The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!

22 Oct, 2023 05:33 IST|Sakshi

ఆ చీటీలో ఏముందంటే..

అశోక్‌ టాండన్‌ పుస్తకంలో పలు అంశాలు వెల్లడి

న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్‌ టాండన్‌ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన రాసిన ‘ది రివర్స్‌ స్వింగ్‌: కలోనియలిజం టు కోఆపరేషన్‌’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్‌ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట.

1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్‌ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్‌లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే.  

రాష్ట్రపతి పదవి తిరస్కరణ!
2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట.  

1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట
పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు