వీళ్ళు నా చాన్స్ లు కొట్టేశారు!

14 Feb, 2015 22:37 IST|Sakshi
వీళ్ళు నా చాన్స్ లు కొట్టేశారు!

తెలుగు సినిమాకు సంబంధించి అది ఒక అరుదైన కుటుంబం. తండ్రి - వెన్నెలకంటి (రాజేశ్వర ప్రసాద్) గీత రచయిత, అనువాద చిత్రాల మాటల రచయిత. పిల్లలిద్దరూ అక్షరాలా ఆయనకు వారసులయ్యారు. పెద్ద కొడుకు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాల మాటల రచయితగా పదేళ్ళలో ఉన్నతశిఖరాలను అధిరో హించారు. చిన్న కొడుకు రాకేందు మౌళి నేరు చిత్రాలకూ గీత రచయిత, గాయకుడుగా పేరు తెచ్చుకుం టున్నారు. రానున్న ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే...’ చిత్రం ఈ ముగ్గురితో ఒక అరుదైన విన్యాసానికి సాక్ష్యమైంది. ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు వెన్నెలకంటి పాట, శశాంక్ మాట, హీరోగా రాకేందు ఆట- తెరపై అలరించనున్నాయి. బహుశా ఒక కుటుంబం నుంచి ఏకకాలంలో ముగ్గురు రచయితలు బిజీగా రచన చేస్తుండడం, ఒకే సినిమాకు ముగ్గురూ కలసి పనిచేయడం తెలుగులో అపూర్వ విషయమే. ఈ అరుదైన విన్యాసానికి కారకులైన ముగ్గురినీ ఒకచోట చేర్చి, జరిపిన ప్రత్యేక సంభాషణ... ‘ఫ్యామిలీ’ పాఠకులకు ట్రిపుల్ ధమాకా...
 
కుటుంబం మొత్తం సినీ రచయితలైపోయారు. ఎలా ఉంది?

వెన్నెలకంటి: (నవ్వేస్తూ...) ఇప్పుడు కాదు... మా నాన్న గారి నుంచే మాది సినిమా కుటుంబం. ఏయన్నార్‌ను ‘శ్రీసీతారామ జననము’ (1944) చిత్రంతో హీరోగా పరిచయం చేసిన దర్శక - నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు, మా నాన్న గారు కోటేశ్వరరావు ఆబాల్యమిత్రులు. సినిమా ప్రొడక్షన్ విభాగంలో ఉన్న బలరామయ్య గారు దర్శక - నిర్మాతగా ఎదిగి, సంస్థకు ఏం పేరు పెడదామని మా నాన్న గారిని అడిగితే, ‘ఇదంతా నీ ప్రతిభే కదా! కాబట్టి ‘ప్రతిభా’ ఫిలిమ్స్ అని పేరు పెడదాం’ అని అన్నారట. ఆ సంస్థలో నిర్మించిన చిత్రాల్లో టైటిల్ కార్డుల్లో కూడా దర్శక - నిర్మాత బలరామయ్యగారి పేరుకు ముందుగా, చీఫ్ టెక్నీషియన్ల కన్నా పెద్ద పీట వేస్తూ ‘ప్రొడక్షన్ చీఫ్ - వి. కోటేశ్వర రావు’ అని మా నాన్న గారి పేరు పడేది. ఎప్పటికైనా నా పేరు కూడా అలా వెండితెర మీద చూసుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. బి.కామ్ చదివి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ, సినిమా రచయితగా ఈ రంగానికి వచ్చాను. వెన్నెలకంటి అనే మా ఇంటిపేరుతో పాపులర్ అయ్యాను. గీత రచయితగా తొలి అవకాశం దర్శక - నిర్మాత, నటుడు ప్రభాకరరెడ్డి గారు ఇస్తే, నన్ను ప్రోత్సహించి ఇంతవాణ్ణి చేసింది - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలు గారికి సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి గారెంత చేశారో, బాలు గారు నాకు అంతకన్నా ఎక్కువ చేశారు. ఆయన లేకపోతే నేను లేను.
 శశాంక్ వెన్నెలకంటి: డబ్బింగ్, నేరు సినిమాల రచయితగా పదేళ్ళ క్రితం మొదలైన నా ప్రస్థానం వెనుక చాలామంది ప్రోత్సాహం ఉంది. నేను మొదలైంది అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా! ఏడో తరగతి చదువుతున్న రోజుల నుంచి స్కూల్‌లో నాటకాలు వేస్తూ, బహుమతులు సంపాదించా. హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’ను తెలుగులోకి అనువదించే అవకాశం నాన్న గారికి వచ్చినప్పుడు, మా నాన్న గారి అసిస్టెంట్ రచయిత మల్లూరి వెంకట్ ఆ సినిమాలోని ఒక చిన్న పిల్లాడి పాత్రకు నాతో డబ్బింగ్ చెప్పించారు.

అప్పటి నుంచి నన్ను ఈ రంగంలో బాగా సాది, తీర్చిదిద్దింది - ఘంటసాల గారబ్బాయి రత్నకుమార్. ఆయనే నా గురువు. సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తారాకృష్ణ నాకు ఎంతో నేర్పించారు. బాలనటీనటులతో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణం’లో రావణ పాత్రధారిణికి నేను చెప్పిన డబ్బింగ్ బాగా గుర్తింపు తెచ్చింది. మా నాన్న గారితో పాటు వసంతకుమార్, శ్రీరామకృష్ణ, రాజశేఖర రెడ్డి గార్ల లాంటి ప్రసిద్ధ డబ్బింగ్ రచయితలందరి దగ్గరా పని చేశాను. వారి ప్రోత్సాహం, ప్రేరణ నాకెంతో ఉపకరించాయి. రోహిత్, సచిన్ లాంటి హీరోలకూ డబ్బింగ్ చెప్పా. తమిళ హీరో శింబుకు ‘కుర్రాడొచ్చాడు’ చిత్రానికి డబ్బింగ్ చెప్పాక ఆ తరువాత ‘మన్మథ’తెలుగు అనువాదానికి వచ్చినప్పుడు నిర్మాత - బాలూ గారి బంధువైన శివలెంక కృష్ణప్రసాద్, తాడేపల్లిగూడెం కె. విజయ భాస్కరరెడ్డిల ప్రోత్సాహంతో అనుకోకుండా ఆ సినిమాకు రచయితనయ్యా. వాళ్ళు రాయమని అడగగానే, రాస్తానన్నా. ఆ ‘మన్మథ’ చిత్రం, ఆ వెంటనే రాసిన ‘గజని’, ‘పందెంకోడి’ చిత్రాలు హిట్టయ్యేసరికి ఇక అనువాద రచయితగా స్థిరపడ్డా. అప్పటి నుంచి ఈ పదేళ్ళలో దాదాపు  200 సినిమాలకు రచన చేశా. తమ్ముడు కూడా సినీ గీత రచన, గానంతో మొదలుపెట్టి ఇప్పుడు హీరో అయ్యాడు.
     
వారసుల్ని తేవడంలో మీ నాన్న గారి ప్రమేయం?


వెన్నెలకంటి: (అందుకుంటూ...) నా ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళకు సినిమా పట్ల ఆసక్తి ఉంది. అన్నద మ్ములిద్దరూ ఒకరికొకరు సలహాలిచ్చుకుంటారు. రాకేందుకు హీరో అవకాశమిస్తూ ఎస్పీ చరణ్ వాళ్ళు అడిగినప్పుడు కూడా వాడు, వాళ్ళ అన్నయ్య సలహా అడిగి, ఆ తరువాత వాళ్ళ అమ్మ ప్రమీలకు చెప్పి, ఆఖరుగా నాకు తెలియజేశాడు (నవ్వులు). పెద్దవాడేమో విజువల్ కమ్యూనికేషన్ చదివి, సినీ రచన వైపు వచ్చాడు. చిన్నవాడేమో లక్షల ఖర్చుపెట్టి, నేను ఇంజనీరింగ్ చదివిస్తే, పాటల రచన, నటన వైపు వచ్చాడు. వాళ్ళ ఆసక్తిని నేనెప్పుడూ నిరుత్సాహ పరచలేదు. నమ్మి, వదిలిపెట్టాను. అదే సమయంలో వాళ్ళ రచన, నటన విషయంలోనూ నేనేమీ జోక్యం చేసుకోను. కాకపోతే, వాళ్ళు చేసింది, రాసింది చూపించినప్పుడు ‘బాగుంది, బాగా లేదు’ అనే జడ్జిమెంట్ మాత్రం చెబుతుంటా.

గీత రచయితగా, గాయకుడిగా పేరొస్తున్న రాకేందుకు నటించాలన్న కోరిక ఎలా వచ్చింది?  
 
రాకేందు మౌళి: మా నాన్న గారు లక్షల ఖర్చుపెట్టి ఇంజనీరింగ్ చదివించారన్న మాటే కానీ, చిన్నప్పటి నుంచి నా దృష్టి అంతా సినిమా మీదే! వెన్నెలకంటి: మా ఆవిడకు సంగీతం, నృత్యం బాగా ఇష్టం. అందుకే, వీణ్ణి ఎలాగైనా సింగర్‌నీ, డ్యాన్సర్‌నీ చేయాలని, అవి నేర్పించింది. కర్ణాటక సంగీతం వీడికి ఎంత బాగా వచ్చంటే... నెల్లూరులో ఇప్పటికి 50 ఏళ్ళుగా భిక్షాపూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలు జరుగుతున్నాయి. ఎస్పీబీ నాన్న గారైన సాంబమూర్తి గారు ప్రారంభించిన ఆ ఉత్సవాల్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తప్ప మహామహులంతా పాడినవారే. ప్రతిష్ఠాత్మకమైన ఆ ఉత్సవాలలో మా వాడు కచ్చేరీలిచ్చాడు.

అందుకేనా రాకేందు గాయకుడిగా మొదలుపెట్టారు?

రాకేందు: (నవ్వేస్తూ...) ముందు పాటలు రాశా. ‘ఆవారా’ సినిమా పాటల సీడీ కూడా విడుదలయ్యాక, సినిమా చివరలో ఒక పాట వస్తుందని చెప్పారు. ఒక్క రోజులో మిక్సింగ్‌కు వెళ్ళిపోవాలి. అన్నయ్య, నాన్న బిజీగా ఉన్నారు. దాంతో ఆ పాట నేనే రాశా. అలాగే, ‘షాపింగ్ మాల్’లో, ఇంకా కొన్ని చిత్రాల్లో రాశా. నేరు తెలుగు చిత్రం ‘అందాల రాక్షసి’కి ఆ చిత్ర దర్శకుడు నాతో పాట రాయించి, పాడించారు. అలాగే, ‘సాహెబా - సుబ్రహ్మణ్యం’ సినిమాలో పాటలన్నీ నేను రాసినవే. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో కూడా రెండు పాటలు రాశా. మొత్తం 70 దాకా పాటలు రాశా. కొన్ని పాటలు పాడా. ‘అందాల రాక్షసి’లో నేను రాసిన ‘ఏమిటో...’ పాట ఏకగ్రీవంగా హిట్టయింది. ఇక, నేనే రాసి, పాడిన ‘మనసు పలికే’ పాట ‘రేడియో మిర్చి’ అవార్డుల్లో ఉత్తమ వర్ధమాన గాయకుడిగా, రచయితగా అవార్డు తెచ్చింది.

శశాంక్: నేనూ ‘రైడ్’, ‘శంభో శివశంభో’ లాంటి నేరు చిత్రాలకు మాటలు, కొన్ని సినిమాల్లో పాటలూ రాశా.  

 ఒకే ఇంట్లో ముగ్గురు రచయితలు... మీ మధ్య మీకే పోటీ!
 
వెన్నెలకంటి: వీళ్ళిద్దరూ రచయితలై, నా అవకాశాలు కొట్టేశారు. (నవ్వులు...) తమాషాలు పక్కనపెడితే, సినీ రచయితలైన సీనియర్ సముద్రాల గారు, వారి అబ్బాయి సముద్రాల జూనియర్ లాంటి మహామహులకు దక్కిన అదృష్టం నాకూ, మా కుటుంబానికీ దక్కడం ఆనందం.

రాకేందు: అయినా, మాలో ఎవరి రచనా విధానం, శైలి వారిదే! పాటలోని ఆ టెక్చర్‌లోనే తేడా కనిపిస్తుంది.
     
ఇంతకీ ‘మూడు ముక్కల్లో...’ అవకాశం ఎలా వచ్చింది?

 
రాకేందు: అదో చిత్రమైన కథ. గతంలో ఎస్పీ చరణ్ తమిళంలో నిర్మించిన ‘అరణ్యకాండమ్’ తెలుగు అనువాదం జరుగుతున్నప్పుడు అన్నయ్య శశాంక్ బిజీగా ఉన్నాడు. దాంతో, కొంత నేను రాశా. ఆ పరిచయంతో చరణ్ ‘మూడు ముక్కల్లో...’కి నన్ను రచయితగా ఎంచుకున్నారు. గతంలో నేను నటించిన షార్ట్ ఫిల్మ్ చూసి, నన్నే హీరో పాత్ర చేయమని అడిగారు. కోదండ పాణి గారి మనుమరాలి ళ్ళిలో అడిగారు.  

 శశాంక్: (మధ్యలో అందుకుంటూ...) రాకేందు నాకు ఫోన్ చేసి అడిగాడు. ఒప్పుకోమని చెప్పా. ‘నటన, రచన - రెండూ చేయడం కష్టం కాదా’ అని వాళ్ళడిగితే ‘అన్నయ్య రచన చేస్తాడ’ని చెప్పమన్నా. రచయితనుకున్న రాకేందు హీరో అయ్యాడు.
 రాకేందు: నిజం చెప్పాలంటే, సినీ రూపకల్పనలో ప్రతిపనీ నాకు ఇష్టమే. ఏ పని అయినా ఇష్టంగా చేసేస్తా. ‘మూడుముక్కల్లో...’ కూడా ఒక పక్కన నటిస్తూనే, నా షాట్ అయిపోగానే దర్శకత్వ విభాగంలో సహాయపడేవాణ్ణి. ఆడుతూ, పాడుతూ సినిమా చేసేశాం. దీని కన్నా ముందు సముద్రకణి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తయారైన ‘జెండా పై కపిరాజు’కి దర్శకత్వ శాఖలో పనిచేశా.
 
ఒకేసారి నటన, రచన, దర్శకత్వం చేయడం?

 వెన్నెలకంటి:  కష్టం. కానీ, ఇష్టం ఎక్కువున్నప్పుడు కష్టమనిపించదు. సమతూకం చేసుకోగలిగితే సాధ్యమే.
 శశాంక్: ఎస్పీబీ గారి ద్వారానే నాన్న నిలదొక్కుకు న్నారు. నేనూ సీరియల్స్‌లో ఎస్పీ చరణ్‌కు డబ్బింగ్ చెప్పి, పేరు తెచ్చుకున్నా. తమ్ముడికి కూడా ఎస్పీబీ కుటుంబపు సినిమాలో హీరో చాన్‌‌స రావడం విశేషం.
 రాకేందు: సెంటిమెంటల్‌గా మాకు అది అచ్చొచ్చింది.
     
ఇంతకీ ‘మూడు ముక్కల్లో...’ విశేషాలేంటి?

 
వెన్నెలకంటి: ఏకకాలంలో తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటిలో దర్శకురాలు మధుమిత తీసిన సినిమా ఇది. ‘మిథునం’ తరువాత లక్ష్మి, ఎస్పీబీ కలసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి నేను ఒక పాట రాశా. శశాంక్ మాటలు రాశాడు. రాకేందు నటించాడు.  
     
అంటే, ఇది మీ కుటుంబ చిత్రమన్నమాట...
 
వెన్నెలకంటి: (నవ్వేస్తూ...) ఎస్పీబీ ఈ సినిమాలో నటిస్తూ, పాడారు. నిర్మాత ఎస్పీ చరణ్ కూడా ఒక చిన్న వేషం వేశారు. వెంకీ పోషించిన పాత్రకు ఎవరి గొంతూ సరిపోక, తెలుగులో తానే డబ్బింగ్ చెప్పారు. ఇక, ఎస్పీ చరణ్ చేసిన చిన్న వేషానికేమోశశాంకే డబ్బింగ్ చెప్పాడు. అలా ఇది మా ఒక్క కుటుంబమే కాదు, మాది, ఎస్పీబీదీ రెండు కుటుంబాల కథా చిత్రం.
     
ఒకరి గురించి మరొకర్ని మూడు ముక్కల్లో చెప్పమంటే?

వెన్నెలకంటి: (శశాంక్ గురించి) పేరునిలబెట్టే వారసుడు!
శశాంక్: (తమ్ముడు రాకేందు గురించి...) ఆట, పాట, మాట - మూడింటికీ ఒక కొత్త అడ్రస్.
 రాకేందు: (తండ్రి వెన్నెలకంటి గురించి...) మంచితనం, మానవత్వం పుష్కలంగా ఉన్న మనసున్న మనిషి.
ఫొటోలు: శివ మల్లాల
రెంటాల జయదేవ
 
శశాంక్: ‘కష్టపడి పనిచేస్తే సాధించ లేం. ఇష్టపడి చేస్తే సాధించగలం’ అని ‘గజని’లో రాసిన డైలాగే నాకు ఆదర్శం. డబ్బింగ్ రచన చేస్తున్న ప్పుడు కూడా నవతరం ప్రేక్షకులకు తగ్గట్లు ఆ రంగంలో ఏ మార్పు తీసుకురాగలనని ప్రయత్నించా. సక్సెస్ అయ్యా. డబ్బింగ్ చెప్పడం, నటించడం, మాటలు రాయడం, పాటలు రాయడం - ఇలా అన్నీ చేసినా, దర్శకత్వంపై మక్కువ. మంచి స్క్రిప్టుతో, కొత్త నటులతో, కత్తి మీద సామైన దర్శకత్వంలో పేరు తెచ్చుకోవాలని నా కోరిక.
 
వెన్నెలకంటి: అప్పటి సముద్రాల నుంచి ఇవాళ్టి శ్రీమణి దాకా ఎవరు ఏ మంచి పాట రాసినా అది నాకు అభిమాన పాటే. ఆ రచయితకు నేను అభిమానినే. కాకపోతే ఆత్రేయ, వేటూరి గార్లకు పరమభక్తుణ్ణి. నా పాటలైనా చరణాలు కొంత గుర్తుం డవేమో కానీ, పాత పాటలన్నీ నాకు కంఠోపాఠం. పైగా, ఇతరులు రాసిన మంచి పాటలు గుర్తుంటే అలాంటివి రాయాలన్న స్పర్థతో బాగా రాస్తాం. 50 వేల పాటలు పాడినా, ఇప్పటికీ ప్రతిపాటా తొలి పాటలా శ్రద్ధగా పాడే ఎస్పీబీ మార్గం నాకు ఆదర్శం.
 
రాకేందు: లక్షలు ఖర్చుపెట్టి మా నాన్న గారు ఇంజనీరింగ్ చదివించారు. కానీ, నా మనసంతా సినిమానే. అందుకే, ఇటొచ్చా. ఒకవేళ ఇంజనీర్‌నై ఉంటే, మధ్యరకం ఇంజనీర్‌గా మిగిలే వాణ్ణి. కానీ, ఇష్టపడి సినిమాల్లోకి రావడంతో పరిస్థితి వేరుగా ఉంది. ఫలానావాళ్ళ అబ్బాయినని చెప్పుకొనే కన్నా, కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడాలనేది నా తపన. రచయితగా మా నాన్నగారు తొలి గురువు. సింగర్‌గా బాలూ గారి ఏకలవ్య శిష్యుణ్ణి. నటనలో చిరంజీవి, రజనీ కాంత్ గార్ల ఫ్యాన్‌ని. కమల హాసన్ గారిలా ఆల్‌రౌండర్‌నవ్వాలని కోరిక.
 

మరిన్ని వార్తలు