నవ చైతన్యానికి నాంది

27 Mar, 2014 22:50 IST|Sakshi
నవ చైతన్యానికి నాంది

తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ప్రభవనామ సంవత్సరం మొదలు అక్షయ నామ సంవత్సరం వరకు ఉన్న తెలుగు వసంతాల పేర్లతో ఒక్కో ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తూ... ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాదిగా జరుపుకుంటారు. యుగాల ప్రారంభానికి ఆది అయిన రోజు కనుక యుగాదిగా పిలిచేవారు. ఇదే కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఈ ఏడాది ఉగాది పేరు శ్రీజయ. మార్చి 31న శ్రీజయ నామ సంవత్సరం ప్రారంభం అవుతోంది.
 
 చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని
 శుక్లపక్షే సమగ్రస్తు తథా సూర్యోదయే సతి॥

 
చైత్రమాసపు శుక్లపక్షంలోని మొదటి సూర్యోదయ కాలంలో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని పై శ్లోకానికి అర్థం. ఏ పూర్ణిమ అయితే చిత్తా నక్షత్రంతో కూడి ఉంటుందో అదే చైత్రమాసం. ఈ చైత్రమాసం మొదటి రోజే ఉగాది. యుగారంభంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై పవళించినట్లు మనకు పురాణాలు విశదపరుస్తున్నాయి.
 
నవ చైతన్యానికి, నవ్య శోభకు, విశ్వ సౌందర్యానికీ ఉజ్వల ప్రతీకగా ‘ఉగాది’ని అభివర్ణించారు పెద్దలు. ప్రకృతిని ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీకగా చూపి... మానవునిలోని నిరాశా నిస్పృహలను పోగొట్టి నవ చైతన్యాన్ని కలిగించి, కొత్త కలలకు మొగ్గలు తొడిగించి శోభింపజేసేదే ఉగాది. మోడువారి నిశ్చేతనంగా ఉన్న శిశిరంలోంచి వినూత్న శోభను చిగురింపజేసి దివ్యానుభూతులకు పలికే నాందీ వాచకమే ఉగాది.
 
ఆదిలో ఈ ఉగాది పర్వదినం రోజునే చతుర్ముఖ బ్రహ్మ ఈ చరాచర సృష్టిని ఆరంభించినట్లు ‘బ్రహ్మాండ పురాణం’ తెలియజేస్తోంది. వసుచక్రవర్తి ఘోరాతిఘోరమైన తపమొనరించి రాజ్యాధికారం పొందినప్పుడు దేవేంద్రుడే స్వయంగా ఆయనకు ఉగాది రోజున నూతన దివ్య వస్త్రాలను బహూకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా శ్రీరామ చంద్రుడు రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యా నగరానికి ఈ ఉగాది పర్వదినానే వచ్చినట్లు రామాయణ కావ్యంలో ఉంది. సరిగ్గా ఆ ఉగాది నాడు శ్రీరాముని పట్టాభిషేకం కూడా జరిగింది. యుగాలు మార్పు చెందినప్పుడల్లా సృష్టిలో, సకల చరాచర ప్రకృతిలో విశిష్టమైన మార్పులు చోటు చేసుకున్నట్లు ప్రాచీన వాఙ్మయంలో సుస్పష్టమైన ఆధారాలున్నాయి. దీని మూలం ‘కాలతంత్రం’ అని భాగవతం చెబుతోంది.
 
పంచభూతాల సంయోగ-వియోగాలకు కాలమే కారణభూతం అవుతోంది. ఒక యుగం మారి మరొక యుగంలో పాదం మోపే సంధి సమయంలో చిత్ర విచిత్రాలైన పెనుమార్పులు సంభవిస్తుంటాయి. ద్వాపర యుగాంతంలో, కలియుగ ఆరంభంలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగింది. ఇందుకు కారణం సప్తరుషులు మఖానక్షత్రంలోనికి ప్రవేశించడమేనని జ్యోతిష శాస్త్రజ్ఞుల నమ్మకం. సృష్టిలోని సమస్త పశువులు, పక్షులు, మానవులు, అచరములైన పర్వతాలు, వృక్షాలు, సముద్రాలు అన్నిటిపై కాలం తన ప్రభావం చూపిస్తూనే ఉంది.
 
‘కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః అని శ్రీకృష్ణ పరమాత్మ తన గీతా సందేశంలో సర్వమానవాళికి తెలియపరిచాడు. ఈ కాల గమనాన్ని స్తంభీభూతం చేయాలంటే మనం సెకనుకు 1,80,000 మైళ్ల కాంతి వేగంతో ప్రయాణించాలి. ఇది మానవ మాత్రులకు సాధ్యం కాదు కనుక కాలంతో పాటు ప్రయాణించాలి. ఈ ‘శ్రీజయ’ ఉగాది అందరిలోనూ నవనవోత్సాహాన్ని రేకెత్తించి ప్రగతి పథంలో ముందుకు సాగేలా చేస్తుందని ఆశిద్దాం!

 - గత్తం వేంకటేశ్వరరావు, సంస్కృత పండితులు
 
 వసంత వైభవం
 
వసంతకాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. మల్లెల సుగంధం ప్రతి మనసునీ మత్తెక్కిస్తుంది. కోకిల పాటలు అలౌకిక ఆనందాన్నిస్తాయి. వసంతకాలంలో పుష్పాలలో ‘మధువు’ (తేనె) ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాసాన్ని మధుమాసం అంటారు. కాళిదాసు రచించిన రుతుసంహార కావ్యంలో మధుమాస శోభ అనంతంగా కనిపిస్తుంది. వసంత మాసానికి సురభి అనే పేరు ఉందని అమరకోశం చెబుతోంది. సురభి అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం.

అంటే.. వసంతమాసం ప్రజలు కోరుకున్న కోరికలను సిద్ధింపజేస్తుందని అన్వయించుకోవచ్చు. ‘రుతూనాం ముఖో వసంతః’ అని తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంది. రుతువులన్నింటిలోనూ వసంతరుతువుదే అగ్రస్థానం అని దీని భావం. ‘వసతి కామోస్మిన్నితి’ - అంటే వసంత రుతువులో కామప్రకోపం ఎక్కువగా ఉంటుందని అర్థం. దాంపత్య సౌఖ్యానికి ఈ రుతువు అనుకూలం. ఇలా మానవగమనంలోని ప్రతి అడుగుకీ ‘వసంతం’ ఒక ప్రాతిపదిక కల్పిస్తుంది. మానవ జీవన వికాసానికి పునాదిగా నిలుస్తుంది.
 
వసంత నవరాత్రులు
 
హైందవ ఆధ్యాత్మిక వ్యవస్థలో నవరాత్రులకు విశేషమైన స్థానం ఉంది. ఇందులో గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు బాగా ప్రసిద్ధి పొందాయి. కానీ, వీటికన్నా ముందుగా ఉగాది ప్రారంభం నుంచి వసంత నవరాత్రులు జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. చైత్రశుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచి చైత్ర శుద్ధ నవమి (శ్రీరామనవమి) వరకు తొమ్మిది రోజుల కాలాన్ని వసంత నవరాత్రులుగా వ్యవహరిస్తారు. దేవీభాగవతం, ధర్మసింధువు తదితర గ్రంథాల్లో వీటి ప్రాశస్త్యాన్ని ఎంతగానో వివరించారు.

చైత్ర మాసం సంధికాలం. శీతలం నుంచి ఉష్ణానికి వాతావరణం మారుతుంది. ఈ మార్పులవల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను రక్షించడానికి వసంత నవరాత్రులనే పేరుతో పూర్వీకులు కొన్ని నియమాలను విధించారు. ఉగాది రోజున కలశస్థాపన చేసి, విధివిధానంగా అర్చన, మంటపారాధన చేయాలి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను, శ్రీరామచంద్రమూర్తిని అర్చించాలి.

ఈ పద్ధతులన్నింటిలో అంతర్లీనంగా ఆరోగ్యసంరక్షణ దాగి ఉంది. భగవతత్త్వానికి ‘పర’, ‘అపర’ అనే రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అచేతనం కాగా మరొకటి చేతనం. బాహ్యంగా కనిపించే పంచభూతాలు; అహంకారం, బుద్ధి, వ్యక్తం అనే ఎనిమిదికి (అపరా ప్రకృతి) పరాప్రకృతి కలిపితే మొత్తం తొమ్మిది అంశాలు అవుతాయి. ఈ తొమ్మిది అంశీభూతాలను తొమ్మిది రోజులపాటు ‘వసంత నవరాత్రులు’గా అర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఆధ్యాత్మిక రహస్యం.

 - కప్పగంతు జానకీరామశర్మ
 

మరిన్ని వార్తలు