అమెరికా పోలీసుల అరాచకం!: పాస్కోలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

అమెరికా పోలీసుల అరాచకం!: పాస్కోలో ఉద్రిక్తత

Published Sun, Feb 15 2015 3:00 AM

ఆంటోనియో జాంబ్రానో మంటీస్ అనే మెక్సికన్ వలసదారుడిపై గురి పెట్టిన అమెరికా పోలీసులు

 లాస్ ఏంజలిస్: అమెరికా పోలీసుల దుందుడుకు స్వభావానికి తాజాగా మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని పాస్కో నగర పోలీసులు ఒక మెక్సికన్ వలసదారుణ్ని తమపై రాళ్లు విసిరాడన్న కారణంతో  కాల్చి చంపారు. ఈ ఘటనను ఓ వ్యక్తి  సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియో ద్వారా జరిగిన సంఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది కాలంగా శ్వేత జాతి పోలీసులు నిరాయుధులైన శ్వేతేతరులను కాల్చి చంపుతున్నారని దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యం ప్రకారం ముగ్గురు పోలీసు అధికారులు ఆంటోనియో జాంబ్రానో మంటీస్ అనే మెక్సికన్ వలసదారుడిపై గురి పెట్టారు. అదుపులోకి తీసుకొవాలని ప్రయత్నించగా మాంటీస్ తమపై రాళ్లు విసురుతూ పారిపోయాడని, తప్పని పరిస్థితుల్లో అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాని వీడియోలో, కాల్పులు జరపడానికి కొద్ది సెకండ్ల ముందు అతను చేతులు పైకిత్తి పరుగెత్తుతున్న దృశ్యం కనిపిస్తోంది. వీడియో బయటకు రావడంతో నగర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

 మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియాతో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. జాంబ్రానో మాంటీస్ కుటుంబానికి అవసరమైన సహకారం అందించాలని తన విదేశాంగ మంత్రిని ఆదేశించారు. నిరసన కారులు గతేడాది జరిగిన ఆఫ్రో అమెరికన్ యువకుడు మైకేల్ బ్రౌన్ హత్యను గుర్తుచేస్తూ మరో 'ఫెర్గుసన్'కోరుకోవడంలేదని నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాస్కో పోలీసులు నగరంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్‌స్లీ తెలిపారు.

Advertisement
Advertisement