మనమే చొరవ చూపాలి

9 Jan, 2014 00:27 IST|Sakshi
మనమే చొరవ చూపాలి

‘‘ఏంటే... ఎప్పుడూ అలా ఒంటరిగా ఉంటావ్. సరదాగా ఉండొచ్చుగా’’... ఆఫీసు నుంచి వస్తూనే స్నేహితురాలితో అంది రవళి.

 ‘‘ఎలా ఉంటాను? ఇక్కడ నాకెవరూ తెలీదు. పైగా కొత్త ప్రదేశం. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’... దిగులుగా అంది గాయత్రి.

 రవళి నవ్వింది. గాయత్రి సమస్య ఆమెకు తెలుసు. డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ కోర్సు చేయడానికి పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చింది. ఇక్కడి అమ్మాయిల దూకుడు చూసి వచ్చీ రావడంతోనే కంగారుపడింది. వాళ్లలా తాను లేను కాబట్టి, వాళ్లతో కలవలేనని ముందే మనసులో పెట్టేసుకుంది. దాంతో గదిలోనే ముడుచుకుని కూచుంటోంది. ఆ బెరుకును వీలైనంత త్వరగా వీడకపోతే ఆమె ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని రవళికి అర్థమైంది. అందుకే గాయత్రికి కొన్ని విషయాలు చెప్పింది. అవేంటంటే...
     
మనుషుల మీద ఆసక్తి పెంచుకోవాలి. వాళ్లెవరు, ఎలా ఉన్నారు, వాళ్లు ఏం చేస్తారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు అనేవన్నీ పరిశీలించాలి. దాన్నిబట్టి వాళ్లతో మనం ఎలా మెలగాలో మనకు అర్థమవుతుంది.
     
అందరూ నీలాంటివాళ్లే అని అనుకోవాలి. అంటే... అందరికీ పుట్టుకతోనే అన్నీ రావు. వాళ్లు కూడా మనలాంటి వాళ్లే అయి ఉండొచ్చు. తర్వాత అన్నీ నేర్చుకుని ఉండొచ్చు. ప్రయత్నిస్తే మనమూ అలా అవుతాం కదా!
 
నీ బలహీనతలను ఒప్పేసుకోవాలి. ఇతరుల్లా తయారవడం, మాట్లాడటం మనకు రాకపోవచ్చు. దానికి సిగ్గుపడి దూరంగా ఉండిపోనక్కర్లేదు. నాక్కూడా అలా ఉండటం నేర్పిస్తావా అని అడగవచ్చు, నేర్చుకోవచ్చు.
 
అభిమానించడం నేర్చుకోవాలి. ఒక మనిషితో మనం మాట్లాడాలంటే ముందు వారి మీద ఇష్టం పెంచుకోవాలి. ఇష్టం దూరాన్ని తగ్గిస్తుంది. అభిమానం ఉన్నప్పుడు అవతలివాళ్లు ఒక మాట అన్నా నొచ్చుకోం.
 
మెచ్చుకోలు మంచి బంధాన్ని పెంచుతుంది. అవతలివారి దగ్గరకు వెళ్లి... మీ మాట తీరు బాగుంటుంది, మీరు చక్కగా ఉంటారు అంటూ ప్రశంసిస్తే వాళ్లు మన లోపాలను ఎత్తి చూపరు. మనకు దగ్గరవుతారు.
     
మనమే ముందుండాలి. పరిచయం చేసుకోవడంలోనైనా, పలకరించడంలోనైనా, స్నేహం చేయడంలోనైనా మొదటి అడుగు మనమే వేయాలి. వాళ్లంతా ఎప్పటి నుంచో ఉన్నవాళ్లు. కొత్తగా వచ్చినవాళ్లని కలుపుకోవాల్సిన అవసరం వారికి లేకపోవచ్చు. కాని వారి తోడు కొత్తగా వచ్చినవారికి అవసరం. అందుకే ఎవరో పలకరిస్తారని చూడకుండా మనమే వాళ్లకి హాయ్ చెప్పాలి. నాలుగుసార్లు పలకరిస్తే ఐదోసారి వాళ్లే మనల్ని పలకరిస్తారు. పరిచయం పెరిగి స్నేహితులవుతారు.
 
సరళ మాటలతో ఎక్కడ లేని హుషారొచ్చేసింది గాయత్రికి. తను చెప్పినవన్నీ చేయాలని నిర్ణయించుకుంది. వారం పది రోజుల్లోనే ఫలితం కనిపించింది. ఇప్పుడామెకి అందరూ స్నేహితులే. సరళ చెప్పినవి గాయత్రికే కాదు... అందరికీ పనికొస్తాయి. కావాలంటే ప్రయత్నించి చూడండి!
 

మరిన్ని వార్తలు