ఆ పీడితుడు... ఇప్పుడు... దైవారాధకుడు

5 Nov, 2016 23:27 IST|Sakshi
ఆ పీడితుడు... ఇప్పుడు... దైవారాధకుడు

 సువార్త

గలిలయ సముద్రానికి అవతల ఉన్న గెరాసేనుల దేశానికి యేసుక్రీస్తు ఒకసారి వెళ్లాడు. అత్యంత హేయమైన పూజా విధానాలు, ఆచారాలున్న ఆ ప్రదేశానికి యూదులు వెళ్లడం నిషిద్ధం. కానీ అక్కడున్న ఒక దురాత్మల పీడితుణ్ణి బాగు చేయడానికి ప్రభువు వెళ్లాడు. అతడక్కడ అందరిపై దాడి చేస్తూ, గాయపరుస్తూ, అరుపులు కేకలతో హడలెత్తిస్తూ, నగ్నంగా తిరుగాడుతూ, సమాధుల్లో నివాసం చేస్తూ, అందరికీ బెడదగా మారాడు. యేసు అతణ్ణి కలుసుకోగానే స్వస్థపరచాడు. అంతే... అతను ఒక్కసారిగా సాధువైపోయి ఆయన పాదాల వద్ద కూర్చుండిపోయాడు. యేసు ఆజ్ఞతో అతణ్ణి వదిలిన ఎన్నో దుర్మాత్మలు అక్కడున్న రెండు వేలకు పైగా పందుల్లో దూరాయి. అవి తాళలేక పర్వతం పై నుండి సముద్రంలోకి దూకి చనిపోయాయి.
 

కానీ అంతకాలం అన్ని దురాత్మల విధ్వంసక శక్తికి నిలయంగా ఉన్న ఆ వ్యక్తి మాత్రం స్వస్థచిత్తుడయ్యాడు. ఆ ప్రాంతవాసులంతా అది చూసి నివ్వెరపోయారు. యేసుక్రీస్తు కోరి మరీ నిషిద్ధ ప్రాంతానికి సైతం వెళ్లి అంతా ఈసడించుకున్న అతణ్ణి బాగుపరిచి నూతన జీవితాన్నివ్వడం దేవుని అసమాన ప్రేమకు అద్భుతమైన నిదర్శనం!
 

మనం దేవుణ్ణి చూడకున్నా ఆయన మనల్ని చూస్తున్నా డనీ, చాలా ఈవులు (వరాలు) ఆయన మనం అడక్కుండానే మనకు అనుగ్రహిస్తున్నాడనీ అనడానికి అది ఒక ఉదాహరణ. దేవుని ప్రేమ తాకిడితో అతను సమాధులు వదిలి, దేవుని పాదాల వద్దే నివసిస్తున్నాడు. అరుపులు, కేకలు మాత్రమే ఎరిగిన వ్యక్తి ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. నగ్నంగా పరుగులు తీసినవాడు ఇప్పుడు నవీన వ్యక్తిగా మారి నిశ్చలంగా, నిర్మలంగా దేవుని వద్ద కూర్చున్నాడు (మార్కు 5:1-20).
 

లోకం వెలివేసిన వారినీ, పాపులనూ దేవుడు దగ్గరికి తీసి వారికి నూతన జీవితాన్నీ, నిత్యత్వాన్నీ ప్రసాదిస్తాడు. వారితోనే చరిత్రను తిరగరాయించి, లోకానికి వారిని ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే దేవుని అద్భుతమైన ప్రేమ. అలాంటి యేసుక్రీస్తును ఆ వ్యక్తి స్వీకరించాడు కానీ, అక్కడి ప్రజలు తృణీకరించారు. తమ దేశాన్ని వదిలి వెళ్లమని అక్కడి ప్రజలు యేసును వేడుకోవడం ఆశ్చర్యం. ఎందుకంటే ఇస్రాయేలులోని యూదులకి పంది మాంసం నిషిద్ధం. కానీ అక్కడ రోమా అధికారులకీ, రోమా సైనికులకేమో అది అత్యంత ప్రీతిపాత్రం. అందువల్ల గెరాసేను ప్రజలు పందుల్ని పెంచి, మాంసాన్ని రోమీయులకు విక్రయించే లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఆ కారణం వల్ల దురాత్మల పీడితుడు బాగయ్యాడని ఆనందించే బదులు, రెండు వేల పందులు చనిపోయాయని బాధపడ్డారు. యేసు అక్కడే ఉంటే మరిన్ని పందులు చనిపోతాయని భయపడ్డారు.
 

దేవుడు అష్టకష్టాల కోర్చి, అన్నీ నష్టపోయి, పరలోకాన్ని కూడా వదిలేసి వచ్చి, పాపుల్ని రక్షించడానికి పూనుకుంటే - యేసు రాక వల్ల తాను ఎంత నష్టపోయానో లెక్కలేసుకుంటోంది ఈ లోకం. లోకపు లాభనష్టాల భాషకు దేవుని సర్వోన్నతమైన, అమూల్యమైన ప్రేమ విలువ అర్థమవుతుందా? దేవుని కన్నా మనుషుల కన్నా పందులనే ప్రేమించి వాటికే విలువనిచ్చే అక్కడి ప్రజల మధ్య తానుండలేనని గ్రహించిన ఆ వ్యక్తి తాను వెంట వస్తానని యేసును బతిమాలాడు. కానీ అక్కడే ఉండి పరిచర్య చేయమన్నాడు ప్రభువు. అతడా ప్రాంతంలో దివ్యమైన పరిచర్య చేసి ఎంతోమందిని ప్రభువు మార్గంలోకి నడిపించాడని చరిత్ర చెబుతోంది.


 - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్

మరిన్ని వార్తలు