ఏ తల్లి పాలోఈ ప్రాణధారలు

11 Sep, 2019 10:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రాణమిచ్చిన అమ్మ.. పాలు ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వడానికి ఆ తల్లి దగ్గర పాలు లేకపోవచ్చు. ఒక్కోసారి తల్లే లేకపోవచ్చు! అయినా సరే.. ఆకలితో డొక్కలు ఎగిరేలా బిడ్డ ఏడ్వకూడదు. ఏడ్చాడంటే.. పాలు లేవని కాదు. అమ్మ లేదని కాదు. ఆ బిడ్డ జీవించే హక్కును కాపాడేవారు లేరని! పాలిచ్చే తల్లి లేకపోయినా..పాలు పంచే తల్లులకు కొదవలేదని ‘ధాత్రి’ నిరూపిస్తోంది.అభాగ్య శిశువులకు ప్రాణధారలు పోస్తోంది.

పుట్టిన ప్రతి బిడ్డా బతికి బట్టకట్టాలి. తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పుడే జీవించే హక్కుకు తనతో భూమ్మీదకు తెచ్చుకుంటుంది ప్రాణి. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే కాదు, సమాజంలో అందరి మీదా ఉంటుంది. అయితే అందరూ అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లే కనిపిస్తుంటుంది. అయినా చంటిబిడ్డల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వైద్యం అందక ప్రాణాలు పోతున్న చంటిపిల్లల కంటే తల్లిపాలు లేక మరణాన్ని ఆశ్రయిస్తున్న వాళ్లే ఎక్కువ అంటే నమ్మడానికి బాధగానే ఉంటుంది. అయినా ఇది నిజం. ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ ఎంత గొప్ప హాస్పిటల్‌ అయినా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బిడ్డలకు వైద్యం మాత్రమే చేయగలుగుతుంది. ఆ బిడ్డకు తల్లి పాలనివ్వడం ఇటు హాస్పిటల్‌ చేతిలోను, అటు వైద్యరంగం చేతిలోను లేని విషయం. బిడ్డకు తల్లిపాల కొరతను తీర్చే టానిక్‌ను ఇవ్వడం వైద్యరంగం చేయలేని పని. ఇది కేవలం మరో తల్లి మాత్రమే చేయగలిగిన పని. అందుకే పుట్టే బిడ్డల కోసం తల్లిపాల బ్యాంకులు కూడా పుట్టాయి. ‘ధాత్రి’ కూడా అలాగే పుట్టింది. ధాత్రి అంటే పెంపుడు తల్లి. ‘‘తల్లికి దూరమైన బిడ్డను కన్నతల్లిలా పెంచే మరో మహిళను ధాత్రి అంటారు. అందుకే తల్లిపాలకు దూరమైన బిడ్డలకు తన పాలిచ్చి కాపాడే తల్లి పాల బ్యాంకుకు ధాత్రి అని పేరు పెట్టాం’’ అని చెప్పారు హైదరాబాద్, నీలోఫర్‌ హాస్పిటల్‌లోని తల్లిపాల బ్యాంకు నిర్వహకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌.

పాలిచ్చే అమ్మ
ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ... తల్లి పాలు లేక తల్లడిల్లుతున్న మరో బిడ్డకు ఒక పూట పాలివ్వడం మనకు పూర్వం నుంచి ఉన్న సంప్రదాయమే. ఒక అవసరం నుంచి ఆర్ద్రతతో పుట్టుకొచ్చిన సహాయం ఇది. పురిటిలోనే తల్లి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ తల్లిలేని బిడ్డకు మరో బాలింత తన మాతృత్వాన్ని పంచేది. తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకు కూడా ప్రాణం పోసేది. ఒక తల్లి అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఆమె కోలుకునే వరకు ఆ బిడ్డను మరో తల్లి ఆదుకునేది. విదేశాల్లో ‘వెట్‌ నర్సింగ్‌’ పేరుతో పిలిచినా, మనదేశంలో దాదమ్మ అని, పాల దాది అని, పాలమ్మ అనీ పిలిచినా... ఆ పాలిచ్చిన తల్లిని కన్నతల్లితో సమానంగా ప్రేమించేవాళ్లు పిల్లలు. పాలిచ్చిన తల్లులు... ఆ బిడ్డకు తన కన్నబిడ్డతో సమానంగా ప్రేమను పంచేవాళ్లు.

ఇప్పుడూ ఉన్నారు
‘‘కెరీర్‌ కోసం పరుగులు తీసే క్రమంలో తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడానికి కూడా టైమ్‌ లేకుండా ఉంటున్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన మా ప్రయత్నం సఫలమైంది. మా హాస్పిటల్‌కి వచ్చే మహిళలు తమ బిడ్డలకు పాలిస్తూ, మరో తల్లి బిడ్డకు కూడా పాలిస్తున్నారు’’ అంటున్నారు ధాత్రి మదర్‌ మిల్క్‌ బ్యాంకు స్థాపకులు డాక్టర్‌ సంతోష్‌కుమార్‌. ‘‘నెలలు నిండక ముందే పుట్టే పిల్లలను, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స చేస్తాం. ఇతర అనారోగ్యాలతో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. ట్రీట్‌మెంట్‌ సమయంలో బిడ్డకు పాలు పట్టాల్సిన ప్రతిసారీ తల్లి అందుబాటులో ఉండడం సాధ్యం కాదు. మా హాస్పిటల్‌కి వైద్యం కోసం వచ్చే చంటిపిల్లలు రోజూ మూడు వందల మందికి తగ్గరు. అంతకుముందు వాళ్లందరికీ ఫార్ములా పాలు, ఇతర పోతపాలు పట్టేవాళ్లం. అయితే రోజుల బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. తల్లిపాలలో ఉండే హెచ్‌ఎమ్‌వో బిడ్డ పేగును రక్షిస్తుంది. ఇతర ఏ పాలు పట్టినా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపించేది. దాంతో ఒక సమస్య నుంచి బయటపడిన బిడ్డ మరో సమస్యతో బాధపడాల్సి వచ్చేది. దీనికి పరిష్కారం తల్లిపాల బ్యాంకును స్థాపించడమే అనుకున్నాం. మా ప్రయత్నం విజయవంతమైంది. శిశు మరణాలను తగ్గించగలిగాం. నీలోఫర్‌ హాస్పిటల్‌లో రోజుకు నాలుగున్నర లీటర్ల పాలను ప్రాసెస్‌ చేసి అనారోగ్యంతో ఉన్న చంటిబిడ్డలకు, అనాథ బిడ్డలకు అందించగలుగుతున్నాం. రోజుకు తొమ్మిది లీటర్ల పాలను సేకరించగలిగితే తల్లిపాల కోసం తపించే బయటి పిల్లలకు కూడా ఇవ్వడం సాధ్యమవుతుంది’’ అన్నారాయన.

వచ్చి ఇస్తున్నారు
నీలోఫర్‌ హాస్పిటల్‌కి రోజూ యాభై మంది వరకు పాలిచ్చే తల్లులు వస్తున్నారు. వచ్చేవారిలో ఓ ఇరవై మంది కేవలం పాలను డొనేషన్‌ ఇవ్వడానికే ఇస్తున్నారు. తన బిడ్డ తాగిన తర్వాత అదనంగా ఉన్న పాలను మరో బిడ్డకు ఇవ్వడం కోసమే హాస్పిటల్‌కి వస్తున్న తల్లులు వాళ్లు. మరికొంత మంది హాస్పిటల్‌లో పంప్‌ సహాయంతో పాలు తీసి తమ బిడ్డకు అవసరమైనన్ని తమతో ఇంటికి తీసుకువెళ్తారు, కొన్ని పాలను హాస్పిటల్‌లో ఉన్న పిల్లలకు ఇస్తారు. బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో పాలను బాటిల్స్‌లోకి సేకరిస్తారు. అలా అందరి పాలను కలిపేసి పాశ్చరైజ్‌ చేస్తారు. పాశ్చరైజేషన్‌ ప్రక్రియకు సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. పాశ్చరైజేషన్‌ తర్వాత పాలను కొత్త బాటిల్స్‌లో నింపుతారు. అవి పిల్లలు తాగడానికి సిద్ధంగా ఉన్న పాలు. ఈ పాలను మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే ఏడాది పాటు తాజాగా ఉంటాయి.
– డాక్టర్‌ సంతోష్‌ కుమార్,ఫౌండర్‌ డైరెక్టర్, ధాత్రి లాక్టేషన్‌ సెంటర్‌

ఇంట్లో నిల్వ చేసిన పాలు
ఉద్యోగాలకు వెళ్లే తల్లులు ఇంట్లోనే బ్రెస్ట్‌ పంప్‌తో పాలను తీసి బిడ్డకు తాగించవచ్చు. తల్లి నుంచి తీసిన పాలను మన వాతావరణంలో గది ఉష్ణోగ్రతలో ఉంచినా కూడా నాలుగు గంటల వరకు తాజాగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ సేపు నిల్వ చేయాల్సి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటల వరకు వాడుకోవచ్చు. డీప్‌ ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాలు 72 గంటల వరకు తాజాగా ఉంటాయి. వీటికి పాశ్చరైజేషన్‌ అవసరం లేదు.

బ్యాంకులు పెరగాలి
బాలింతలున్నారు, చంటిబిడ్డలూ ఉన్నారు. ఆ ఇద్దరినీ కలిపే వార«ధులే తల్లి పాల బ్యాంకులు. మనదేశంలో ఈ మదర్‌ మిల్క్‌ బ్యాంకులు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి. అది కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పూనా, ఉదయ్‌పూర్, హైదరాబాద్‌ వంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒకతల్లి పాల బ్యాంకును స్థాపించగలిగితే శిశుమరణాలనేవి లేకుండా చేయవచ్చు. మా హాస్పిటల్‌లో మిల్క్‌ బ్యాంకు స్థాపించడానికి ఎనభై లక్షలైంది. నిర్వహణ వ్యయం నెలకు లక్షన్నర వరకు అవుతోంది. పుట్టిన ప్రతి బిడ్డా ఆరోగ్యంగా పెరగాలంటే తల్లి పాలు తప్పని సరి. హెల్దీ నేషన్‌ బిల్డింగ్‌లో ప్రధానమైన వాళ్లు చంటిబిడ్డలే. అందుకే ఈ మాత్రం ఖర్చుకు ప్రభుత్వాలు వెనుకాడకూడదు.– డాక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్,డైరెక్టర్, ధాత్రి కాంప్రహెన్సివ్‌ లాక్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్,నీలోఫర్‌ హాస్పిటల్, హైదరాబాద్‌

కంటిరెప్ప కంటే ఎక్కువే
‘‘ధాత్రి అనే పాపాయి 900 గ్రాముల బరువుతో పుట్టింది. నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి రెండున్నర నెలల పాటు పాశ్చరైజ్‌ చేసిన మదర్‌ బ్యాంకు పాలను పట్టాం. పాపాయి బరువు రెండున్నర కేజీలకు పెరిగే వరకు అలా కాపాడాం. కేజీ బరువు కూడా లేకుండా భూమ్మీదకొచ్చిన బిడ్డలను బతికించడం చిన్నసంగతి కాదు. కంటికి రెప్పలా కాపాడాం అనేది చాలా చిన్న మాటే అవుతుంది. అలాంటి సంక్లిష్ట స్థితిని ధైర్యంగా దాట గలిగింది తల్లి పాల ఆసరాతోనే. తల్లి పాలను పాశ్చరైజ్‌ చేసి, మైనస్‌ 20 డిగ్రీలలో నిల్వ చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటాయి. తల్లిపాలంటే ద్రవరూపంలో ఉన్న బంగారం. బిడ్డకు ఒంటి నిండా బంగారంతో నింపడం కంటే బంగారంలాంటి తల్లిపాలనిచ్చి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేద్దాం’’ అన్నారు డాక్టర్లు.– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా