చెంబుడు నీళ్లు 

23 Feb, 2018 00:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మళ్లీ చెప్పుకుందాం!

రీటోల్డ్‌ కథలు – 13

వలీమా ధూమ్‌ధామ్‌గా జరిగింది. అంటే ఏం లేదు. ఇరవై కిలోల దొడ్డు బియ్యంలో పది కిలోల మటన్‌ ముక్కలు కలిపి, కొత్తిమీర అల్లం లొస్సన్‌ వేసి బిరియానీ వొండి అడిగినవారికి అడిగినంత ఆకులో వేయడమే. పెళ్లి చేయడం ఆడపెళ్లివాళ్ల వంతు. వలీమా చేయడం మగపెళ్లివాళ్ల వంతు. వలీమా బాగా జరగడం కొత్త పెళ్లికూతురికి సంతోషం కలిగించింది. అబ్బాయి యోగ్యుడు. సొంతగా సైకిల్‌ షాపు ఉందంటే యోగ్యుడే. యాభై వేలే తీసుకున్నాడు. ఎక్కువ బంగారం అడగలేదు. పలుచగా పొడవైన వేళ్లతో ఉన్నాడు కనుక చక్కగా నవ్వుతున్నాడు కనుక కొడతాడనే భయం మొదటి చూపులోనే లేదు. అత్తగారు స్నేహశీలి. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ముసలామె మాటకారి. ఇద్దరు ఆడపడుచులు. కదిలే తిరిగే ఇంట్లో వచ్చి పడింది. కదిలే తిరిగే ఇల్లేనా? బస్టాండ్‌ దాకా కదలొచ్చు. తర్కారీకి వెళ్లొచ్చు. టైలర్‌ షాపుకు పోయి రావచ్చు. కాలేజీకి వెళ్లి రావచ్చు. నీళ్లబావి దాకా రాకపోకలు కొనసాగించవచ్చు. కానీ అక్కడకు మాత్రం వెళ్లడానికి లేదు. ఎక్కడకు?  అక్కడికే. అల్లామియా ఆడవాళ్ల కోసమే రాత్రిళ్లు సృష్టించాడు. అబ్బ ఎంత మంచి దేవుడు ఆయన. రాత్రి లేకుంటే ఆడవాళ్ల బతుకు ఏంగాను. చెంబు తీసుకొని, లోటా తీసుకొని, ప్లాస్టిక్‌ సీసాతో, ఒకరికొకరు కూడబలుక్కుని రాత్రి చీకటిలో అలా తుప్పల్లోకి వెళ్లి వస్తారు. చిన్నప్పుడు అలా వెళ్లడం బాగుండేది. కానీ ఊహ తెలిశాక, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తండ్రి దానిని కట్టించాడు. అమ్మ చెవి కమ్మలు గిర్వీ పెట్టి, తెలిసిన ఇటుకల బట్టీ ఆయన ఉంటే బతిమిలాడుకుని, బేల్దారును మంచి చేసుకొని, సీలింగ్‌ రేకు కొని... ఉన్నవాళ్లకు ఇది చీమ. లేనివాళ్లకు ఇదే ఏనుగు.

అమ్మకు భలే జుగుత్‌ ఉండేది. ఇల్లు నీట్‌గా పెట్టేది. దానిని కూడా. రోజూ నిర్మా చల్లి కడిగేది. ఇది బంధువుల్లో చోద్యం. దానిని కూడా తోముతారా. యాక్‌. తోమకపోతేనే యాక్‌.ఈ యాక్‌కి భయపడే బంధువుల ఇళ్లకు వెళ్లేది కాదు. వెళ్లినా రాత్రిళ్లు ఉండేది కాదు. ఉదయం పూట వెళ్లాల్సి వస్తుంది గదా. దానినెందుకు అంత గలీజుగా ఉంచుకుంటారు?‘ఇంటిని చక్కబెట్టుకోవడానికే టైము లేదు. దాన్ని కూడా ఎక్కడ చక్కదిద్దేది’ అనింది ఒక బంధువులామె.వంట చేసి, పిల్లల్ని చూసుకుని, బట్టలుతుక్కుని, బాసన్లు కడుక్కుని, వాకిలి చిమ్ముకుని... ఇవిగాక ఉప్పు చింతపండుక్కూడా బజారుకు పరుగు దీస్తూ... అసలు మగాడనేవాడు లేచి రెండు బకెట్లు నింపి ఠాప్‌ ఠాప్‌ కొడితే ఎంత బాగుంటుంది. మగాళ్లు చేస్తారా? టేప్‌రికార్డర్‌లో ఖవ్వాలీలు వినమంటే వింటారు. కానీ ఈ పెళ్లికొడుకు చేసేలాగే ఉన్నాడు. చేస్తాడులే.

ఏం చేయడం. అసలు అది ఉంటే కదా. కాలేజీకి వెళ్లే ఇద్దరు ఆడపిల్లలు, తల్లి, ముసలామె ఉన్న ఇంట్లో అది లేకుండా ఎలా ఉంటుంది అనే భరోసాతో పెళ్లికి ముందు మాటమాత్రం కూపీ లాగలేదు. పెళ్లయ్యాక చూస్తే అది ఉంది. కానీ తన ఇంట్లోదాని లాగా లేదు. నాలుగు గోతం పట్టాలు నాలుగువైపులా కట్టి, ఒక గోతం పట్టాను తలుపులాగా వేలాడ దీసి.. ఇదా? లోపల ఒక మట్టిగొయ్యి... దానికి అటో కాలు... ఇటో కాలు వేసి కూచోడానికి ఇటుకరాళ్లు... ఆ గొయ్యిలో నిన్నటిదీ మొన్నటిదీ .... డోక్‌... డోక్‌... పెళ్లికూతురికి వాంతులు. ఆ తర్వాత కడుపు నొప్పి. వలీమాకు వచ్చిన పెళ్లికూతురు అత్తారింటి నుంచి మొదటి శుక్రవారం అయ్యేదాకా కదల కూడదు. ఈ అమ్మాయి వెళతానని కూచుంది. అన్నం తినదు. తింటే అది వస్తుందని చెప్పదు. కడుపునొప్పి అంటుంది. రాత్రయితే ఆడపడుచుని తీసుకొని తుప్పల్లోకి వెళ్లే సాహసం చేయగలదు. కాని ముస్లింలు అలా వెళ్లకూడదట. గోషా అట. చిన్నప్పుడు అల్లరి చేస్తే తల్లి నరకం గురించి చెప్పి భయపెట్టేది. తనకు మాత్రం నరకం అంటే ఆ నాలుగు గోతం పట్టాల మధ్య ఉన్నదే.
పూలంటే ఇష్టం పండ్లంటే ఇష్టం అని చెప్పాల్సిన కొత్త పెళ్లికూతురు నాకు సిమెంటుతో కట్టి నీటుగా ఉంచిన అదంటే ఇష్టం అని భర్తతో నోరు తెరిచి ఎలా చెప్తుంది. మీ ఇంట్లో అది అసయ్యంగా ఉంది అని ఎలా చెప్తుంది. ఇలా ఉంటే నేను ఉండను అని ఎలా చెప్తుంది. 

‘మా ఇంటికి వెళ్తాను’ అంది. ఏమనుకున్నాడో ఏమో పెళ్లికూతురిని తీసుకొని బయలుదేరాడు. ఇంకా బంధువులు పూర్తిగా వెళ్లలేదు. తననే చూస్తున్నారు. అత్తగారు మనసు విప్పి మాట్లాడలేదు. తననే చూస్తోంది. ఆడపడుచులు సరదాలు సల్లాపాలు చేయలేదు. తననే చూస్తున్నారు. వెళుతోంది.తిరిగి వస్తుందా? మనసు గుర్రంలాగా పరుగు తీస్తోంది. వేరు కాపురం పెట్టించాలి. తన ఊరికే తీసుకెళ్లిపోయి అక్కడే పెట్టించాలి. అక్కడైతే ఇల్లుంది. ఇంట్లో అది ఉంది. అమ్మయ్య... అది ఉంటే కలిగే నిశ్చింత ఆడవాళ్లుగా పుడితేతప్ప తెలియదు. చెంబు పట్టుకుని నాకిప్పుడు అది వస్తోందహో అని ఊరందరికీ తెలిసేలా దారిలో నడవడం కంటే సిగ్గుతో చచ్చి భూమిలోకి పాతుకుపోవడమే మేలు అని ఈ మగవారికి ఎప్పటికి తెలుస్తుంది. ఇల్లు వచ్చింది. ఎలా ఉన్నావమ్మా– తల్లి ఎదురొచ్చింది.అక్కా– చెల్లెలు పరిగెత్తింది.కానీ నేరుగా వెళ్లి దానిలో దూరి తలుపు మూసుకుంది. కొత్తపెళ్లికూతురు పుట్టింట్లో మొదటగా దానినే పలకరించాల్సి రావడం కన్నా విషాదం ఉంటుందా? రాత్రి మాటల్లో తెలిసింది. ఇల్లు ఖాళీ చేస్తున్నారట. పెళ్లికి అప్పు ఇచ్చినాయన తనఖా తీరేదాక ఇందులోనే ఉంటానని అంటున్నాడట. ‘మరి ఇప్పుడు?’ ‘ఊరికి దూరంగా ఒక రేకుల ఇల్లు దొరికింది. చిన్నది.’ ‘అందులో అది ఉందా?’  ‘అదీ.. అదీ’..  జవాబు చెప్పబోతుంటే ఊపిరి బిగబట్టి ఉంది. కథ ముగిసింది. షాజహానా రాసిన ‘సండాస్‌’ కథ ఇది. అంటే ‘టాయిలెట్‌’ అని అర్థం. ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమకథ’లాంటి సినిమాలు దానికి కారణమైన ఘటనలు దేశంలో జరగకముందే 2004లో షాజహానా ఈ కథ రాశారు. ఇవాళ ప్రభుత్వం సాయం చేస్తున్నా కడుతున్నానని అంటున్నా సవాలక్ష పల్లెల్లో ఆడవాళ్ల పరిస్థితి నేటికీ ఇదే. ఒకవేళ కట్టుకున్నా శుభ్రం చేసే చాకిరీ ఆడవాళ్లదే. ‘దానిని కడగటం తప్ప ఏ పనైనా’ అని పని మనుషులు పని మాట్లాడుకుంటున్నారిప్పుడు. దానిని కడగటం తప్ప ఏ పనైనా అని పెళ్లి మాట్లాడుకోగలుగుతున్నారా ఆడవాళ్లు?
-పునః కథనం: ఖదీర్‌
∙షాజహానా 

మరిన్ని వార్తలు