దేవుడిలాంటి మనిషి!

27 Sep, 2017 00:44 IST|Sakshi

ఆత్మీయం

దేవుడు ఏ రూపంలో సాక్షాత్కరిస్తాడో ఎవరూ చెప్పలేదు. ఆ దేవుడు కూడా చెప్పలేడేమో తను ఏ రూపంలో మనిషికి సాక్షాత్కరిస్తాడో! మనిషికి దేవుడిని సాక్షాత్కరింపజేసేవారు వేరే ఉంటారు. ఎవరు ఆ ‘వేరే’? మనుషుల్లోని దేవుళ్లు! మనిషి కంటే ఒక మెట్టు పైన ఉన్నవాళ్లు, దేవుడిని మనిషి దగ్గరికి ఒక మెట్టు కింది దించగలిగిన వాళ్లు.. ఈ ‘మనుషుల్లోని దేవుళ్లు’. వీళ్లకు మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు.. ‘మనిషి’ అని గానీ, ‘దేవుడు’ అని గానీ అనకుండా! మనిషి అంటే మరీ తక్కువైపోతారనీ, దేవుడు అంటే మరీ ఎక్కువైపోతారని కాదు దీని అర్థం. మనిషికి, దేవుడికి మధ్య వారధిగా ఉన్నవారు మనిషీ, దేవుడు కాకుండా మరొకటేదైనా అయి ఉంటారు కదా! అందుకు.

మళ్లీ ‘దేవుడిలాంటి మనిషి’ వేరు! దేవుడిలాంటి మనిషి అకస్మాత్తుగా సాక్షాత్కరిస్తాడు. దేవుడిలా! అతడిని ఏ దేవుడో వచ్చి సాక్షాత్కరింపజేయడు. మనకే అనిపిస్తుంది, కళ్లెదుట దేవుడు ప్రత్యక్షమైనట్లుగా. ‘ఏంటలా ఉన్నా?’ అంటాడు ఆ దేవుడి లాంటి మనిషి. మనతో ఏ బంధమూ, ఏ సంబంధమూ, ఏ అనుబంధమూ, ఏ భవబంధమూ లేని ఆ మనిషి! ‘తిన్నావా?’ అని అడుగుతాడు. ‘పిల్లలు ఎలా ఉన్నారు?’ అంటాడు. ‘కంటిలో ఆ చెమ్మ ఏమిటి?’ అని అంటాడు. ‘నేనేమైనా చేయగలనా?’ అని కూడా మనసును నిమురుతాడు. దేవుళ్లే వచ్చి దర్శించుకునే మనిషిలా అనిపిస్తాడు అప్పుడా దేవుడిలాంటి మనిషి! ఏమిటి తేడా ఈ దేవుడిలాంటి మనిషికి, మనుషుల్లోని దేవుడికి? మనుషుల్లోని దేవుడికి ఒక ఆశ్రమం ఉంటుంది. దేవుడి లాంటి మనిషి.. ఆశ్రయం కోసం మన దగ్గరికి వచ్చిన దేవుడిలా ఉంటాడు. మనుషుల్లోని దేవుడి దగ్గరకు మనం వెళ్తాం. దేవుడిలాంటి మనిషి మన దగ్గరకు వస్తాడు. అంతే తేడా.
అంతే తేడా కాదు. అంత తేడా!

దేవుడికీ, దేవుడిలాంటి మనిషి మధ్య కూడా తేడా ఉంది. మనం వెళ్లే దేవుడికి అంతకుముందే కట్టిన గుడి ఒకటి ఉంటుంది. మన దగ్గరకు వచ్చే దేవుడు మన గుండెలో గుడి కట్టుకుని వెళ్తాడు. మనం వెళ్లే దేవుడి దగ్గర తోపులాట ఉంటుంది. మన దగ్గరకు వచ్చే దేవుడు మన  కోసమే వాళ్లను వీళ్లను తోసుకుని వస్తాడు. ఇవన్నీ కాదు, మనం వెళ్లే దేవుడి దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకుంటాం. మన దగ్గరకు వచ్చే దేవుడు అడిగి మరీ మన సమస్యలు తెలుసుకుంటాడు.

మరిన్ని వార్తలు