముకలు ఉంటాయి. నా భాగస్వామిలో కూడా ఇదే సంఖ్యలో ఎముకలు ఉంటాయి. ఆనంద్ శరీరంలో ఉండే మొత్తం ఎముకల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ ఎముకలు మాలోనే ఉంటాయి. నాలోని ప్రతి చదరపు సెంటీమీటర్‌లోనూ వేలాది నరాల చివర్లు అనుసంధానమై ఉంటాయి. వీటి ద్వారానే వేడి, చల్లదనం, స్పర్శ తెలుసుకోగలుగుతాను.

 వేరు చేసే వేలిముద్రలు
ఆనంద్ కడుపులో ఉండగా నాలుగో నెలలోనే వేలిముద్రలు ఏర్పడతాయి. ఒకరికి ఉండే వేలిముద్రలు ప్రపంచంలో వేరొకరికి ఉండనే ఉండవు. వేలిముద్రలే ఆనంద్ ఉనికిని ఇతరుల నుంచి వేరుచేసే ఆధారాలు. ఇక నా అరచేతుల్లో చాలా స్వేదగ్రంథులు ఉంటాయి. లక్షలాది ఏళ్ల కిందట ఆనంద్ పూర్వీకులు ఎక్కువగా చెట్ల మధ్య తిరుగాడేవారు. కొమ్మలను పట్టుకుని వేలాడటంలో చెమ్మదేరిన అరచేతులు వాళ్లకు మంచి పట్టు ఇచ్చేవి. ఇప్పుడు కూడా ఆనంద్‌కు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడంలోను, కారు స్టీరింగ్ పట్టుకోవడంలోను చెమ్మదేరిన అరచేతులే చక్కని పట్టు ఇస్తాయి.

ఇవీ నా కష్టాలు
ఆనంద్ చేసే పనుల్లో చాలా వరకు కీలక పాత్ర పోషించే నాకు చాలా కష్టాలు కూడా ఉన్నాయి. అతడు ప్రమాదాలకు గురైనప్పుడు తరచు గాయపడేది నేనే. వంటపని చేస్తున్నప్పుడు కాలడం, కూరగాయలు తరుగుతున్నప్పుడు కోసుకోవడం, మట్టి పనులు ఏవైనా చేసినప్పుడు కమిలిపోవడం వంటి బాధలు నాకు ఎదురవుతూ ఉంటాయి. ఇవి కాకుండా, తరచు ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకడం, సొరియాసిస్ వంటి చర్మవ్యాధులకు, అలెర్జీలకు కూడా గురవుతూ ఉంటాను. ఆర్థరైటిస్ వంటి ఇక్కట్లు నాలోని కీళ్లకు తీవ్రమైన నొప్పులు కలిగిస్తాయి. ప్రమాదవశాత్తు బలమైన దెబ్బలు తగిలినప్పుడు నా టెండన్లు, లిగమెంట్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి ఎముకలు కూడా విరిగిపోతూ ఉంటాయి. తగిన చికిత్సలతో ఈ బాధలు నయమవుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు నాకు క్యాన్సర్ సోకే అవకాశాలు మాత్రం చాలా చాలా అరుదు.

ఇతర అవయవాలకు ప్రత్యామ్నాయం మేమే!
ప్రపంచంలో దాదాపు 95 శాతం మందికిలాగే ఆనంద్‌ది కూడా కుడిచేతి వాటమే. అతడు శిశువుగా ఉన్నప్పుడు తొలి ఆరునెలల్లోనే తన చేతి వాటాన్ని ఎంచుకున్నాడు. ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలుచునే భంగిమను ఎంచుకోకుంటే, మనుషులు అతి దుర్బలమైన జీవులుగా మిగిలిపోయేవారు. ఏ పులికో, సింహానికో పలారమైపోయేవారు. నిటారుగా నిలబడే భంగిమ కారణంగానే చేతులు స్వేచ్ఛను పొందాయి. మెదడు కూడా అందుకు అనుగుణంగా పరిణామం చెందింది. ఫలితంగా చేతులు ఆయుధాలను ఉపయోగించడం సహా రకరకాల నైపుణ్యాలను నేర్చుకున్నాయి. కళ్లకు, గొంతుకు, చెవులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగల సామర్థ్యం మాది. ఆనంద్‌కు ఒకవేళ చూపుపోయిందనుకోండి... బ్రెయిలీ లిపిని చదవడానికి అతడి మమ్మల్ని వాడుకోవచ్చు. ఒకవేళ మూగ బధిరుడయ్యాడనుకోండి... సైగల భాష ద్వారా ఇతరులతో సంభాషించడానికి మేమే ఉపయోగపడతాం. మా స్పర్శజ్ఞానం గొప్పది. ఆనంద్ జేబులోంచి ఐదురూపాయల నాణెం తీయాలనుకోండి... జేబులోకి చూడకుండానే, వేళ్లతో తడిమి కచ్చితంగా అదే నాణేన్ని బయటకు తీయగలడు.

బొటనవేలే కీలకం
నాలో ఎక్కువగా పనిచేసే భాగాలు వేళ్లే. నాలుగు వేళ్లూ ఎంత పనిచేసినా, వాటికి వ్యతిరేకంగా బొటనవేలు లేకుంటే మాత్రం అవి అంత పనిచేయలేవు. బొటనవేలి సాయం లేకుండా ఆనంద్‌ను ఓ గ్లాసు నీళ్లు పెకైత్తమనండి చూద్దాం... పోనీ అంతొద్దు... పెన్ను తీసుకుని మిగిలిన నాలుగు వేళ్ల సాయంతోనే ఏదైనా రాయమనండి చూద్దాం. నేను చేసే పనుల్లో దాదాపు 45 శాతం బొటనవేలి సాయంతోనే సాధ్యమవుతాయి. బొటనవేలి సాయమే లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దాదాపు అసాధ్యంగా అనిపిస్తాయి.  నాలో ఒకదానికి మరొకటిగా అతుక్కుని ఉండే ఎముకల మధ్య సున్నితమైన టెండన్లు, లిగమెంట్లు వాటి కదలికలకు దోహదపడతాయి. వాటిపై కనెక్టివ్ టిష్యూలతో పొరలా ఉండే ఫ్యాషియా నరాలు, రక్తనాళాలు వంటి ఇతర అంశాలకు పునాదిలా పనిచేస్తుంది. నాలో లెక్కలేనన్ని రక్తనాళాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు