సెల్‌ఫోన్‌ వాడటం సురక్షితమేనా?

1 Mar, 2017 15:20 IST|Sakshi
సెల్‌ఫోన్‌ వాడటం సురక్షితమేనా?

జనరల్‌/న్యూరో కౌన్సెలింగ్‌

మా అబ్బాయి వయసు 27 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌. ఎక్కువగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, బ్రౌజ్‌ చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్‌ నుంచీ ఇలా మాట్లాడే అలవాటు ఉంది. ఇంజనీరింగ్‌ చేసేటప్పుడు పెరిగింది. ఇటీవల బాగా ఎక్కువైంది. సెల్‌ఫోన్‌ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని విన్నాను. మా మనవడి వయసు మూడేళ్లు. వాడు కూడా సెల్‌ఫోన్‌తో ఎక్కువగా ఆడుతున్నాడు. నాకు చాలా భయంగానూ, ఆందోళనగానూ ఉంది. సెల్‌ఫోన్‌తో క్యాన్సర్‌ వచ్చే మాట నిజమేనా?
– నిర్మల, సికింద్రాబాద్‌

సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వచ్చే మాట నిజమే. సెల్‌ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్‌ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్‌ కనెక్ట్‌అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్‌ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్‌ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఏర్పడ్డాయి. అయితే సెల్‌ఫోన్‌ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. ఇంతవరకు జరిగిన అధ్యయనాల్లో ఫోన్లు, సెల్‌ టవర్ల నుంచి రేడియేషన్‌ వెలువడుతుందని గుర్తించినా, అది క్యాన్సర్‌కు దారితీస్తాయని కచ్చితంగా చెప్పడానికి గల ఆధారాలే లేవు. కొన్ని అధ్యయనాలు మొబైల్‌ఫోన్స్‌తో మెదడుకు క్యాన్సర్‌ ప్రమాదం ఉందని చెబితే... మరికొన్ని అలాంటిదేమీ లేదని తేల్చాయి.

అయితే ఈ రెండు రకాల అధ్యయనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చాయి. అయితే ఒక అంశం మాత్రం స్పష్టం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెల్‌ఫోన్స్‌ వెలువరించే రేడియేషన్‌ స్థాయి తగ్గుతూ పోతోంది. పైగా మొబైల్స్‌ వాడకం ఆధునిక జీవితంలో భాగంగా మారింది. క్యాన్సర్‌ ప్రమాదం గురించి అనుమానాలు, భయాలు వ్యాప్తిలో ఉన్నా మొబైల్‌ఫోన్స్‌ను పూర్తిగా విస్మరించడం సాధ్యం కావడం లేదు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తి వాస్తవాలను తేల్చిచెప్పేలోపు మనం కొన్ని మందు జాగ్రత్తలను పాటించాలి.

సెల్‌ఫోన్‌ రేడియేషన్‌కు సంబంధించి సురక్షిత స్థాయి అంటూ స్పెసిఫిక్‌ అబ్జార్ప్‌షన్‌ రేట్‌ (ఎస్‌.ఏ.ఆర్‌.)ను నిర్ణయించారు. ఆ పరిధిలో ఉన్న ఫోన్స్‌ వాడాలి n వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్‌ (లైన్డ్‌ ఫోన్స్‌)లో మాట్లాడాలి n సెల్‌ఫోన్‌ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి n సెల్‌ఫోన్‌ వాడటం తప్పనిసరి అయినప్పుడు హ్యాండ్స్‌ ఫ్రీ అటాచ్మెంట్‌ను ఉపయోగించడం, మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి n    రింగ్‌ చేసిన నెంబరు, కనెక్ట్‌ ఆయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి n    పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్‌ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్‌ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్‌ఎంఎస్, చాటింగ్, యాప్‌ బేస్‌డ్‌ మెసేజింగ్, డేటా సర్చింగ్‌ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి.


ప్రత్యేకించి పిల్లలను సెల్‌ఫోన్‌ వాడకానికి దూరంగా ఉంచాలి. పిల్లల మెదడు లేత కణాలతో కూడి ఉంటుంది. వాటిగుండా రేడియేషన్‌ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అందువల్ల సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన ఐదారేళ్ల నుంచే మరీ ఎక్కువగా పిల్లల చేతుల్లోకి సెల్‌ఫోన్స్‌ చేరుతున్నాయి. మరో పదేళ్లు పోతేగానీ సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ఎటువంటి ప్రభావం చూపిందన్నది కచ్చితంగా తెలిసిరాదు. అంతవరకు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా అవసరం అని మాత్రం చెప్పగలం.

డాక్టర్‌ ఆనంద్‌ బాలసుబ్రమణ్యం,
సీనియర్‌ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు