సాలగ్రామ ప్రాశస్త్యం

15 Jul, 2018 01:04 IST|Sakshi

సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అద్వైత విశిష్టాద్వైత ద్వైతాలను బోధించిన త్రిమతాచార్యులు ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు సాలగ్రామాలను పూజించ వలసిన ఆవశ్యకతను తమ తమ రచనల్లో వివరించారు. నేపాల్‌లోని గండకీ నదీతీరంలో ఇవి విస్తారంగా లభిస్తాయి. వీటిపై ఉన్న గుర్తుల ఆధారంగా వీటిలోని రకాలను నిర్ణయిస్తారు. ఒక్కో రకమైన సాలగ్రామాన్ని ఒక్కో రకమైన పూజల కోసం వినియోగిస్తారు.

నిత్యపూజలు, శ్రాద్ధ కర్మలు, గ్రహణ సమయాల్లో జరిపే ప్రాయశ్చిత్త క్రతువులు, యజ్ఞయాగాలు వంటివి సాలగ్రామాల సమక్షంలో జరిపినట్లయితే అనంత ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామాలను శాస్త్రోక్తంగా పూజించడం ఎంతగా ఫలమిస్తుందో, సాలగ్రామాలను దానం చేయడం వల్ల అంతకు మించిన ఫలితం లభిస్తుంది. గిరులు, ఝరులు, సాగరులతో కూడిన సమస్త భూమండలాన్ని దానం ఇవ్వడం వల్ల లభించే ఫలితం కంటే ఒక్క సాలగ్రామ శిలను దానం చేయడం వల్ల ఎక్కువ ఫలితం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది.

సాలగ్రామాలను అభిషేకించిన జలం పవిత్ర నదీజలాలతో సమానం. అంతిమ క్షణాల్లో సాలగ్రామ అభిషేక జలాన్ని సేవించినట్లయితే, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, మనశ్శాంతి లోపించిన వారు, క్షుద్ర ప్రయోగాల బారినపడి ఇక్కట్లు పడేవారు సాలగ్రా మాలను పూజించినట్లయితే ఉపశమనం లభిస్తుంది. గ్రహదోషాల వల్ల ఏర్పడే సమస్యలు సాలగ్రామ దానం వల్ల తొలగిపోతాయి.

– పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు