గొర్రె దారి గొర్రెదే బుర్ర దారి బుర్రదే

11 Feb, 2019 01:02 IST|Sakshi

కథాసారం

సోమన్నని గొర్రెలు తినేశాయా?  గొర్రెల్ని  సోమన్న తినేశాడా?

రైళ్లు కుడి చెవిలోంచి దూరి ఎడమ చెవిలోంచి పైకి పోతున్నట్లు, ఎడమవేపు తిరిగి పడుకుంటే ఎవరో ఎర్రటి గోళ్లతో మెడపట్టుకుని చీరుతున్నట్టు, కుడివేపు తిరిగితే డేల్మేషన్‌ కుక్క, ఎలుగుబంటి లాంటిది, ఆకురాయిలాంటి నాలికతో పరపర నాకుతున్నట్లు...

లేచి, అద్దంలో చూసుకుంటే కళ్లలో ఒక్క అయోటా అయినా నిద్ర కనిపించదు. రిస్ట్‌వాచ్‌లో కాలం ఘోరంగా ముందుకు రాత్రిలోంచి తోసుకుంటూ... రెండు గంటల యిరవయి నిమిషాల పదహారు సెకండ్ల... పదిహేడు...

జగ్‌లోంచి మెల్లగా గ్లాస్‌లో నీళ్లు పోసి మె..ల్ల..గా తాగి, ఆవులించి, పక్కమీద మల్లెపువ్వులాంటి షీట్‌మీద ఒళ్లు విరుచుకుంటూ పడుకుని– నటన– మళ్లీ ఆవులిస్తూ, కళ్లు మూసుకుని, ఆ క్షణంలో నిద్రపోయేవాడిలా– అంతా నటన– ఒళ్లు కొంచెం ముడుచుకుని– అంతా ఎంత నటన– మిల్లులో నలిగి అలిసిపోయిన పెద్ద కూలీలాగ... ఏవో కలలొస్తున్నట్లు ఊహించుకోబోతూ వుంటే... డేల్మేషన్‌ గుర్రుమంటూ నాలికతో... ఈసారి ఎముకల్ని గీరుతున్నట్లు. ఆ ఎవరివో గోళ్లు, పారల్లాంటి గోళ్లు, మెడలో గుచ్చుకుంటున్నాయి.

‘‘పాత విషయాలు, తియ్యటివి, ఏవో జ్ఞాపకం తెచ్చుకుంటూ పడుకో’’ అని ఎప్పుడో అన్నాడు భుజంగం ది సైకో అనలిస్ట్‌... పెన్సిల్‌ చెక్కుతూ దోసకాయ తరిగినట్లు తరగబడిన ఎడమచేతి చూపుడు వేలూ, అమాయకంగా పుస్తకం తీసి దుమ్ము దులుపుతుంటే క్రూరంగా కుట్టిన ఎర్రతేలూ, పరధ్యాన్నంగా ఎదురింటివేపు చూస్తుంటే తన వేపే ఎప్పుడూ కళ్లప్పజెప్పి చూస్తుంటాడని భర్తతో రిపోర్ట్‌ చేసిన మహా యిల్లాలూ, కటకటాల్లో ఏమీ తోచక పెడితే మళ్లీ తిరిగి రాదనుకున్న కుడికాలూ, ఆకాశం అంత న్యూస్‌పేపర్‌ పేజీలో బొక్కిపన్నులాగ నా నంబరే లేని పరీక్షా ఫలితాలూ... యివీ.

ఎవరివో ఆ గోళ్లు జాగ్యులర్‌ రక్తనాళంలోకి గుచ్చుకుని...

డేల్మేషన్‌ స్థిరంగా కూచుని ఎముక చుట్టూ మిగిలిన మాంసాన్ని చీకుతూ...

‘‘అది కూడా పని చెయ్యకపోతే గొర్రెల్ని లెక్కపెట్టు. వెస్టర్నర్స్‌ అలాగే చేస్తారు’’ అన్నాడు ఈ మధ్యనే భుజంగం ది సైకో. భుజంగానికి క్లయింట్స్‌ లేరు. సెల్ఫ్‌ మీదనే ప్రయోగాలు. దారిన పోతూంటే నేనొకణ్ణి దొరికాను. మొత్తం ఇద్దరు.

... తొమ్మిది వందల తొంభయి ఆరు... తొమ్మిది వందల తొంభయి ఏడు... ఎన్నో వందల నలభయి ఎనిమిది... ఎన్నో వందల నలభయి తొమ్మిది...

గొర్రెల్ని దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. చూసినట్లు జ్ఞాపకం లేదు. చాలాకాలం నుంచీ నాలో ఒక ఊహ. పల్లెటూర్లో నాకో ఇల్లు. గజపతి నగరంలో? కారంపూడిలో? తాడి, దువ్వాడ, బండ మీద? కమ్మ పల్లె? నాకో పెద్ద పొలం. ‘‘మాగాణి’’. నాకో రైతు. వెంకయ్య? ఈరినాయుడు? గురప్ప? రొబ్బి సోమన్న? సోమన్నే. వాడి పాకలో గొర్రెలు, మేకలు, ఆబోతులు. కొట్టాం. నేనక్కడికి సమ్మర్‌లో శిస్తులు వసూలికి. చిన్నస్టేషన్‌ దిగి ఎద్దుబండి. రామినాయుడు, కాదు సోమన్న వంగి వంగి దండాలు. డబ్బు, నలిగిన నోట్లు. వేడిగా పాలు కంచుగ్లాసులో. ఇంటి వెనక గొర్రెలు. గొర్రెలెలా వుంటాయి? మేకల్లాగ వుంటాయా? అసలు మేకలెలా వుంటాయి? ఇంకా అసలుకి వస్తే మేకలంటే ఏమిటి? గొర్రెలకీ, మేకలకీ భేదం?

... ఏభయి వేల తొంభయి నాలుగు... ఏభయి వేల తొంభయి ఆరు... తొంభయి వేల తొమ్మిది వందల ముప్పయి నాలుగు...

ఈ గొర్రెలు పెరట్లో కంచెమీంచి గెంతుతున్నాయి. గెంతుతుంటే నా లెక్క.

పక్కింటి ‘‘బుగత’’ కిష్టయ్య కూతురొచ్చి వీధిలో నిలబడి అరుస్తూంది. తలుపు రెండంగుళాలు తెరిచి ‘‘ఎందుకు?’’ అన్నాను.

‘‘మీ గొర్రెలు మా చేన్లోపడి పెసలన్నీ తినేస్తున్నాయి.’’

ఎడ్మినిస్ట్రేటివ్‌ ప్రాబ్లమ్‌. డెసిషన్‌ తీసుకోవాలి చప్పున. సోమన్నని పిలిచి ‘‘చూడు. ఏదో చెయ్యి’’ అన్నాను. సోమన్న ఒక కర్ర– లావుగా, గుణుపులతో?– పట్టుకుని పంచ పైకెగ్గట్టి దూకేడు కిష్టయ్య చేన్లోకి. కర్రతో సాము చెయ్యడం మొదలు పెట్టేడు. గొర్రెలు రూట్‌ మార్చి వెనక్కితిరిగి గెంతుతున్నాయి.

... తొంభయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పయి అయిదు... తొంభయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పయి ఆరు... తొంభయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పయి ఏడు...

గొర్రెల కాళ్లు విరుగుతున్నాయి. పుర్రెలెగుర్తున్నాయి. చెవులు, గొర్రెకి చెవులుంటాయా?– చెవులు తెగుతున్నాయి. నిండుగా, అన్ని అవయవాల్తోనూ లేవు గొర్రెలు.

... ఎన్నో వేల ఎన్నో వందల ముప్పయి ఆరూ డెసిమల్‌ రెండూ... డెసిమల్‌ మూడూ... పాయింట్‌ నాలుగూ... డెసిమల్‌ అయిదూ... ఎన్నో వేల ఎన్నో వందల ముప్పయి ఒకటీ పాయింట్‌ ఆరూ...

సోమన్నేడీ? గెంతే గొర్రెనొక(డి)ని? నొక(ర్తి)ని? పట్టుకుని, విప్పిచూస్తే పళ్లు రక్తమయం. సోమన్నేడీ? చేనంతా వెతికితే ఓ మూలన సోమన్న– ఉత్త ఎముకలతో సోమన్న– గొర్రెలు తినేశాయి సోమన్నని.

ఇంకో ప్రాబ్లమ్‌. ఊరి చివర పోలీస్‌ ఠాణా. కేసులు ఏమీ లేక, ఏమీ తోచక, ఠాణా కాంపౌండ్‌లో బంతి మొక్కలు పెంచుతున్న రేలంగి లాంటి కాన్‌స్టబుల్‌తో ‘‘సోమన్నని గొర్రెలు తినేశాయి. రాసుకోండి’’ అని చెప్పి, వెనక్కి తిరిగి రాబోతూంటే, చెయ్యి పట్టుకులాగి, బఱ బఱ వీధిలోకి లాక్కొచ్చి, టౌనుకు పోయే ఒక లారీ ఎక్కించి, నాతోనూ తనూ వచ్చి, భుజంగం ఇంటికి తీసుకు వచ్చి తలుపు తట్టేడు రేలంగి.

భుజంగం తలుపు తీస్తుంటే పై నుంచి, అంటే తలుపు మీదనే పెట్టివుంచిన ఒక బకెట్‌ నీళ్లు పడ్డాయి ముగ్గురి మీదా.

‘‘బకెట్‌ కాంప్లెక్స్‌. ఓల్డ్‌ జోక్‌. లారెల్‌ అండ్‌ హార్డీ. జడవకండి. తడిపినా వణక్కండి. బెదరక లోనికి రండి’’ అన్నాడు. లోపలికి తీసుకు వెళ్లేడు.

‘‘ఎన్ని?’’ అన్నాడు.

‘‘ఎన్నో వేల ఎన్నో వందల ముప్పయి మూడూ’’ అన్నాను తడుముకోకుండా.

నోట్‌ చేసుకున్నాడు నల్లటి డైరీలో.

రేలంగి అడిగేడు. ‘‘నన్ను కూడా నోట్‌ చేసుకోమంటారా?’’

‘వీడెవ’’డన్నాడు భుజంగం.

‘‘వీడో బంతి మొక్క. వీడి కడ నిలచి, చివాలున వంచి...’’

‘‘బంతి మొక్కయితే వెళ్లి బంతి పువ్వులు పూయమను. ఎర్రటోపీ పూస్తాడెందుకూ?’’

‘‘అదొక ఎబరేషన్‌’’ అన్నాను సంజాయిషీగా.

రేలంగి ఒక విలన్‌ నవ్వు నవ్వి, ‘‘నాకన్నీ తెలుసు. ఫ్రాయిడ్, యుంగ్,..., ఆల్బర్ట్‌ కామూ నేను చదవలేదనుకున్నారా. అదంతా మా ట్రెయినింగ్‌లో వుంది. అంతా కొట్టిన పిండే మాకు. అయినా, అంతగా మీరు యిదవుతుంటే...’’ అంటూ బంతిమొక్కగా మెల్లగా మారుకుంటూ అలాగే నడుస్తూ పైకి వెళ్లిపోయాడు.

భుజంగం చెక్కిన పెన్సిల్‌ ముల్లుని కసిగా నోట్లో పెట్టుకుని నములుతూ ‘‘ఇదిగో. నేనొక టెస్ట్‌ చేస్తాను’’ అని టేబుల్‌ కింద దూరి, ఏదో తీసి, పైకి లేచి చేత్తో ఒక చాకు చూపించి,

‘‘దీన్ని చూస్తే నీకు తట్టే మాటేమిటి??’’ అని అడిగేడు.

‘‘మళ్లీ’’ అన్నాను.

బోధపడలేదు భుజంగానికి. ‘‘ఏమిటి?’’ అన్నాడు.

‘‘మళ్లీ టేబుల్‌ కింద దూరి అది తియ్యి’’ అన్నాను. ‘‘అప్పుడేదో మాట తట్టుతుంది.’’

పేరు భుజంగం అయినా మనిషి భల్లూకం. మళ్లీ కింద దూరి వగరుస్తూ పైకి లేచి ‘‘ఇప్పుడూ?’’ అన్నాడు ఆయాసపడుతూ.

‘‘యథార్థం.’’

‘‘మరీ ఆబ్వియస్‌. ఇంకో టెస్ట్‌.’’ టేబుల్‌ డ్రాయర్‌ లోంచి ఏదో తీసి చూపించకుండా, ‘‘ఇదేమిటో చెప్పు’’ అన్నాడు.

‘‘ఖడ్గమృగం తోలుతో తయారుచేసిన ఏష్‌ ట్రే. దీనిని పలువిధముల ఉపయోగించవచ్చు. ఒకటి...’’

‘‘నక్కలాంటి వాడివి. జిత్తులమారి. కలా లేదూ, పాడూ లేదూ, కాంప్లెక్సూ లేదూ. పో’’ అని లోపలికి పాములాగ జరజర పాకిపోయాడు.

తిరిగి వస్తుంటే సోమన్న ఎదురుపడ్డాడు. ‘‘బెంబేలు పడకండి. నేను సోమన్ననే. గొర్రెలు తినేసింది కిష్టయ్యని’’ అన్నాడు.

‘‘అయితే, కోర్టులో ఎలా’’ అన్నాను వర్రీడ్‌గా.

... ‘‘సోమన్నని గొర్రెలు తినేశాయా? గొర్రెల్ని సోమన్న తినేశాడా? సదరు సోమన్న బతికే ఉన్నాడా? సదరు గొర్రెలు, సదరు కిష్టయ్య... యివన్నీ చాలా భారీ విషయాలు. జ్యూరీ వారు సావకాశంగా ఆలోచించి నిర్ణయానికి రండి’’ అన్నారు జడ్జ్‌.

‘‘నాట్‌ గిల్టీ’’ అన్నారు జ్యూరీ ఒక్క గొంతుకతో, ఆ క్షణంలోనే.

‘‘ఎవరు నాట్‌ గిల్టీ? ఏమిటి మీ వాగుడు’’ కోపంగా జడ్జ్‌.

‘‘మాకేం పని లేదా? మీ ప్రశ్నలకి జవాబులివ్వడానికి. పొలాలు దున్నుకోవాలి. నార్లు పాతాలి. ఏతాం కిర్రు. జనప... కలప... అంటుమామిడి గెలలు... గెత్తాం... కవులుకి...’’ అంటూ జ్యూరీ కండువాలు దులుపుకుంటూ పైకి గొర్రెల మందలాగ వెళ్లిపోతూ వుంటే...

ఎన్నో లక్షల, యిన్ని వేల, అన్ని వందల నలభయి ఆరో గొర్రె కిష్టయ్య చేన్లోంచి పక్కనున్న మిషనరీ కాంపౌండ్‌ గోడ మీంచి గెంతుతూంది. గోడ గడియారం ఐదు కొట్టింది. ఐదు కొట్టిందా? ఒంటిగంట ఐదుసార్లు కొట్టిందా?



త్రిపుర 
(అరుదైన కథకుడు త్రిపుర ‘నిద్ర రావడం లేదు’ పూర్తిపాఠం ఇది. ఆయన కథల సంపుటిలో లేని ఈ కథ రచనాకాలం 1988.)

మరిన్ని వార్తలు