కుల నిర్మూలన ఇలాగేనా?

1 Nov, 2023 04:14 IST|Sakshi

విశ్లేషణ

ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను కూడా వారు వివరించాలి. ప్రస్తుత మాంసాహారం వర్సెస్‌ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వ విద్యాలయాల్లో కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే తాము హిందువులని ఆర్‌ఎస్‌ఎస్‌ భావించే అన్ని కులాలకూ దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 

జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్‌ చేస్తూ, ద్విజ ఆధిపత్యం కలిగిన సమాజంలో తమ చారిత్రక స్థానం పట్ల స్పృహను ప్రదర్శిస్తూ, తమ సంఖ్య గురించి శూద్ర/ఓబీసీలు చైతన్యాన్ని చూపుతున్న నేపథ్యంలో– ఎట్టకేలకు, ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగ వేదికలపై కుల నిర్మూలన గురించి మాట్లాడుతోంది. కుల నిర్మూలన కోసం దత్తాత్రేయ çహొసబలే, ఇతర నాయకులు దళితులు, శూద్రులకు ఆలయ ప్రవేశాన్ని, నీటి హక్కు లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కాలం చెల్లినవి మాత్రమే కాదు, ఇవి సామాజిక వివక్షను తొలగించే అవకాశం లేదు.

రెండు సామాజిక వ్యవస్థల శక్తి
మాంసాహారం వర్సెస్‌ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలలో కుల తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార సాంస్కృతిక ఘర్షణలకు దారి తీస్తుంది. కులాల మధ్య విభజితమైన ఆహార సంస్కృతి కూడా కులాంతర వివాహాలకు అడ్డుగోడగా నిలుస్తో్తంది.

వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. వివాహం, ఆహార సాంస్కృతిక కండిషనింగ్‌ అనేవి, సామాజిక బృందాలను ఏకం చేయగలవు లేదా విభజించగలవు కాబట్టి వాటిని నేను ఉద్దేశపూర్వకంగానే శక్తి అని పిలుస్తాను. కుల వివాహ వ్యవస్థ, సామా జికంగా వేర్పాటుతో కూడిన ఆహార సాంస్కృతిక పరంపర అనేవి వేయి సంవత్సరాలుగా దేశంలో కుల అంతరాలను కొనసాగించాయి. కుల కేంద్రకమైన వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల డీఎన్‌ఏను కుల ప్రాతిపదికన విభజించడానికి ఉద్దేశించబడింది.

గత వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికిని చూసినట్లయితే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను అది ప్రోత్సహిస్తుందనడానికి వారి రచనల్లో గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ ఎలాంటి ఆధారాలు లేవు. కులాంతర వివాహం వివిధ వృత్తులు కలిగిన రెండు వేరు వేరు వర్గాల మధ్య రక్త సంబంధాలను మార్పిడి చేస్తుందని డా. బి.ఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు. ఇది ఇద్దరు భాగస్వాముల కులాన్ని బలహీనపరచడమే కాకుండా, వారి సంతానపు మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది.

బహుశా అలాంటి కులాంతర వివాహాన్ని రుజువు చేయడానికి ఆయన సవితా అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. సాధారణంగా పాశ్చాత్య సంస్కృతితో మాంసాహారం తినే దళితుడు, భారతీయ వాతావరణంలో మాత్రమే పెరిగిన బ్రాహ్మణ స్త్రీ తమ వైవాహిక జీవి తంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు అనే సమాచారం మన వద్ద లేదు. అంబేడ్కర్, సవిత తమ ఆహారాన్ని పూర్తి శాకాహారంగా గానీ, మిశ్రమ ఆహారంగా గానీ మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎదుటివారి ఆహార ఎంపికను మరొకరు గౌరవించి ఉండొచ్చు.

ప్రస్తుత వ్యవస్థలో కులాంతర వివాహం
అన్ని కులాలకు చెందిన భారతీయ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున కులాంతర వివాహాల పరిధి పెరుగుతోంది. అవి జరుగుతున్నాయి కూడా. కానీ కులాంతర వివాహాలను సాధారణంగా తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకంటే ఇది సామాజిక కళంకాన్ని తీసుకొస్తుంది. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఒక భాగస్వామి దళి తుడు, మరొకరు దళితేతరులు అయినప్పుడు అలాంటి వివాహితు లను చంపడం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది.

అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శకంగానూ, భారతదేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగానూ ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందో సమాజానికి తెలియదు. ఈ సంస్థ నాయకులు సనా తన ధర్మం లేదా హిందూ సంప్రదాయం గురించి నిరంతరం మాట్లాడుతుంటారు. కులాంతర వివాహాలు సనాతన ధర్మంలో లేక హిందూ సంప్రదాయంలో భాగమేనా అన్నది వాళ్లు స్పష్టం చేయాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కుల నిర్మూలన ఒక క్లిష్టమైన యత్నం. కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను, సాధనాలను వివరించాలి. 

కులాలు, మాంసాహారం, శుద్ధ శాకాహారులు
కుల వ్యవస్థ భారతీయుల మధ్య భోజనాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. శతాబ్దాలుగా దేశంలోని వివిధ కులాల ప్రజలు పక్క పక్కనే కూర్చుని భోంచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్‌ వ్యవస్థలు కుల రహితంగా తినే వీలును కల్పించాయి. కానీ గ్రామాల్లో ఇప్పటికీ ఇది పెద్ద సమస్య. అనేక పాఠశాలల్లో దళితులు వండిన ఆహారాన్ని దళితేతరులు తినడం లేదు. ఈ పరంపరకు వ్యతి రేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు.

శాకాహారం, మాంసాహారం అనే సమస్య ప్రస్తుతం చాలా ఐఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఆర్‌ఎస్‌ఎస్‌ శాకాహార సంస్కృతిలో భాగమయ్యారు. పైగా వారు పూర్తి శాకాహార మెనూని అవలంబించాలని ఆయా సంస్థలను కోరుతున్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో శాకాహారం మాత్రమే అందించాలని ఆదేశాలను పంపిన మొదటి విద్యా మంత్రి స్మృతి ఇరానీ. ముంబై ఐఐటీతో సహా ఇతర ఐఐటీల అధిపతులు శాకాహారం, మాంసాహారం తినేవారికి వేర్వేరు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నింటికీ కారణం సనాతన ధర్మాచరణకు చెందిన శాకాహార భావజాలమే.

ముస్లింలను, క్రైస్తవులను విడిచిపెట్టండి... శూద్రులు, దళితులు, ఆదివాసీలు భారతదేశంలో ప్రధానంగా మాంసాన్ని, లభ్యత ఆధారంగా శాకాహారాన్ని తినడం ద్వారా జీవిస్తున్నారు. కానీ పండుగ సందర్భాలలో వారికి ఇష్టమైనది మాంసాహారమే. ఆహార సాంస్కృతిక పరంపరలో స్పష్టమైన కుల వర్ణ విభజన ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ తన స్వచ్ఛమైన శాకాహార సంస్కృతిని వదులుకుంటుందా? బహిరంగ, వ్యక్తిగత ప్రదేశాలలో ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినడం గురించి ఏ వైఖరిని తీసుకుంటుంది? హిందూ లేదా హిందూత్వ ఆహార సంస్కృతి ఏమిటి? ఇది స్వచ్ఛమైన శాకాహారమా లేదా వ్యక్తిగత ఎంపిక ఆధారంగా మిశ్రమ ఆహారమా?

వ్యక్తిగత ప్రాధాన్యాల ఆధారంగా ఆహార సంస్కృతిని ప్రజా స్వామ్యీకరించడం కుల నిర్మూలన చర్యల్లో ఒకటి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కుటుంబాల ఆహార స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ మాంసాహారాన్ని తింటుంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు కులపరంగా శాకాహారులు. వారి పిల్లలకు అలాగే తినేలా శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతులను ప్రస్తావించకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ కులాన్ని ఎలా నిర్మూలిస్తుంది?

కుల నిర్మూలనకు దశలవారీగా ఉపయోగపడే నాలుగు సామాజిక సాధనాలను నేను గుర్తించాను. వాటి గురించి ఈ సంస్థ మౌనంగా ఉంది. 1)  తాము హిందువులని ఆర్‌ఎస్‌ఎస్‌ భావించే అన్ని కులాలకు దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దళితులు, ఆదివాసీలు, శూద్రులతో సహా అన్ని కులాల కోసం వాటిల్లో ప్రవేశానికి హక్కు కల్పించేలా ధార్మిక పాఠశాలలను, కళాశాలలను తెరవాలి. 2) చర్మశుద్ధి నుండి కుండల తయారీ వరకు అన్ని వృత్తుల గౌరవం పెరిగేలా బోధనా సామగ్రిని రూపొందించాలి. 3) దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 4) మాంసాహారం, శాకాహారంతో సంబంధం లేకుండా ఇతరుల ఆహార ఎంపికను గౌరవిస్తూ కలిసి భోంచేసేలా చూడాలి.

ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుతో సహా, శుద్ధ శాకాహారమే హిందూ లేదా భారతీయ ఆహార సంస్కృతిగా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి. కుల నిర్మూలన గురించి ఆర్‌ఎస్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలి.

కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు