టెక్నో ఇండియా

15 Aug, 2017 00:01 IST|Sakshi
టెక్నో ఇండియా

సాంకేతిక భారతం

స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం రసం పీల్చేసిన చెరకు గెడ! వనరులన్నింటినీ ఊడ్చేసి పాలకులు బ్రిటన్‌కు తరలిస్తే.. మనకు మిగిలింది దరిద్రం.. ఆకలి! పాలపొడి, గోధుమలు, పోషకాహారం, టీకాలు.. ఇలా అప్పట్లో మనం దిగుమతి చేసుకోని వస్తువు లేదు. మరి ఇప్పుడు.. మన తిండి మనమే పండించుకుంటున్నాం. పాల ఉత్పత్తిలో ఒకటవ స్థానానికి ఎదిగాం. హాలీవుడ్‌ సినిమా బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతో కోటానుకోట్ల మైళ్ల దూరంలో ఉన్న అరుణ గ్రహాన్ని అందుకోగలిగాం!  శాస్త్ర, పరిశోధన రంగాలపై నాటి పాలకులు దూరదృష్టితో పెట్టిన నమ్మకమిప్పుడు ఫలితాలిస్తోంది. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల జాబితాలో భారతీయ సంస్థలకు స్థానం లేకపోవచ్చునేమోగానీ... టాప్‌ –5 టెక్‌ కంపెనీలను నడుపుతున్నది మాత్రం మనవాళ్లే!

అణు విద్యుత్తు...
దేశ విద్యుదుత్పత్తిలో అణుశక్తి వాడకం నాలుగైదు శాతానికి మించకపోవచ్చుగానీ.. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా చూస్తే ఈ రంగంలో మన సాధన ఆషామాషీ ఏం కాదు. శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అణుశక్తిని వాడతామని అంతర్జాతీయ వేదికలపై ఎన్ని వాగ్దానాలు చేసినా పాశ్చాత్య దేశాలు మనల్ని నమ్మకపోవడమే కాదు.. వీళ్ల చేతిలో అణుశక్తి పిచ్చోడి చేతిలో రాయి చందమన్న తీరులో హేళన చేసిన సందర్భాలూ అనేకం. ఈ నేపథ్యంలోనే హోమీ జహంగీర్‌ బాబా వంటి దార్శనికుల కృషి ఫలితంగా భారత అణుశక్తి కార్యక్రమం మొదలైంది. దేశంలో విస్తృతంగా అందుబాటులో ఉన్న థోరియం నిల్వలను సమర్థంగా వాడుకోవడం లక్ష్యంగా ఈ మూడంచెల కార్యక్రమం మొదలైంది.

పరిమితస్థాయిలో ఉన్న సహజ యురేనియం నిల్వలతో ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లను అభివృద్ధి చేసి విద్యుత్తు అవసరాలు తీర్చుకోవడం మొదటి దశ కాగా.. ఈ దశలో వ్యర్థంగా మిగిలిపోయే ప్లుటోనియంను మెటల్‌ ఆౖక్సైడ్‌ల రూపంలో ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్ల ద్వారా విద్యుదుత్పత్తికి వాడుకోవడం రెండో దశ. ప్రపంచ నిల్వలో నాలుగోవంతు ఉన్న థోరియం ఇంధనంగా పనిచేసే అడ్వాన్స్‌డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లను అందుబాటులోకి తేవడం మూడోదశ. అణు ఒప్పందంతో ప్రస్తుతం మనకు ఇతరదేశాల నుంచి యురేనియం చౌకగా అందుతున్న నేపథ్యంలో మూడోదశ అణు కార్యక్రమం అమలయ్యేందుకు ఇంకో 15 ఏళ్లు పట్టవచ్చు.

సమాచార రహదారిపై రయ్యి మంటూ..
‘‘అరువు తెచ్చుకున్న టెక్నాలజీల ఆధారంగా గొప్ప దేశాలను తయారు చేయలేము’’ ఈ మాటన్న శాస్త్రవేత్త పేరు విజయ్‌ పురంధర భట్కర్‌! ఈయన ఎవరో మనలో చాలామందికి తెలియకపోవచ్చుగానీ.. ‘పరమ్‌ 8000’ పేరుతో దేశంలోనే మొట్టమొదటి సూపర్‌కంప్యూటర్‌ను తయారు చేసి ఒకరకంగా ఐటీ రంగానికి బాటలు వేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. 1960లలోనే పాశ్చాత్యదేశాల్లో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేశాయి.. మనకు మాత్రం 80లలోగానీ తెలియలేదు. అయితే ఆ తరువాతి కాలంలో మాత్రం ఈ రంగంలో మనం అపారమైన ప్రగతినే సాధించాం. 1967లో టాటా సంస్థ తొలి  సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల కంపెనీని మొదలుపెట్టినా.. 1991లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వర్‌ టెక్నాలజీ పార్కుల ఏర్పాటుతో ఐటీ ప్రస్థానం వేగమందుకుంది.  1998 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో ఐటీ వాటా కేవలం 1.2 శాతం మాత్రమే ఉండగా.. 2015 నాటికి ఇది 9.5 శాతానికి పెరిగిపోయిందంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని యువతకు ఈ రంగం సృష్టించిన ఉపాధి అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.

అరచేతిలో ప్రపంచం.. సెల్‌ఫోన్‌!
ఇంటికి టెలిఫోన్‌ కావాలంటే.. నెలల తరబడి వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండాల్సిన కాలం నుంచి అనుకున్నదే తడవు ప్రపంచాన్ని మన ముందు తెచ్చే సెల్‌ఫోన్ల వరకూ టెలికమ్యూనికేషన్ల రంగంలో దేశం సాధించిన ప్రగతి అనితర సాధ్యమంటే అతిశయోక్తి కాదు. దేశ జనాభా 130 కోట్ల వరకూ ఉంటే.. మొబైల్‌ఫోన్‌ కనెక్షన్లు 118 కోట్ల వరకూ ఉండటం గుర్తించాల్సిన విషయం. కేవలం సమాచార సాధనంగా మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచుకునేందుకు తద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించేందుకు అవకాశం కల్పించిన సాధనంగా మొబైల్‌ఫోన్‌ను సామాన్యుడు సైతం గుర్తిస్తున్నాడు. ఆర్థిక సరళీకరణల వరకూ ప్రభుత్వం అధిపత్యంలోనే నడిచిన టెలికమ్యూనికేషన్ల శాఖ.. ఆ తరువాత కార్పొరేటీకరణకు గురికావడం.. ప్రైవేట్‌ సంస్థలు రంగంలోకి దిగడంతో వినియోగదారులకు మేలు జరిగింది.

అంతరిక్షాన్ని జయించాం...
1963 నవంబరు 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. తిరువనంతపురం సమీపంలోని తుంబా ప్రాంతంలోని ఒక చర్చి కార్యశాలగా... ఆ పక్కనే ఉన్న బిషప్‌ రెవరెండ్‌ పీటర్‌ బెర్నర్డ్‌ పెరీరియా ఇల్లే ఆఫీసుగా.. సైకిళ్లు, ఎద్దుల బండ్లే రవాణా వ్యవస్థలుగా  భారత అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం పడింది ఈ రోజునే. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో విదేశీ సాయం ఏమాత్రం లేకుండా... విక్రం సారాభాయ్, ఏపీజే అబ్దుల్‌ కలాం వంటి దిగ్గజాలు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నేడు ఎంత బహుముఖంగా విస్తరించిందో.. విస్తరిస్తూ ఉందో మన కళ్లముందు కనిపిస్తూనే ఉంది. అంతరిక్ష ప్రయోగాలను ఆధిపత్య పోరు కోసం కాకుండా జన సామాన్యుడి అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఉపయోగిస్తామన్న గట్టి వాగ్దానంతో మొదలైన ఇస్రో దశలవారీగా ఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ రాకెట్ల దశకు చేరుకుంది.

టెలిఫోన్లు, టీవీ కార్యక్రమాలు, ప్రకృతి వనరుల నిర్వహణ, విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ఇలా.. అనేక రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలు మనకు అక్కరకొస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చంద్రయాన్‌ –1, మంగళ్‌యాన్‌ ప్రయోగాలు మరో ఎత్తు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మనం ఎవరికీ తీసిపోమని ప్రపంచానికి చాటి చెప్పినవి ఇవే. పోఖ్రాన్‌ అణు పరీక్షలను నిరసిస్తూ అమెరికా క్రయోజెనిక్‌ ఇంజిన్ల టెక్నాలజీ మనకు దక్కకుండా రష్యాను నిలువరించినా.. కొంచెం ఆలస్యంగానైనా అదే ఇంజిన్‌ను మనం సొంతంగా అభివృద్ధి చేసుకోవడం భారతీయులుగా గర్వించదగ్గ విషయమే.

హేతువుకు చోటు కావాలి!
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతి మనందరికీ గర్వకారణమే. అందులో సందేహమేమీ లేదు. అయితే అదే సమయంలో మన రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాల్లో ఒకటైన శాస్త్రీయ దక్పథం లేమి పౌరులుగా మనకు అంత శోభనిచ్చేది మాత్రం కానేకాదు. భారతీయ శాస్త్రవేత్తలకు గత 85 ఏళ్లలో నోబెల్‌ బహుమతి రాకపోయేందుకు ఇదే ప్రధాన కారణమని పద్మభూషణ్‌.. దివంగత పుష్ప మిత్ర భార్గవ వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. మనిషి తయారు చేసే కంప్యూటర్‌ను తొలిసారి ఆన్‌ చేస్తూ కొబ్బరికాయలు కొట్టడం.. రాకెట్‌ ప్రయోగాలకు ముందు దేవాలయాల్లో పూజలు ఈ శాస్త్రీయ దృక్పథ లేమికి అద్దం పట్టేవి. మతం ఒక విశ్వాసం.

దానికి శాస్త్రాన్ని జోడించడం అంత సరికాదన్నది కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయమైతే.. మత విశ్వాసం తమకు సానుకూల దక్పథాన్ని అలవరచి.. చేసే పని విజయవంతమయ్యేందుకు దోహదపడితే ఎలా తప్పు పడతారని ఇంకొందరు అంటూ ఉంటారు. అవయవ మార్పిడి పురాణాల్లోనే ఉందని.. కౌరవులు కుండల్లో పుట్టారు కాబట్టి.. అప్పటికే టెస్ట్‌ట్యూబ్‌ బేబీల టెక్నాలజీ ఉందని వాదించడం శాస్త్రీయ దృక్పథం ఎంతమాత్రం అనిపించుకోదు. పురాణ కాలంలోనే విమాన నిర్మాణ శాస్త్రం ఉందని 102వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో ఒక పరిశోధన వ్యాసం ప్రచురితమవడం ఎంత దుమారానికి దారితీసిందో తెలియంది కాదు. ఒకవేళ ఇవన్నీ నిజంగానే ఉన్నాయని కొందరు నమ్మితే.. వాటిని ఈ కాలపు ప్రమాణాలతో రుజువు చేయాల్సిన బాధ్యతా వారిపైనే ఉంటుంది. అలా కాకుండా కేవలం ప్రకటనలకు పరిమితమవడం.. తర్కబద్ధమైన విశ్లేషణకు తావివ్వకపోవడం సరికాదు.
– ప్రణవ మహతి

మరిన్ని వార్తలు