అవి పర్యావరణహిత పాఠశాలలు

12 Feb, 2018 02:09 IST|Sakshi

ఆ రెండు పాఠశాలల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పీల్చుకోవచ్చు. వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం కనిపిస్తుంది. జలసంరక్షణ ఆనందాన్నిస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ  జరుగుతున్న అవేమీ కార్పొరేట్‌ పాఠశాలలు కావు. అవి  కేంద్రీయ విద్యాలయాలు. కేంద్రీయ విద్యాలయ యాజమాన్యం... వ్యర్థాల నిర్వహణ, వాతావరణం కలుషితం కాకుండా చూడడం, జల సంరక్షణ, తదితర అంశాలపై కొన్ని నిర్దేశాలను తన పరిధిలోని పాఠశాలలకు పంపింది. వాటి ఆచరణలో రెండు పాఠశాలలు 70 శాతం మార్కులతో ముందు నిలిచాయి.

అవి రెండూ కేరళలోని పగోడ్, ఒట్టపాళియం స్కూళ్లు! బడి విడిచిపెట్టే 5 నిముషాలు వ్యర్థాల సేకరణ జరుగుతుంది. దాంతో రోజుకు 10కిలోల గ్యాస్‌ ఉత్పత్తవుతోంది. ఈ గ్యాస్‌తో స్కూలు అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ విద్యుదవసరాలు తీరుతున్నాయి. ఇక వ్యర్థ జలాలను వృథాగా పోనీయకుండా, శుద్ధిచేసి, మరుగుదొడ్లలో, స్కూలును శుభ్రపరచడానికీ వినియోగిస్తున్నారు. మొక్కలకూ ఈ నీరే. విద్యార్థులు స్కూలుకు వచ్చేందుకు పెట్రోలు వాహనాలు కాకుండా సైకిళ్ళను ఉపయోగిస్తున్నారు.

ఈ స్కూళ్లలో ప్లాస్టిక్‌ వినియోగం కనిపించదు. మనసుంటే మార్గముంటుందని నిరూపిస్తున్న ఈ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర పాఠశాలలకు దారి చూపుతున్నాయి. హరితావరణలను ప్రోత్సహించేందుకు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సిఎస్‌ఇ) గ్రీన్‌ స్కూల్స్‌ ప్రోగ్రామ్‌ (జిఎస్‌పి) విధానాన్ని అవలంబిస్తున్న... 54 స్కూళ్లలో కేరళలోని పగోడ్, ఒట్టపాళియం కేంద్రీయ విద్యాలయాలు ప్రథమ స్థానంలో నిలిచాయని సిఎస్‌ఇ డైరెక్టర్‌ జనరల్‌ సునీతా నారాయణ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు