World Diabetes Day: ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. స్టెరాయిడ్స్‌ వాడటం వల్లేనా?

14 Nov, 2023 12:13 IST|Sakshi

ఒకప్పుడు ఫలానా వ్యక్తికి షుగర్‌ (చక్కెర) వ్యాధి వచ్చిందంట అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఈయనకు కూడా షుగర్‌ వచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు. షుగర్‌ జబ్బు ఇప్పుడు సాధారణమైంది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు డయాబెటీస్‌ వ్యాధి (షుగర్‌) పట్టణ వాసుల్లోనే అధికంగా కనిపించేది.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వారిలోనూ ఈ వ్యాధి అధికమవుతోంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలో మారుల వల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 14వ వరల్డ్‌ డయాబెటీస్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

సాక్షి, కర్నూల్‌: ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది మధుమేహం రోగులున్నట్లు తేలింది. ఈ రోగం ఉందన్న విషయం తెలియని వారు మరో 25 శాతం మంది ఉండే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చేసిన రక్తపరీక్షల్లో ఎక్కువ శాతం మందికి చక్కెర వ్యాధి బయటపడుతోంది. ఇలా జిల్లాలో ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు మరో 15 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజి విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాలు ఓపీ చికిత్స చేస్తారు. ప్రతి ఓపీకి 200 మంది చికిత్సకు రాగా అందులో వంద మందికి ఇన్సులిన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. మొత్తం ఓపీలో 80 శాతం మంది షుగర్‌ రోగులే ఉండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఎండోక్రైనాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్ల వద్దకు సైతం ప్రతి యేటా 16 వేల మంది చికిత్స కోసం వస్తున్నట్లు అంచనా. 

డయాబెటీస్‌ రకాలు 
టైప్‌ 1 డయాబెటీస్‌ :

శరీరం అతి తక్కువ ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ రకం మధుమేహం గల వ్యక్తులు ఇన్సులిన్‌ను విధిగా తీసుకోవాలి. లేకపోతే ప్రాణాంతకమైన డీకేఏ అనే పరిస్థితిలోకి జారుకుంటారు. ఇది చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది. 

లక్షణాలు 
ఇందులో అధిక దాహం, ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ ఆకలి, హటాత్తుగా బరువు తగ్గిపోవడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. 

టైప్‌ 2 డయాబెటీస్‌ 
 శరీరానికి తగినంత ఇన్సులిన్‌ ఉతత్తి కాదు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఈ సమస్య ప్రారంభం అవుతుంది. స్థూలకాయం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు దీనికి కారణాలు. 

లక్షణాలు 
ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. తర్వాత తీవ్ర అలసట, చేతులు,కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, తరచూ మూత్రవిసర్జన, లైంగిక అసమర్ధత, గాయాలు త్వరగా మానకపోవడం, అతిగా ఆకలి, అతిగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరీక్షలు చేయించాలి. 
☛ షుగర్‌ పేషెంట్లు రక్తంలో షుగర్‌ స్థాయిని తెలుసుకునే పరీక్ష నెలకొకసారి చేయించాలి. 
☛ సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాల పనితనం (బ్లడ్‌ యూరియా, క్రియాటినిన్‌) చేయించాలి. 
☛ ఆరు నెలలకోసారి రక్తంలోని కొవ్వుశాతం చేయించుకోవాలి. 
☛ మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ చేయించుకోవడం మంచిది. 

తెల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి 
తెల్లగా కనిపించే ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చక్కెర, పిండి పదార్థాలు, తెల్లగా కనిపించే నూనెలు, 
మైదాతో చేసిన పదార్థాలు, జంక్‌ఫుడ్‌ లాంటివి మానేయాలి. దానికి బదులుగా ఆకుకూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. 

రోజూ వ్యాయామం తపనిసరి
ప్రతిరోజూ అరగంట వాకింగ్‌తో మధుమేహం నియంత్రణలోకి వస్తుందని వైద్యులు చెబుతున్నా రు. దీంతో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం సైతం ఎంతో 
మేలు చేస్తాయి.వ్యాయామం వల్ల గుండెపోటు, గుండెకవాటాల వ్యాధుల ముప్పు తగ్గి టైప్‌–2 మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు 
జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో షుగర్‌ వ్యాధికి అవసరమైన షుగర్, లిపిడ్‌ ప్రొఫైల్, ఆర్‌ఎఫ్‌టీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తోంది. ప్రస్తుతం షుగర్‌ ఉన్న వారికి ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తున్నారు. 

కోవిడ్‌ తర్వాత పెరిగిన కేసులు 
కోవిడ్‌–19 ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే గాక ఇప్పటికీ దాని తాలూకు నష్టం వెంటాడుతూనే ఉంది. ఇందులో ముందుగా షుగర్‌వ్యాధి మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే షుగర్‌ ఉన్న వారికి కోవిడ్‌ తర్వాత షుగర్‌ లెవెల్స్‌ పెరగగా, కొత్తగా షుగర్‌ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కోవిడ్‌ సమయంలో స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, ఇతర ఔషధాలు అధికంగా వాడటంతో పాటు అధికంగా మాంసాహారం, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల షుగర్‌ కేసులు పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు.

పీ డయాబెటీస్‌ రోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది 
ఇటీవల ప్రీ డయాబెటీస్‌ రోగుల సంఖ్య 15 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆందోళనకర విషయం. పరిస్థితి మారకపోతే భవిష్యత్‌లో దేశ జనాభాలో సగం మంది షుగర్‌బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఈ గణాంకాలను బట్టి అర్థం అవుతోంది. ఇది అటు దేశ, ఇటు కుటుంబ ఆర్థిక, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సి ఉంది. 
డాక్టర్‌ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజి 
హెచ్‌ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 

డయాలసిస్‌ రోగుల్లో 60 శాతం షుగర్‌ రోగులే...! 
ప్రస్తుతం డయాలసిస్‌ చేయించుకుంటున్న వారిలో 50 నుంచి 60 శాతం షుగర్‌ రోగులే ఉంటున్నారు. దీనిని బట్టి కిడ్నీలపై షుగర్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం అవుతుంది. మూత్రంలో ప్రోటీన్‌ ఎక్కువగా పోతుంటే జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఇప్పటికే షుగర్‌ ఉన్న వారు నెలకోసారి మూత్రపరీక్ష చేయించుకోవాలి. ముందుజాగ్రత్తగా షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. 
–డాక్టర్‌ పీఎల్‌. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్‌ 
ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ 
సర్వజన వైద్యశాల  

మరిన్ని వార్తలు