పొట్ట కండరాలకు గట్టి వ్యాయామం

24 Aug, 2016 22:59 IST|Sakshi
పొట్ట కండరాలకు గట్టి వ్యాయామం

మనిషి లావయ్యాడనికి మొదట చెప్పేది పొట్టే. వేగంగా కొవ్వు పేరుకుపోయి, శరీరాకృతిని మార్చివేసేదీ పొట్టే. ఆ సమస్య రాకుండా ఉండాలంటే పొట్ట కండరాలకు కాస్త పని పెట్టాలి. ఈ ఆసనాలు ప్రయత్నించాలి.

 

చాలన ఉత్కటాసన
ఆసనంలో నిలబడి కాళ్లు రెండింటి మధ్య వీలైనంత (నిడివి) దూరం ఉంచాలి. రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి, చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసి ఎడమచేతి బొటన వేలును పైకి నిలబెట్టి, శక్తి ముద్ర (ఎనర్జింగ్ ముద్ర లేదా లింగముద్ర అని కూడా అంటారు)లో ఉంచి శ్వాస వదులుతూ ఫొటోలో చూపిన విధంగా ఎడమ మోకాలు పూర్తిగా వంచి ఎడమవైపుకి క్రిందకి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి మళ్ళీ శ్వాస వదులుతూ రెండోవైపుకి కూర్చోవాలి. పైకి లేవడం క్రిందకు కూర్చోవడం కష్టంగా అనిపిస్తే చేతులు కిందపెట్టి సపోర్ట్ తీసుకోవచ్చు. మోకాలి సమస్య ఉన్నవాళ్లకు ఈ ఆసనం సరియైనది కాదు. దీని వల్ల సీటు, కాళ్లలోని కండరాలు గ్లూటియస్ మెడియస్, గ్లూటియస్ మాక్సిమస్, బెసైప్స్ ఫెమొరిస్, కాఫ్ మజిల్స్... మొదలైన కండరాలు బాగా బలపడతాయి. గ్రోయిన్ రిజియన్  తెరుచుకోవడానికి దోహదపడుతుంది.

 

ఏకపాద అధోముఖ శ్వాసాసన
శ్వాస తీసుకుంటూ కుడికాలిని పైకి లేపి బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. పైకి లేపిన కాలును మడచి పాదాన్ని ఎడమ పక్కకు కూడా పడవేయవచ్చు. శ్వాస వదులుతూ కుడికాలుని కిందకు, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని పైకి తీసుకువెళ్ళి సాధన చేయవచ్చు. ఈ ఆసనంలో చేసే వైవిధ్యమైన భంగిమలు అన్ని కూడా పెల్విక్ రీజియన్, నడుము, కాళ్లు బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. తలనొప్పి, పార్శ్వనొప్పి (మైగ్రెయిన్) ఇన్సోమియా, ఫాటిగ్యూ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెనుకకు రావాలంటే రెండు మోకాళ్లు శ్వాస వదులుతూ నేల మీద ఆనించి మార్జాలాసనంలో నడుమును రిలాక్స్ చేయాలి. ఈ ఆసనంలో నడుము భాగం మీద బాగా పనిచేస్తాం కనుక ఆసనం తరువాత నడుముకు, ఊపిరితిత్తులకు తగినంత విశ్రాంతి అవసరం.

ఎ.ఎల్.వి.కుమార్  ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్

మరిన్ని వార్తలు