ఉత్తుంగ తరంగ గంగ

21 Apr, 2018 00:02 IST|Sakshi

చెట్టు నీడ

నేడు గంగావతరణం

తన పితరులకు మోక్షం కలిగించడం కోసం భగీరథుడనే మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేసి, దివినున్న గంగను భువికి రప్పించాడు. అయితే, అలా కిందికి వచ్చే క్రమంలో గంగ తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది. కుపితుడైన జహ్నుమహర్షి తన ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గంగానదిని తన యోగశక్తితో ఔపోసన పట్టాడు. మహర్షి ద్వారా జరిగింది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని పరిపరి విధాలా ప్రార్థించాడు. మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. జహ్నుమహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల భస్మరాశులపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది. గంగను భువికి రప్పించే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, వెనక్కు తగ్గకుండా, ఏమాత్రం చలించకుండా తన ప్రయత్నంలో సఫలీకృతుడైన భగీరథుడి పేరు ప్రయత్న రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

పవిత్రమైన గంగలో మునిగితే ఎంతటి పాపమైనా తొలగిపోతుందన్నది ప్రగాఢ విశ్వాసం. అయితే, అంతటి పవిత్రమైన గంగను కూడా కలుషితం చేసి, నిర్మలమైన గంగాజలాలను విషపూరితం చేసేస్తున్నాయి పరిశ్రమల వ్యర్థాలు, కర్మాగారాల నుంచి వెలువడే విషరసాయనాలు. దాంతో గంగలో స్నానం చేస్తే సంక్రమించే పుణ్యం సంగతి ఎలా ఉన్నా, చర్మవ్యాధులు సంక్రమిస్తాయేమోనని భయపడ వలసి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే గంగాప్రక్షాళన జరగాలి. అందుకు చిత్తశుద్థితో చెత్తశుద్ధి జరగాలి. గంగ అంటే నదే కాదు, నీరు కూడా. నీటితో మనం శుభ్రపరచుకోవడమే కాదు, నీటిని కలుషితం చేయడం మానాలి. నీళ్ల సీసాలు, చెత్తాచెదారాన్ని నీళ్లలో పడేయడం మానాలి. గంగాప్రక్షాళన్‌ పేరుతో ప్రధాని ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ప్రధానమైన మార్పు రావలసింది ముందుగా మనలోనే. 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు